Health Benefits of Curd:మనలో చాలా మందికి భోజనంలో ఎన్ని రకాల వంటకాలు, సైడ్ డిష్‌లు ఉన్నా సరే చివరగా కొద్దిగా పెరుగుతో తింటేనే భోజనం పూర్తి చేశామన్న సంతృప్తి కలుగుతుంది. డైరీ ఉత్పత్తుల్లో ఒకటైన పెరుగును రోజు తీసుకోవడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. పెరుగును తినడం వల్ల అనేక పోషకాలు లభించడంతో పాటు చర్మారోగ్యంతో పాటుగా, జీర్ణ వ్యవస్థ పనితీరు కూడా మెరుగవుతుందని వివరించారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఎముకలు, దంతాలు బలం:పెరుగులో అధికంగా ఉండే కాల్షియం, పాస్పరస్‌లు ఎముకల బలానికి ఉపయోగపడతాయని ప్రముఖ పోషకాహర నిపుణులు డాక్టర్ లహరి సూరపనేని వెల్లడించారు. పళ్లు, ఎముకల బలంగా ఉండేందుకు అవసరమైన కాల్షియం లాంటి ఖనిజాలు పెరుగులో ఎక్కువగా లభిస్తాయని వివరించారు. ఇలా పెరుగును రెగ్యులర్గా తీసుకోవడం వల్ల ఎముకల బలంగా తయారై ఆర్థరైటిస్, ఆస్టియోపోరోసిస్ లాంటి వ్యాధులు రాకుండా కాపాడుకోవచ్చని అంటున్నారు.
గుండె ఆరోగ్యం మెరుగు:పెరుగు తినడం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించి గుండెను ఆరోగ్యంగా ఉంచుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇంకా రక్త పోటును కూడా అదుపులో పెట్టి గుండె జబ్బులు రాకుండా అడ్డుకుంటుందని వివరించారు.
బరువు తగ్గడానికి:బరువు తగ్గాలని అనుకునేవారు పెరుగును తమ డైట్లో చేర్చుకోవాలని సూచిస్తున్నారు నిపుణులు. ఇది జీవక్రియలను మెరుగుపరిచి బరువు అదుపులో ఉంచేలా చూస్తుందన్నారు. ఇందులో ఉండే అధిక ప్రోటీన్లు ఎక్కువ సేపు ఆకలి కాకుండా చేస్తుందని.. ఫలితంగా తక్కువ ఆహారాన్ని తీసుకుంటామని వివరించారు.
జీర్ణక్రియ సక్రమంగా:పెరుగులో ఉండే ప్రోబయాటిక్స్ జీర్ణక్రియను సక్రమంగా నడవడంలో సాయపడుతుందని నిపుణులు అంటున్నారు. జీర్ణక్రియ వేగవంతం చేసి ఆహారంలోని పోషకాలను శరీరానికి వేగవంతంగా అందేలా చేస్తుందని వివరించారు. ఇంకా మలబద్దకం, డయేరియా, ఉబ్బరం లాంటివి లేకుండా చేయడంలో పెరుగు కీలక పాత్ర పోషిస్తుందని వెల్లడించారు.