తెలంగాణ

telangana

ETV Bharat / health

ఆకుకూరలు తింటున్నారా? అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోవాలి! వారంలో ఎన్ని సార్లు తినాలి? - GREEN LEAFY VEGETABLES BENEFITS

-ఏ కూరలో ఏ పోషకాలు ఉన్నాయో మీకు తెలుసా? -ఆకుకూరలు తినడం వల్ల కలిగే ప్రయోజనాలివే

green leafy vegetables benefits
green leafy vegetables benefits (Getty Images)

By ETV Bharat Health Team

Published : Jan 31, 2025, 3:05 PM IST

Green Leafy Vegetables Benefits: ఆకు కూరలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. నిత్యం ఏదో ఒక ఆకుకూరను తీసుకుంటే ఆరోగ్యంగా ఉంటారని అంటున్నారు. ఆకుకూరల్లో కొవ్వు పదార్థాలు తక్కువగా ఉండడంతో పాటు ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజ లవణాలు ఎక్కువగా ఉంటాయని తెలిపారు. ఈ నేపథ్యంలోనే ఆరోగ్యాన్నిచే ఆకు కూరలు గురించి ప్రముఖ పోషకాహార నిపుణులు డాక్టర్ స్వరూపా రాణి చెబుతున్నారు.

"ఆకు కూరలు మన ఆరోగ్యానికి ఎంతో సహాయపడతాయి. ఇందులో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది. ఇంకా ఐరన్, జింక్, ఫోలిక్ యాసిడ్ అధికంగా ఉంటాయి. ఇవన్నీ రక్తం సమృద్ధిగా ఉంచేందుకు సహయ పడతాయి. పీచు అధికంగా ఉండడం వల్ల మలబద్ధకం సమస్య రాకుండా కాపాడుతుంది. ఇందులో విటమిన్ ఎ, సీతో పాటు క్యాల్షియం ఎక్కువగా ఉంటుంది. అందుకే వారంలో కనీసం మూడు సార్లు ఆకుకూరలను ఆహారంలో చేర్చుకోవాలి. ఇలా చేస్తే చాలా రకాలైన ఆరోగ్య సమస్యలను నివారించవచ్చు. ఇంకా అధిక పోషకాలను శరీరానికి అందించుకుని రక్తహీనత రాకుండా కాపాడుకోవచ్చు."

--డాక్టర్ స్వరూపా రాణి, పోషకాహార నిపుణులు

తోటకూర: ఇందులో యాంటీ ఆక్సిడెంట్ గుణాలతో పాటు పొటాషియం, మెగ్నీషియం, విటమిన్ సీ, ఐరన్, క్యాల్షియం పుష్కలంగా ఉంటాయి. ఇది రోగ నిరోధక శక్తిని పెంచడంతో పాటు కంటి చూపును మెరుగుపరుస్తుంది. ఇందులోని పీచు పదార్థం జీర్ణశక్తితో పాటు మలబద్ధకాన్ని తగ్గిస్తుంది.

పాలకూర: దీనికి రక్తాన్ని శుద్ధి చేసే గుణం పుష్కలంగా ఉంటుంది. ఇంకా ఇందులో విటమిన్ ఎ, బి, సి, కె, మెగ్నీషియం, ఫోలిక్ యాసిడ్ వంటి ఖనిజాలు ఉంటాయి. ఇవి క్యాన్సర్ లాంటి వ్యాధుల నివారణతో పాటు ఊపిరితిత్తులు, గుండె వ్యాధుల నుంచి కాపాడుతుంది.

గోంగూర: ఇందులో పొటాషియం, ఫైబర్, క్యాల్షియం పుష్కలంగా ఉంటాయి. ఇది గుండె జబ్బుల నుంచి రక్షించడంతో పాటు ఎముకలను బలంగా చేస్తాయి. ఇంకా రక్తంలోని ఇన్సులిన్ స్థాయిని పెంచి, ఘగర్ స్థాయిలును తగ్గిస్తుంది.

మెంతికూర: మెంతి ఆకుల్లో ఫైబర్, ప్రొటీన్, ఐరన్, సోడియం, రాగి, ఫాస్పరస్, జింక్, విటమిన్లు ఉంటాయి. ఇందులోని ఫైబర్ మెటబాలిజంను పెంచి బరువు తగ్గేలా చేస్తుంది. ఇంకా ఇందులోని ఒమేగా 3, 6 ఫ్యాటీ యాసిడ్స్ జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది.

పుదీనా: ఇందులో విటమిన్ ఎ, సితో పాటు బి కాంప్లెక్స్ అధికంగా ఉంటుంది. ఇది ఆహారాన్ని సులువుగా జీర్ణం చేసి, గ్యాస్ సమస్యను తగ్గిస్తుంది. ఇంకా శ్వాసకోస సమస్యలు రాకుండా కాపాడడంతో పాటు కండరాలు, తలనొప్పి నుంచి ఉపశమనం ఇస్తుంది.

బచ్చలి కూర:విటమిన్ ఎ, లుటిన్, కెరోటిన్ లాంటి యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇందులోని సెలీనియం, నియాసిన్, ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాల వల్ల రక్త పోటు, కళ్లు, మెదడు పనితీరును మెరుగు పరుస్తుంది. తరచూ తీసుకోవడం వల్ల చర్మం మృదువుగా మారుతుంది.

కరివేపాకు: ఇది కంటి చూపును మెరుగుపరుస్తుంది. షుగర్, అధిక బరువు, మలబద్ధకం సమస్యను నియంత్రిస్తుంది. ఇందులోని యాంటీ బయాటిక్, యాంటీ ఫంగల్ లక్షణాలు ఇన్​ఫెక్షన్లను దూరం చేస్తాయి. యాంటీ ఆక్సిడెంట్లు గుండె, మూత్ర పిండాలకు రక్షిస్తాయి.

కొత్తిమీర: ఇది వంటలకు రుచి, సువాసన ఇవ్వడమే కాకుండా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఫైబర్, విటమిన్లు, ప్రొటీన్లతో పాటు ఐరన్, మాంగనీస్, పుష్కలంగా ఉంటాయి. ఆస్తమా, జీర్ణ సమస్యలు రాకుండా చేస్తుంది. ఇంకా ఒత్తిడిని తగ్గించి, రక్తపోటు నియంత్రించి అధిక బరువును తగ్గిస్తుంది.

NOTE :ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

'పండ్లు అతిగా తింటే షుగర్, ఊబకాయం వస్తుంది'- రోజుకు ఎన్ని తినాలో తెలుసా?

ఏ రోగం లేకపోయినా ఉన్నట్లు అనిపిస్తోందా? ఇలా ఎందుకు అవుతుందో తెలుసా?

ABOUT THE AUTHOR

...view details