తెలంగాణ

telangana

ETV Bharat / health

చలికాలంలో ఏసీ వాడుతున్నారా? ఆస్థమా, ఇన్​ఫెక్షన్లతో జాగ్రత్త! ఈ చిట్కాలు పాటిస్తే సరి!!

-శ్వాస పదిలంగా ఉండాలంటే ఈ చిట్కాలు పాటించాలట -చలికాలంలో శ్వాసకోశ ఇబ్బందులపై వైద్యుల సలహాలు

Winter Health Tips in Telugu
Winter Health Tips in Telugu (Getty Images)

By ETV Bharat Health Team

Published : 4 hours ago

Winter Health Tips in Telugu:వాతావరణ పరిస్థితులు మారాయంటే చాలు.. చాలా మందిలో ఆరోగ్య సమస్యలు వస్తుంటాయి. చలికాలంలో అయితే, ఎక్కువగా శ్వాసకోశ సమస్యలు ముఖ్యంగా ఆస్థమా, శ్వాసనాళాలు దెబ్బతినటం (సీవోపీడీ), ఊపిరితిత్తుల్లో కన్నాలు (బ్రాంకైక్టాసిస్‌), ఇంటర్‌స్టీషియల్‌ లంగ్‌ డిసీజ్‌ (ఐఎల్‌డీ) జబ్బులు వేధిస్తుంటాయి. ఇంకా కొందరికి కొత్తగానూ వచ్చే అవకాశం ఉంటుందని పల్మనరీ మెడిసిన్ HOD, ప్రొఫెసర్ డాక్టర్ మహబూబ్​ఖాన్ వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే ఈ వ్యాధుల పట్ల మరింత అప్రమత్తగా ఉండాలని సూచిస్తున్నారు.

"చలికాలంలో తీవ్రమయ్యే శ్వాసకోశ సమస్యల్లో ప్రధానమైంది ఆస్థమా. ఇందులో ఆయాసం, దగ్గు, రాత్రి పూట పిల్లికూతల వంటి లక్షణాలు కనిపిస్తుంటాయి. ముఖ్యంగా పనిచేసే సమయంలో శ్వాస సరిగా ఆడక పోవటం, పిల్లికూతలు, విడవకుండా దగ్గు వంటి వాటితో తీవ్ర ఇబ్బందులు పడుతుంటారు. సీవోపీడీ కూడా తక్కువదేమీ కాదు. బ్రాంకైక్టాసిస్‌లో శ్వాసనాళాలు విప్పారి, కన్నాల పడి స్రావాలు లోపలే ఉండిపోయి, ఇన్‌ఫెక్షన్లకు దారి తీస్తుంది. ఫలితంగా దగ్గితే కళ్లె, రక్తం పడతాయి. ఒకప్పుడు తక్కువగా ఉండే ఇంటర్‌స్టిషియల్‌ లంగ్‌ డిసీజ్‌ కూడా ఎక్కువైంది. ఇందులో కార్బన్‌ డయాక్సైడ్, ఆక్సిజన్‌ మార్పిడి చేసే ప్రక్రియ దెబ్బతింటుంది. ఇలాంటి సమస్యలు గలవారితో పాటు కొత్తగా వీటి బారినపడ్డవారూ క్రమం తప్పకుండా మందులు వాడుకుంటూనే కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి. ప్రస్తుతం జలుబు వంటి ఇన్‌ఫెక్షన్లతో సమస్యలు తీవ్రం కావొచ్చు. సరైన సమయంలో, సరైన చికిత్స తీసుకోకపోతే జలుబుతో పుట్టుకొచ్చే స్రావాలు ఊపిరితిత్తుల్లోకి వెళ్లి, లక్షణాలు తీవ్రం కావొచ్చు."

--డాక్టర్ మహబూబ్​ఖాన్, ప్రొఫెసర్, పల్మనరీ మెడిసిన్ HOD

అత్యవసరమైతే తప్ప రాత్రిపూట, తెల్లవారుజామున దూర ప్రయాణాలు పెట్టుకోకూడదని సూచిస్తున్నారు. ప్రయాణాలు చేసేటప్పుడు కిటికీ పక్కన కూర్చోకూడదని.. మంచి స్వెటర్లు, ముక్కుకు మాస్కులు ధరించాలన్నారు. వేసుకునే మందులు తప్పనిసరిగా వెంట తీసుకెళ్లాలని వివరించారు. ఇంకా ఏమన్నారంటే..

  • ఇంట్లో, ఆఫీసుల్లో ఏసీ వాడాల్సిన పరిస్థితులు వస్తే 24, 25 డిగ్రీల ఉష్ణోగ్రతను పెట్టుకోవాలి. ఏసీ గాలి నేరుగా ముఖానికి తగలకుండా చూసుకోవాలి. ఇంటిని చీపురుతో కాకుండా తడి బట్టతో శుభ్రం చేసుకోవాలి. దుప్పట్లు, దిండ్లను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి.
  • సాధారణంగా చలికాలంలో కొందరికి చల్లటి పదార్థాలు, మిఠాయిలు పడవు. ఇలాంటి అలర్జీలు ఉన్నవారు పడని వాటికి దూరంగా ఉండాలి. అగరుబత్తుల పొగ పడనివారు దూరంగా ఉండడం మంచిది.
  • ఉబ్బసంతో బాధపడేవారు తమ పిల్లలనూ ఓ కంట కనిపెడుతూ.. చలి ప్రదేశాల్లో ఎక్కువగా ఆడకుండా చూసుకోవాలి. దుకాణాల్లో అమ్మే చిరుతిళ్ల వంటి వాటిల్లో అలర్జీ కారకాలు ఉండొచ్చు.. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. జలుబు చేస్తే నిర్లక్ష్యం చేస్తే ఆ ఇన్‌ఫెక్షన్‌ ఊపిరితిత్తుల్లోకి విస్తరించి ఉబ్బసంగా మారొచ్చు. ఇంకా పై శ్వాసకోశ సమస్యలు గలవారిలో 20శాతం మంది ఉబ్బసంతోనూ బాధపడుతుంటారు. అందువల్ల ముక్కు కారటం, ముక్కుదిబ్బడం, కళ్లు ఎర్రబడటం, దురద వంటి అలర్జీ లక్షణాలు కనిపిస్తే ఉబ్బసం కావొచ్చని అనుమానించాలి.
  • ఆక్సిజన్‌ మీదుండే ఐఎల్‌డీ బాధితులు దూర ప్రయాణాలు చేయకపోవడం మంచిది. ఎందుకంటే వీరికి ఇన్‌ఫెక్షన్లు వస్తే చికిత్స కష్టమవుతుంది. ఇంకా గుండె, కిడ్నీ జబ్బుల వంటివీ ఉన్నట్టయితే మరింత ఎక్కువగా జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తుంది. ముఖ్యంగా పొగతాగే అలవాటుంటే మానెయ్యాలి.

NOTE :ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

పార్కులకు తరచూ వెళ్తున్నారా? ఈ విషయం మీరు తప్పక తెలుసుకోవాలి!

చల్లగా ఉందని వేడి వేడి బజ్జీలు, పకోడీలు తింటున్నారా? జాగ్రత్త పడకపోతే ఇన్​ఫెక్షన్లు వస్తాయట!!

ABOUT THE AUTHOR

...view details