Long Time Standing Side Effects:మనలో చాలా మంది ఉదయం లేచినప్పటి నుంచి పడుకునే వరకు ఎక్కువ సేపు నిలబడే ఉంటారు. ఇంకా కొందరైతే నిలబడే చేసే పనులే చేస్తుంటారు. అయితే, ఇలా ఎక్కువ సేపు నిల్చుని పనిచేయడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఎక్కువ సమయం నిల్చోవడం వల్ల వచ్చే ఆరోగ్య సమస్యలు ఏంటి? ఇందుకోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
గుండె సమస్యలు:ఎక్కువ సమయం నిలబడడం వల్ల గుండెకు రక్త సరఫరా నిదానిస్తుందని.. ఫలితంగా స్పందననల్లో తేడా వస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఎక్కువ సేపు నిలబడితే రక్త పోటు, గుండె సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. "The Relationship Between Occupational Standing and Cardiovascular Disease Risk" అనే అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. American Journal of Epidemiologyలో ప్రచురితమైన ఈ అధ్యయనంలో డాక్టర్ Peter Smith పాల్గొన్నారు(రిపోర్ట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి).
రక్త ప్రసరణలో తేడాలు:ఎక్కువ సమయం నిల్చునే ఉండడం వల్ల కాళ్లలో రక్త ప్రసరణ నిదానిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఫలితంగా కాళ్లు తిమ్మిర్లు రావడంతో పాటు స్పర్శ లేకుండా పోతాయని అంటున్నారు.
వెరికోస్ వెయిన్స్:ఎక్కువ సేపు నిల్చుని ఉండడం వల్ల వెరికోస్ వెయిన్స్ సమస్య వచ్చే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీని వల్ల నరాలు నీలం లేదా ఎరుపు రంగులోకి మారతాయని తెలిపారు. ఆ ప్రాంతంలో దురద, నొప్పి, తిమ్మిర్లు వస్తాయని.. ముఖ్యంగా రాత్రి వేళల్లో మరితం ఇబ్బందిగా ఉంటుందని వివరించారు.
కాళ్లు, కీళ్ల నొప్పులు:ఎక్కువ సమయం నిలబడి ఉండడం వల్ల శరీర బరువు మొత్తం కాళ్లపై పడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఫలితంగా మోకాళ్లు, కీళ్ల నొప్పులు తలెత్తుతాయని వివరించారు.