FOODS FOR CONSTIPATION :ఆరోగ్యంగా ఉండాలంటే పోషకాహారం తినాల్సిందే. అందుకోసం ఆహారంలో విటమిన్లు, ఖనిజ లవణాలు, మాంసకృత్తులు ఇలా అన్ని రకాల పోషకాలు ఉండేలా చూసుకోవడం ముఖ్యం. కేవలం ఇవి మాత్రమే కాకుండా.. పీచు పదార్థం కలిగిన ఆహారాలను ఎంచుకోవడం కూడా అవసరమే. ఎందుకంటే దీని వల్ల జీర్ణక్రియ సక్రమంగా జరుగుతుంది. ఆహారం జీర్ణమైన తర్వాత వ్యర్థాలను బయటకు నెట్టివేయడంలోనూ ఇబ్బందులు ఏర్పడవు.
అంతే కాకుండా పీచు పదార్థం ఎక్కువగా ఉన్న ఆహారాలను తీసుకోవడం వల్ల మలబద్ధకం సమస్య ఎదురయ్యే అవకాశం లేదని చెబుతున్నారు. అలాగే ఈ ఆహారం తింటే కడుపు త్వరగా నిండిన ఫీలింగ్ కలుగుతుందని.. తద్వారా తక్కువ తినే అవకాశం ఉంటుందని చెప్పారు. తక్కువ ఆహారం తీసుకోవడం.. తీసుకున్నది ఆలస్యంగా జీర్ణమవడం వల్ల స్థూలకాయం వచ్చే సమస్యను అధిగమించవచ్చని పోషకాహార నిపుణురాలు డాక్టర్ శ్రీలత చెబుతున్నారు.
ఫైబర్ అనేది మనకు రెండు రకాలుగా లభిస్తుంది. ఇందులో సాలిబుల్ ఫైబర్ ఒకటి కాగా.. ఇన్సాలిబుల్ ఫైబర్ రెండోది. సాలిబుల్ ఫైబర్ మన రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను అదుపులో ఉంచుతుంది. మలబద్దకంతో బాధపడుతున్నవారికి ఫైబర్ ఎంతో ఉపయోగపడుతుంది. మన పేగుల్లో ఉండే చెడు పదార్థాలు, బ్యాక్టీరియా, ఆహారంలో ఉండే కలర్స్, కెమికల్స్ లాంటివి పేరుకుపోయినప్పుడు ఈ పీచు వాటిని బయటకు పంపి శుభ్రపరుస్తుంది. మన శరీరానికి కావాల్సిన మేలు చేసే బ్యాక్టీరియాను ఫైబర్ రెట్టింపు చేస్తుంది. ఫలితంగా రోగ నిరోధక శక్తిని పెంచి.. చెడు బ్యాక్టీరియాను శరీరం నుంచి బయటకు పంపిస్తుంది.
--డాక్టర్ శ్రీలత, పోషకాహార నిపుణులు
ఉదయం అల్పాహారం నుంచే పీచు ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలు తీసుకోవడం మంచిదని డాక్టర్ శ్రీలత చెబుతున్నారు. దీనికోసం ఉదయాన్నే అల్పహారాన్ని ఓట్మీల్తో ప్రారంభించుకోవచ్చని తెలిపారు. కావాలంటే ఇందులోకి తాజా పండ్లను కలుపుకోవచ్చని చెప్పారు. "ఎక్కువగా ప్రాసెస్ చేసిన పదార్థాలను తీసుకోకూడదు. ప్రస్తుతం బియ్యాన్ని ఎక్కువగా పాలిష్ చేసి వాటి రీఫైన్గా చేస్తున్నాం. దీని ద్వారా శరీరంలో పిండిపదార్థం బాగా పేరుకుపోతుంది. తక్కువ పాలిష్ పట్టించి బ్రౌన్ రౌస్ తీసుకుంటే మనకు కావాల్సిన ఫైబర్ లభిస్తుంది. అలాగే కొవ్వను సైతం కరిగిస్తుంది. గోధుమలను మైదా రూపంలో తీసుకుంటే చెడు ప్రభావాన్ని చూపిస్తుంది. గోధుమలను జల్లించకుండా పిండిని అలానే వాడితే ఆరోగ్యానికి మంచిది. అలాగే ఆకుకూరలు వండేటప్పుడు కాడలను కట్ చేసి కేవలం ఆకులను మాత్రమే వాడతారు. కేవలం వేర్లను మాత్రమే కత్తిరించి కాడలను కలిపి వండుకోవడం వల్ల చాలా ఫైబర్ లభిస్తుంది." అని వివరించారు. ఇంకా ఏ ఏ ఆహార పదార్థాల్లో పీచు లభిస్తుందో ఇప్పుడు చూద్దాం.
- పియర్స్
- రాస్ బెర్రీస్
- బ్లాక్ బెర్రీస్
- బ్లూ బెర్రీస్
- యాపిల్
- చిక్కుళ్లు
- క్యాబేజీ
- క్యారెట్
- కాలీఫ్లవర్
- ఆకుకూరలు
- తృణ ధాన్యాలు
- చిరు ధాన్యాలు
- బఠానీలు
- మొలకెత్తిన విత్తనాలు
- ముడి బియ్యం(పాలిష్ చేయనివి)
- జొన్నలు
- కొర్రలు
- సజ్జలు
- అరికలు
- పప్పు దినుసులు
- కందులు
- శనగలు
- పెసర్లు
- మినుములు
- రాజ్మా
- అవిసె గింజలు
NOTE :ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
అలర్ట్ : బ్రేక్‌ఫాస్ట్‌లో ఈ ఆహారాలు తింటే - ప్రాణాలకే ప్రమాదమట! తెలుసుకోండి జర! - Foods To Avoid in Breakfast
అద్భుతం : వెన్నునొప్పి నుంచి ఎసిడిటీ దాకా - ఉప్పు నీటితో స్నానం చేస్తే ఎన్నో ప్రయోజనాలు! - Salt Water Bath Benefits