Weight Increase Reasons in Winter: చలికాలమనగానే.. జలుబు, దగ్గు, కీళ్లు పట్టేయడం, శ్వాసకోశ సంబంధిత సమస్యలు, చర్మం పొడిబారడం లాంటి సమస్యల గుర్తుకువస్తాయి. కానీ, ఈ కాలంలో బరువు పెరగడం కూడా కామనే అని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి! ఈ నేపథ్యంలోనే అవేంటో తెలుసుకుని అధిక బరువు సమస్యను తగ్గించుకోవడానికి ప్రయత్నించండి.
శీతాకాలంలో చల్లటి వాతావరణం కారణంగా మనలో చాలా మందికి ఉదయాన్నే లేచి వ్యాయామం చేయడానికి ఆసక్తి చూపరు. ఫలితంగా ఫిట్‌నెస్ రొటీన్ అదుపు తప్పుతుందని నిపుణులు అంటున్నారు. ఇలాగే కొనసాగితే మన శరీరంలోకి చేరిన క్యాలరీలు కొవ్వుగా రూపాంతరం చెంది.. బరువు పెరుగుతామని చెబుతున్నారు. అందుకే బరువును అదుపులో ఉంచుకోవాలంటే క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం ముఖ్యమని వివరిస్తున్నారు. ఈ క్రమంలో మీ భాగస్వామి లేదా స్నేహితురాలిని మీతో పాటు కలిసి వ్యాయామం చేసేలా ప్రోత్సహించాలని సలహా ఇస్తున్నారు. తద్వారా వ్యాయామంపై ఆసక్తి పెరుగుతుందని పేర్కొన్నారు.
ఎండ తగలకపోయినా
ముఖ్యంగా చలికాలంలో కొన్నిసార్లు శరీరానికి సరిగ్గా ఎండ తగలదు. ఫలితంగా ‘సీజనల్ ఎఫెక్టివ్ డిజార్డర్ (ఎస్‌ఏడీ)’ అనే ఒక రకమైన డిప్రెషన్ సమస్య తలెత్తే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. దీని కారణంగా ఆహారపు కోరికలు పెరిగి.. మోతాదుకు మించి ఆహారం తీసుకుంటారని వివరిస్తున్నారు. ఫలితంగా బరువు పెరిగేందుకు కారణం అవుతాయని అంటున్నారు. కాబట్టి ఉదయం ఎండ లేకపోయినా.. మధ్యాహ్నం పూటైనా కాసేపు ఎండలో గడపడం మంచిదని సూచిస్తున్నారు. ఇది బరువును అదుపులో ఉంచేందుకు పరోక్షంగా సహకరిస్తుందని అంటున్నారు. అయితే ఎండకు వెళ్లే క్రమంలో సన్‌స్క్రీన్ లోషన్ రాసుకోవడం మర్చిపోవద్దని సూచిస్తున్నారు.
హార్మోన్ల అసమతుల్యత
హార్మోన్ల అసమతుల్యత వల్ల కూడా బరువు పెరుగుతుంటారని ప్రముఖ సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ టీ. లక్ష్మీ కాంత్ చెబుతున్నారు. వాతావరణ మార్పులు కూడా హార్మోన్ల సమతుల్యతను దెబ్బతీస్తాయని అంటున్నారు నిపుణులు. తద్వారా బరువు తగ్గే ప్రక్రియ నెమ్మదించడంతో పాటు ఆహారపు కోరికలు పెరుగుతాయని చెబుతున్నారు. కాబట్టి హార్మోన్లను సమతులంగా ఉంచుకోవడానికి జీవనశైలిలో మార్పులు చేసుకోవడంతో పాటు డాక్టర్ సలహాలూ పాటించాల్సి ఉంటుందని అంటున్నారు.