Why We Feel Thirsty After Eating Sweet :స్వీట్ అంటే చాలామంది ఇష్టపడతారు. భోజనం చేసిన తర్వాత ఏదో ఒక తియ్యటి పదార్థాన్ని తినే అలవాటు కూడా చాలామందికి ఉంటుంది. దాంతో పాటు బాగా టెన్షన్‌గా అనిపించినప్పడు, ఒత్తిడికి లోనయినప్పుడు కూడా చాలామంది స్వీట్‌ను తింటుంటారు. అది ఐస్‌క్రీం, చాక్లెట్, ఇంకేదైనా కావచ్చు. ఇలా తీపి అంటే ఇష్టం ఉన్నవారు సరదాగా బయటకు వెళ్లినప్పుడు తీపి పదార్థాలను ఎక్కువగా తినేస్తుంటారు. కానీ ఇది మీలో డీహైడ్రేషన్ సమస్యకు దారి తీస్తుందని మీకు తెలుసా? తీపి వస్తువులు తిన్నప్పుడు విపరీతమైన దాహం కలగడం మీరు ఎప్పుడైనా గమనించారా? చక్కెర లేదా ఇతర తీపి పదార్థాలు తినడం వల్ల శరీరం ఎందుకు డీహైడ్రేట్ అవుతుందో ఇక్కడ చూద్దాం.
తీపి తినడం వల్ల దాహం ఎందుకు పెరుగుతుంది?
షుగర్‌ను అధికంగా తీసుకోవడం రక్తంలోని చక్కెర స్థాయిల్లో హెచ్చుతగ్గులకు కారణమవుతుంది. ఇది శరీరాన్ని డీహైడ్రేట్ చేసి దాహాన్ని పెంచుతుంది. శరీరంలో గ్లూకోజ్ స్థాయులు పెరగడం వల్ల అదనపు గ్లూకోజ్‌ను బయటకు పంపడానికి మూత్రపిండాలు ఎక్కువ మూత్రాన్ని ఉత్పత్తి చేస్తాయి. ఇది శరీరంలోని ద్రవ్య సమతుల్యతను దెబ్బతీస్తుంది. అలా కోల్పోయిన ద్రవ్యాలను శరీరం తిరిగి కోరుకోవడం వల్ల మెదడు ఎప్పుడూ నీరు తాగమని అడుగుతుందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.
మరి తీపి తిన్నాక ఏం చేయాలి?
తీపి తింటే గ్లూకోజ్ లెవెల్స్ పెరుగుతాయని, డీహైడ్రేషన్ సమస్య వస్తుందని ఎన్ని రోజులని నోరు కట్టేసుకుంటాం. అప్పుడప్పుడు అయినా ఆశ ఆపుకోలేక తినేస్తుంటాం కదా. అలా తిన్నప్పుడు సమస్య రాకుండా ఉండాలంటే ఈ కింది జాగ్రత్తలు తీసుకోండి.
రోజంతా హైడ్రేటెడ్‌గా ఉంటాయి
తీపి తినడం వల్ల కలిగే దాహం నుంచి తప్పించుకోవటానికి తిన్న వెంటనే నీరు పుష్కలంగా తాగాలి. దాహం వేసే వరకూ వేచి ఉండకుండా రోజంతా నీరు తాగుతూ ఉండాలి. తీపి తిన్నప్పుడు రక్తప్రవాహంలో అసమతుల్యతను భర్తీ చేయడానికి శరీరంలో తగినంత నీరు ఉండాలి.
మితంగా తినాలి
తీపి తినడం అందరికీ ఇష్టమే కానీ అమితంగా తిని అనారోగ్యం పాలు కాకూడదు. మీకు ఇష్టమైన స్వీట్‌ను తక్కువ మోతాదులో తినండి. మితంగా తింటే ఏ ఆహారం కూడా హాని కలిగించదు.