Underweight Child Symptoms:మీ పిల్లలు ఉండాల్సిన మోతాదు కన్నా తక్కువ బరువుతో ఉన్నారా? మూడు పూటలా తిన్నా కూడా బరువు పెరగట్లేదా? చాలా మంది పిల్లలకు కూడా తక్కువ బరువు అనేది సమస్యగా మారింది. కొన్ని రకాల వ్యాధులు, ఇన్ఫెక్షన్లు కూడా తగినంత బరువు పెరగకపోవడానికి కారణం అవుతుందని నిపుణులు అంటున్నారు. ఈ నేపథ్యంలోనే పిల్లలు తగినంత బరువు పెరగకపోవడం వెనుక కారణాలు, పరిష్కార మార్గాలను ప్రముఖ పిల్లల వైద్యురాలు డాక్టర్ పి. షర్మిళ వివరిస్తున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
పిల్లలు బరువు పెరగకపోవడానికి ప్రతి ఒక్కరికీ వేర్వేరుగా సమస్యలు ఉంటాయి. కొందరిలో గ్రోత్ హర్మోన్, థైరాయిడ్ సమస్యలు ఉన్నాయా? పోషకాలు సరిగా అందడం లేదా? పిల్లలకు పాలు ఎక్కువగా పడుతున్నారా? ఇలాంటి కారణాలను పరిశీలించాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఇతర పిల్లలతో పోలిస్తే.. తక్కువ బరువుతో పుట్టిన పిల్లల్లో అంతగా పెరుగుదల ఉండదు. ఇలాంటి వారిని వైద్యులను సంప్రదించాలి. కానీ మానసికంగా, ఎమోషనల్గా సాధారణంగా ఉంటే అంతగా పరీక్షించాల్సిన అవసరం ఉండదు.
--డాక్టర్ పి. షర్మిళ, పిల్లల వైద్యురాలు
మూడు పూటలా తిన్నా బరువు పెరగట్లేదా?
మూడు పూటాలా తిన్నా సరే.. బక్కగానే ఉంటారని చాలా మంది తల్లిదండ్రులు ఆవేదన చెందుతుంటారు. అలాంటి పిల్లలో కొన్ని ఆరోగ్య సమస్యలు ఉండే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. అనేక సార్లు మలవిసర్జనకు వెళ్లడం, జలుబు, దగ్గు, జ్వరం లాంటి రోగాల బారిన పడుతుంటారని వివరిస్తున్నారు. ఇంకా తీసుకునే ఆహారం శరీరానికి సరిగ్గా అందకపోవడం వల్ల కూడా ఇలా జరుగుతుందని వెల్లడిస్తున్నారు. కొన్ని సార్లు జీర్ణక్రియకు అవసరమైన మందులు తీసుకుంటే బరువు పెరిగే అవకాశం ఉంటుందని సూచిస్తున్నారు.
తక్కువ బరువు ఉన్న పిల్లలకు వ్యాధులు వస్తాయా?
మొదటి ఆరేళ్ల వరకు మన శరీరం ఎదుగుతున్న కొద్దీ మెదడు కూడా పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. ఈ సమయంలో సరైన పోషకాలు, సరైన సమయంలో అందకపోతే దీర్ఘకాలంలో ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని నిపుణులు చెబుతున్నారు. బరువు తక్కువగా ఉన్న పిల్లల్లో రోగ నిరోధక శక్తి కూడా సరిగ్గా అభివృద్ధి చెందకపోయే అవకాశం ఉంటుందని అంటున్నారు. ఫలితంగా తరచుగా రోగాల బారిన పడతరాని హెచ్చరిస్తున్నారు.