Dialysis Patient Food to Eat:మన కిడ్నీలు ఏ కారణంగానైనా విఫలమైనప్పుడు మన శరీరం మొత్తం మలినాలు, వ్యర్థాలతో నిండిపోతుంది. చివరకు ఇది ప్రాణాపాయానికి దారి తీస్తుంది. ఈ విపత్కర పరిస్థితిని ఎదుర్కొనేందుకు కృత్రిమ యంత్రాల తోడ్పాటును తీసుకోవాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియనే డయాలసిస్అంటారు. కిడ్నీలు విఫలమైన వారికి డయాలసిస్ సంజీవని లాంటిది. అయితే, డయాలసిస్ పైనా ఆధారపడి జీవిస్తున్నప్పుడు ఆరోగ్యాన్ని మంచిగా ఉంచుకునేందుకు జీవనశైలి నుంచి ఆహారపు అలవాట్ల వరకు చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే డయాలసిస్ రోగులు ఎలాంటి ఆహారం తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
డయాలసిస్రోగులు నీళ్లు చాలా తక్కువగా తీసుకోవాలని ప్రముఖ పోషకాహార నిపుణులు డాక్టర్ అంజలీ దేవి చెబుతున్నారు. కూరల్లో కలిపే నీటిని కూడా కలిపి లీటర్ మాత్రమే సేవించాలని వివరిస్తున్నారు. నీటి శాతం అధికంగా ఉన్న ద్రాక్ష లాంటి పండ్లు తీసుకోకూడదని సూచిస్తున్నారు. ఇంకా నీటిని ఒకేసారి కాకుండా విరామం ఇస్తూ తాగాలని వెల్లడించారు. యాపిల్, బొప్పాయి, జామ లాంటి పీచు ఎక్కువగా ఉండే పండ్లు తినాలని సలహా ఇస్తున్నారు. ఆకు కూరలు ఎక్కువగా ఆహారంలో చేర్చుకోవాలని అంటున్నారు. కానీ, బ్లడ్ తిన్నర్స్ తీసుకునే వారు మాత్రం ఆకు కూరలు తక్కువగా తీసుకోవాలని చెబుతున్నారు. దుంపకూరలు కూడా తగ్గించుకోవాలని పేర్కొన్నారు.
షుగర్ వల్ల కూడా డయాలసిస్ వచ్చే ప్రమాదం ఉంటుందని ప్రముఖ పోషకాహార నిపుణులు డాక్టర్ అంజలీ దేవి అంటున్నారు. షుగర్ ఎక్కువైనప్పుడు కిడ్నీ దెబ్బతినే అవకాశం ఉంటుందని హెచ్చరిస్తున్నారు. ఒకసారి కిడ్నీ విఫలమైతే దానిని బాగు చేసే పద్ధతులు లేవని.. కేవలం వాటిని డయాలసిస్ మాత్రమే చేసుకోవాల్సి ఉంటుందన్నారు. కాబట్టి వీటిని జాగ్రత్తగా చూసుకోవాలని సూచిస్తున్నారు. ఎక్కువ నీరు ఉన్న ఆహారం ఇవ్వకుండా కొంచెం మాంసకృత్తులు, పప్పు, బ్రౌన్ రౌస్, కడుపు నిండడానికి పీచు ఎక్కువగా ఉండే ఆహారం ఇవ్వాలని సలహా ఇస్తున్నారు. ముఖ్యంగా పాలకూర టమాటా కలిపి పెట్టకూడదని హెచ్చరిస్తున్నారు. ఉప్పు, పాల శాతం కూడా తగ్గించుకోవాలని సూచిస్తున్నారు. పొటాషియం పెరిగి గుండెకు ఇబ్బంది రాకుండా చూసుకోవాలని వివరిస్తున్నారు.