Winter Face Wash for Dry Skin:చలికాలంలో చర్మసౌందర్యాన్ని సంరక్షించుకోవడమంటే పెద్ద సవాలుగా ఉంటుంది. ఎన్ని జాగ్రత్తలు, ఆహార నియమాలు పాటించినా సరే.. చర్మం పొడిబారిపోవడంతో పాటు ఇతర చర్మ సమస్యలు సైతం తలెత్తుతుంటాయి. అయితే వీటన్నింటికీ కారణం.. మనకు తెలియకుండా చేసే కొన్ని పొరపాట్లే అంటున్నారు సౌందర్య నిపుణులు. ముఖ్యంగా ముఖాన్ని శుభ్రం చేసుకునే క్రమంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే అక్కడి చర్మ ఆరోగ్యం దెబ్బతింటుందని చెబుతున్నారు. ఫలితంగా ముఖ సౌందర్యంపై ప్రతికూల ప్రభావం పడుతుందని వివరించారు. మరి, అలా జరగకూడదంటే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం రండి.
ఆ ఫేస్ వాష్‌లు వాడకూడదట
శరీరాన్ని, ముఖాన్ని క్లీన్ చేసుకోవడానికి ప్రస్తుతం మార్కెట్లో వివిధ రకాల ఫేస్‌వాష్‌లు, బాడీ వాష్‌లు అందుబాటులో ఉన్నాయి. అయితే, వీటిలో ఫోమ్ (నురగ) ఆధారిత వాష్‌లు చలికాలంలో ఉపయోగించడం వల్ల చర్మం మరింత పొడిబారిపోతుందని చెబుతున్నారు నిపుణులు. అందుకే ఫోమ్‌కు బదులుగా జెంటిల్, క్రీమ్ తరహా క్లెన్సర్లు.. వంటివి ఉపయోగిస్తే చర్మాన్ని తేమగా, మృదువుగా ఉంచుకోవచ్చని సూచిస్తున్నారు.
ఆ పద్ధతి పాటించకూడదట
మనలో చాలామందికి పదే పదే ముఖం కడుక్కోవడం అలవాటు ఉంటుంది. ఈ క్రమంలోనే కొంతమంది ఒకే సమయంలో రెండుసార్లు ముఖం శుభ్రం చేసుకునే డబుల్ క్లెన్సింగ్ పద్ధతిని పాటిస్తుంటారు. ఇందులో భాగంగా మొదటగా చర్మంపై ఉన్న జిడ్డును తొలగించుకోవడానికి ఆయిల్ ఆధారిత క్లెన్సర్‌తో ముఖం కడుక్కుంటారు. ఆపై నీటి ఆధారిత క్లెన్సర్‌తో కడగడం వల్ల చర్మంపై ఉండే చెమట, ఇతర మలినాలు తొలగిపోతాయని అంటున్నారు. దీనివల్ల చర్మం మరింతగా పొడిబారిపోతుందని చెబుతున్నారు నిపుణులు. అయితే, మేకప్ ఉపయోగించకుండా, మొటిమలు-జిడ్డుదనం వంటి సమస్యలేవీ లేనివారు ఈ తరహా పద్ధతికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని సలహా ఇస్తున్నారు. ఇక మిగతా వారు కూడా తమ చర్మతత్వాన్ని బట్టి సరైన ఫేస్‌వాష్‌ని ఎంచుకొవాలని వివరించారు. నిపుణుల సలహా తీసుకుని నిర్ణీత వ్యవధుల్లో ముఖాన్ని శుభ్రం చేసుకోవడం అన్ని విధాలా ఉత్తమమని పేర్కొన్నారు.
ముఖంపై పేరుకున్న మృతకణాల్ని తొలగించుకునే క్రమంలో ఎక్స్‌ఫోలియేషన్ ప్రక్రియను పాటిస్తుంటారు. అయితే ముఖం మరింత మృదువుగా మారాలన్న ఉద్దేశంతో కొందరు ఈ పద్ధతిని ఎక్కువసార్లు పాటిస్తుంటారు. ఇలా చేయడం వల్ల చర్మ ఆరోగ్యం దెబ్బతింటుందని హెచ్చరిస్తున్నారు నిపుణులు. మరీ ముఖ్యంగా చలికాలంలో ఈ ప్రక్రియ మితిమీరితే మృతకణాలు తొలగిపోకపోగా.. చర్మం మరింతగా పొడిబారిపోతుందని చెబుతున్నారు. కాబట్టి వారానికి రెండుసార్లు, అదీ ఇంట్లో తయారుచేసిన స్క్రబ్‌తో రాత్రి పడుకునే ముందు ముఖాన్ని మర్దన చేసుకుంటే ఫలితం ఉంటుందని నిపుణులు వివరించారు.