Irregular Periods Causes in Telugu:సాధారణంగా పీరియడ్స్ 28 రోజులకు ఒకసారి వస్తాయి. కానీ కొంతమందిలో మాత్రం ఇర్రెగ్యులర్ పీరియడ్స్ సమస్య ఉంటుంది. ఫలితంగా నెలకోసారి రావాల్సిన పీరియడ్స్.. రెండు లేదా మూడు వారాలకోసారి వస్తుంటుంది. దీంతో తమకెందుకిలా జరుగుతుందని కంగారు పడిపోతుంటారు. వాస్తవానికి ప్రతీ నెలసరికి మధ్య 24 రోజుల గ్యాప్ ఉంటే.. ఒకే నెలలో రెండుసార్లు పీరియడ్స్ రావడం సహజమే! కానీ, కొంతమందిలో మాత్రం ఇర్రెగ్యులర్ పీరియడ్స్ పలు అసాధారణ సమస్యలకూ కారణం కావచ్చని చెబుతున్నారు నిపుణులు. అందుకే వ్యక్తిగతంగా కనిపించే లక్షణాల్ని బట్టి వైద్యుల సహాయం తప్పనిసరిగా తీసుకోవాలని సూచిస్తున్నారు. మరి, ఇంతకీ నెలకు రెండుసార్లు పీరియడ్స్ ఎందుకు వస్తాయి? ఈ క్రమంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? ఈ స్టోరీలో తెలుసుకుందాం.
ఎందుకిలా పీరియడ్స్ వస్తాయి?
ఎండోమెట్రియోసిస్ సమస్య వల్ల కూడా నెలలో రెండుసార్లు పీరియడ్స్ వస్తాయని నిపుణులు చెబుతున్నారు. గర్భాశయం లోపలి పొరను పోలిన పొర దాని బయట పెరగడం వల్ల ఈ సమస్య వస్తుందని అంటున్నారు. ఫలితంగా పొత్తి కడుపులో తీవ్రమైన నొప్పితో పాటు ఇర్రెగ్యులర్‌గా రక్తస్రావం అవుతుంటుందని చెప్పారు. కొన్నిసార్లు ఇది నెలసరి మాదిరిగా రోజుల తరబడి అవుతుంటుందని నిపుణులు వివరించారు. అయితే, ఈ విషయంలో నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యుల్ని సంప్రదించడం మేలని సలహా ఇస్తున్నారు.
మెనోపాజ్‌కు చేరువయ్యే సమయంలోనూ నెలసరి క్రమం తప్పుతుంటుందని నిపుణులు చెబుతున్నారు. హార్మోన్లలో మార్పులు చెందడమే ఇందుకు కారణమని తెలిపారు. అయితే ఈ సమయంలో నెలసరి రుతుచక్రంతో సంబంధం లేకుండా ఆలస్యంగా రావడం, తక్కువ వ్యవధిలో రావడం, కొన్నిసార్లు పూర్తిగా రాకపోవడం.. వంటి లక్షణాలు గమనించచ్చని చెప్పారు. 'పెరి మెనోపాజ్'గా పిలిచే ఈ దశలోనూ ఇలా పీరియడ్స్ నెలలో రెండుసార్లు వచ్చే అవకాశం ఉంటుందని వివరిస్తున్నారు. అయితే వైద్య నిపుణుల సలహాలను పాటిస్తే ఈ సమయంలో ఎదురయ్యే అసౌకర్యాల్ని దూరం చేసుకోవచ్చని సూచించారు.
థైరాయిడ్ గ్రంథి పనితీరుపైన కూడా పీరియడ్స్ ఆధారపడి ఉంటాయని 2020లో American College of Obstetricians and Gynecologists (ACOG) జర్నల్‌లో ప్రచురితమైన Menstruation and Menstrual Disorders(రిపోర్ట్) అధ్యయనంలో తేలింది. ఈ క్రమంలో థైరాయిడ్ గ్రంథి తక్కువగా స్పందించడం (హైపోథైరాయిడిజం), థైరాయిడ్ గ్రంథి ఎక్కువగా స్పందించడం (హైపర్‌థైరాయిడిజం).. ఇలా ఈ రెండు సమస్యలున్న వారిలోనూ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వస్తుంటాయని కనుగొన్నారు. ఈ అధ్యయనంలో Johns Hopkins University School of Medicine కాలేజీలోని అసోసియేట్ ప్రొఫేసర్ Dr. Anne Burke సహా పలువురు పాల్గొన్నారు.
ఇవే కాకుండా.. అప్పుడే రజస్వల అయిన అమ్మాయిల్లోనూ నెలసరి సరిగ్గా రాదని నిపుణులు చెబుతున్నారు. కొంతమందిలో నెలకు రెండుసార్లు, మరికొందరిలో రెండు నెలలకోసారి పీరియడ్స్ రావడం వంటివి జరుగుతాయట! ఇందుకు హార్మోన్ల స్థాయుల్లో హెచ్చుతగ్గులే కారణమని వివరించారు. కాబట్టి రజస్వల అయిన అమ్మాయిల్లో నెలసరి క్రమంగా రావడానికి కొంత సమయం పడుతుందని.. అప్పటి వరుకు వేచి చూడాలని అంటున్నారు నిపుణులు. అయితే ఈ సమయంలో అమ్మాయిల ఆరోగ్యం విషయంలో ఎదైనా తేడాలు కనిపించినా, గడ్డల్లాగా బ్లీడింగ్ అయినా.. ఆలస్యం చేయకుండా వెంటనే వైద్యులని సంప్రదించడం మేలని సలహా ఇస్తున్నారు.
కొంతమంది గర్భ నిరోధక మాత్రలు, సాధనాలు వాడుతుంటారు. ఇలా చేయడం వల్ల మొదట్లో కొన్ని నెలల పాటు నెలసరి క్రమం తప్పే అవకాశాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. 'బ్రేక్ త్రూ బ్లీడింగ్'గా పిలిచే ఈ పరిస్థితిలో నెలకు రెండుసార్లు నెలసరి రావడం లేదంటే వారాల తరబడి ఆగకుండా బ్లీడింగ్ కావడం.. వంటి లక్షణాలు కనిపిస్తాయట! అయితే.. ఇది సహజమే అయినప్పటికీ.. తీవ్రమైన కడుపునొప్పి, గడ్డల్లాగా బ్లీడింగ్ కావడం.. వంటి లక్షణాలు కనిపిస్తే మాత్రం నిర్లక్ష్యం చేయవద్దని నిపుణులు అంటున్నారు.