సమయం సాయంత్రం 6 గంటల 2 నిమిషాలు.. వేదికపై రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్.. అభిమానులు ట్రంప్.. ట్రంప్ అంటూ నినాదాలు.. 'గాడ్ బ్లెస్ ది అమెరికా' అంటూ ట్రంప్ ప్రసంగం స్టార్ట్.. మండుడెండను లెక్కచెయ్యకుండా అభిమానుల కేకలు.. జో బైడెన్‌కు వ్యతిరేకంగా వలసలపై ఓ చార్ట్‌ను చూపించిన ట్రంప్.. ప్రసంగాన్ని అందరూ ఆసక్తిగా వింటున్నారు.. ఇంతలోనే సడెన్‌గా తుపాకీ కాల్పుల గర్జన.. అంతా నిశబ్దం.. స్టేజ్ పోడియం వద్ద కూర్చొండిపోయిన ట్రంప్.. ఏమైందని అభిమానులు, రిపబ్లికన్లలో ఆందోళన.. ట్రంప్ చెవి నుంచి రక్తం. ఇది అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దాడి జరిగిన సీన్.
90 డిగ్రీల ఫారెన్ హీట్ ఎండలో!
Trump Rally Scene : శనివారం సాయంత్రం అమెరికాలోని పెన్సిల్వేనియాలోని ఓ సభలో డొనాల్డ్ ట్రంప్ హాజరయ్యారు. ఉత్సాహంగా సభకు హాజరైన కార్యకర్తలు, అభిమానులకు అభివాదం చేశారు. 90 డిగ్రీల ఫారెన్ హీట్ ఉష్ణోగ్రతలోనూ సభకు హాజరైనవారు ట్రంప్.. ట్రంప్ అని నినాదాలతో హోరెత్తించారు. అమెరికాలోకి అక్రమ వలసలను నిరసిస్తూ జో బైడెన్‌కు వ్యతిరేకంగా ట్రంప్ ఓ చార్ట్‌ను ప్రేక్షకులకు చూపించారు. అంతలోనే తుపాకీ బుల్లెట్ల శబ్దం వచ్చింది. వెంటనే సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు ట్రంప్ పోడియం వద్దకు చేరుకున్నారు. అప్పటికే ట్రంప్ చెవిని పట్టుకున్నారు. అందులోనుంచి రక్తం కారుతోంది. సర్వీస్ ఏజెంట్లు కిందికి కూర్చొమని చెప్పడం వల్ల ట్రంప్ పోడియం నేల మీద కూర్చొండిపోయారు. అప్పుడు ఒక్కసారిగా సభా ప్రాంగణంలో నిశబ్ద వాతావరణం నెలకొంది. ట్రంప్‌నకు సర్వీస్ ఏజెంట్లు రక్షణగా ఉండి ఆయనను స్టేజ్ ఎడమవైపు తీసుకెళ్లారు. అప్పుడు వారికి 'వెయిట్ వెయిట్' అని అన్నారు ట్రంప్. తన ప్రచార సభకు వచ్చినవారికి ట్రంప్ పిడికిలిని చూపించారు. అనంతరం సర్వీస్ ఏజెంట్లు ట్రంప్‌ను బ్లాక్ ఎస్ యూవీలో ఆస్పత్రికి తరలించారు.