Biscuits Side Effects in Children in Telugu:చిన్న పిల్లలు ఏడిచినప్పుడు, ఆకలి వేసినప్పుడు వారికి బిస్కెట్లు ఇస్తుంటారు తల్లిదండ్రులు. పిల్లలు సైతం వాటిని చాలా ఇష్టంగా తింటుంటారు. చాలా మంది తల్లులు పాలిచ్చిన తర్వాత పిల్లలకు కచ్చితంగా బిస్కెట్లను తినిపిస్తుంటారు. ఇక ప్రయాణాల్లో సైతం వీటిని తీసుకెళ్తుంటారు. అయితే ఇలా పిల్లలకు బిస్కెట్లు ఇచ్చి వారి ఆరోగ్యాన్ని చేజేతులా నాశనం చేస్తున్నారని అంటున్నారు నిపుణులు. ఎందుకంటే వీటిని ఎక్కువగా తినడం వల్ల అనేక ఆరోగ్య సమస్యల బారిన పడతారని హెచ్చరిస్తున్నారు. పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
ఊబకాయం, షుగర్:సాధారణంగా బిస్కెట్లను మైదా, హానికరమైన కొవ్వులు, అధిక సోడియం, పంచదార, కృత్రిమ స్వీటెనర్లు వంటివి ఉపయోగించి తయారు చేస్తుంటారు. ఈ పదార్థాలు పిల్లల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయని చెబుతున్నారు నిపుణులు.వీటిని తిన్న పిల్లల శరీరంలో కేలరీలు పెరిగిపోతాయని.. ఫలితంగా వారు విపరీతంగా బరువు పెరుగుతారని చెబుతున్నారు. దీంతో పాటు టైప్ 2 డయాబెటీస్ వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.
2018లో జర్నల్ ఆఫ్ పీడియాట్రిక్ గ్యాస్ట్రోఎంటరాలజీ అండ్ న్యూట్రిషన్లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం.. బిస్కెట్లలో అనారోగ్యకరమైన కొవ్వులు ఉంటాయని.. ఇవి పిల్లల ఆరోగ్యాన్ని దెబ్బతీసి.. ఊబకాయం, టైప్ 2 డయాబెటిస్‌కు దారితీస్తాయని కనుగొన్నారు. ఈ పరిశోధనలో యునైటెడ్ కింగ్‌డమ్‌లోని University of Liverpoolలో న్యూట్రిషనల్ సైన్స్‌లో ప్రొఫెసర్ డాక్టర్ Emma Boyland పాల్గొన్నారు. ఇదే విషయాన్ని NIH బృందం కూడా వెల్లడించింది.(National Librabry of Medicine రిపోర్ట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి). ఇవే కాకుండా ఇతర సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉందన్నారు. అవేంటంటే..
మలబద్ధకం:బిస్కెట్ల తయారీలో వాడే శుద్ధి చేసిన గోధుమ, మైదా పిండి రెండూ ఆరోగ్యానికి మంచివి కావని వైద్యులు చెబుతున్నారు. ఎందుకంటే గోధుమ పిండిని ప్రాసెస్ చేయడం వల్ల దానిలో పోషకాలు లేకుండా పోతాయట. ఇక మైదా పిండి ఆరోగ్యానికి చాలా ప్రమాదమని అంటున్నారు. కాబట్టి వీటితో తయారు చేసిన బిస్కెట్లను పిల్లలకు తినిపించడం వల్ల వారి జీర్ణక్రియ నెమ్మదిస్తుందని వివరించారు. పిల్లల్లో ప్రేగుల పనితీరును కూడా నెమ్మదించి.. పెరుగుదలపై ప్రభావం చూపుతుందని వెల్లడించారు. ఇదే కాకుండా పిల్లలకు మలబద్దకం సమస్య వస్తుందని తెలుపుతున్నారు.