తెలంగాణ

telangana

ETV Bharat / health

వీళ్లు సాయంత్రం పూట కాఫీ తాగొద్దట! - కంటిన్యూ చేస్తే ఏమవుతుందో తెలుసా..? - Coffee Effects on Health - COFFEE EFFECTS ON HEALTH

Coffee Side Effects on Body : మనలో చాలా మంది రోజుకు ఒకటికన్నా ఎక్కువసార్లు కాఫీ తాగుతుంటారు. అయితే.. కొందరు మాత్రం సాయంత్రం వేళ కాఫీ తాగొద్దని నిపుణులు సూచిస్తున్నారు. మరి.. ఎవరు తాగొద్దు? తాగితే ఏమవుతుంది? అన్నది ఈ స్టోరీలో తెలుసుకుందాం.

coffee side effects on body
coffee side effects on body (ETV Bharat)

By ETV Bharat Features Team

Published : Oct 3, 2024, 5:08 PM IST

Coffee Side Effects on Body :మనలో చాలా మందికి ఉదయాన్నే కాఫీ తాగనిదే రోజు ప్రారంభమవ్వదు. వేడి వేడి కాఫీ గొంతులోకి దిగితేగానీ.. హుషారుగా ఉండలేరు. నిజానికి కాఫీ తాగడం మంచిదేనని పలు అధ్యయనాలు కూడా సూచించాయి. 2019లో "NPJ Psychological Sciences" జర్నల్‌లో ప్రచురించిన నివేదిక ప్రకారం.. కాఫీ తాగడం వల్ల మానసిక స్థితి మెరుగుపడుతుందని, ఒత్తిడి, ఆందోళన వంటి సమస్యలు తగ్గుతాయని పరిశోధకులు గుర్తించారు. ఈ అధ్యయనంలో ఆస్టేలియాలోని యూనివర్సిటీ ఆఫ్‌ వెస్ట్రన్‌‌కు చెందిన 'డాక్టర్‌ ఆస్ట్రిడ్ మోడ్రిక్-పెర్సివల్' (Dr. Astrid Modric-Percival) పాల్గొన్నారు.

అతిగా తాగితే అనర్థాలు..

  • కాఫీ తాగడం వల్ల కొన్ని ఇబ్బందులు ఉన్నాయని కూడా నిపుణులు చెబుతున్నారు. అందుకే.. మితంగా తీసుకోవాలని సూచిస్తున్నారు.
  • కాఫీ అధికంగా తాగడం వల్ల మూత్రం ఎక్కువగా వస్తుంది. ఫలితంగా ఉప్పు, నీరు ఎక్కువగా బయటకు వెళ్లిపోయి ఒంట్లో నీటిశాతం తగ్గే (డీహైడ్రేషన్‌) ప్రమాదముందని నిపుణులు చెబుతున్నారు.
  • ముఖ్యంగా ఛాతీలో మంట వంటి సమస్యలతో బాధపడేవారు కూడా కాఫీని మితంగా తాగడం మంచిదని సలహా ఇస్తున్నారు.
  • కాఫీలో ఉండే కెఫీన్‌ అనే పదార్థం జీర్ణాశయంలో ఆమ్లం ఎక్కువగా ఉత్పత్తి అయ్యేలా చేస్తుందట. ఫలితంగా ఛాతీలో మంట, పులితేన్పుల వంటి సమస్యలకు దారితీస్తుందని హెచ్చరించారు.
  • ఇదే కాకుండా కెఫీన్‌ రక్తపోటు పెరిగేలా చేస్తుంది కాబట్టి హైబీపీ బాధితులు కూడా కాస్త జాగ్రత్తగా ఉండటం మేలని చెబుతున్నారు.
  • మనం తీసుకునే ఆహారంలోని క్యాల్షియంను శరీరం గ్రహించుకునే ప్రక్రియకు కెఫీన్‌ అడ్డుపడుతుందని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి వీలైనంత తక్కువ తీసుకోవడం మంచిది!
  • ముఖ్యంగా కాఫీ తాగిన గంటలోపు రక్తంలో కెఫీన్‌ స్థాయులు విపరీతంగా పెరుగుతాయి. ఆ తర్వాత దీని ప్రభావం 4-6 గంటల వరకూ కనిపిస్తుందని వివరించారు.

సాయంత్రం తాగితే..

కాఫీ ఒకటి లేదా రెండు సార్లకు మించకుండా చూసుకుంటే బాగుంటుందని నిపుణులు చెబుతున్నారు. అయితే.. నిద్రలేమి సమస్యతో బాధపడేవారు మాత్రం సాయంత్రం పూట కాఫీ తాగకపోవటమే ఉత్తమమని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటే.. ఇప్పటికే నిద్రతో ఇబ్బంది పడేవారు కాఫీ తాగితే.. ఆ సమస్య మరింత పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. 2018లో "స్లీప్ మెడిసిన్"లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం.. సాయంత్రం వేళ కెఫిన్ తీసుకోవడం వల్ల నిద్రపోయే సమయంతోపాటు నిద్ర క్వాలిటీ కూడా తగ్గుతుందట. అందుకే.. సాయంత్రం కాఫీ తీసుకోకపోవడమే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

అలీవ్‌ గింజలతో ఆరోగ్య ప్రయోజనాలు- ఈ విషయాలు తెలిస్తే అస్సలు వదలరు..! - Alive Seeds Benefits For Moms

మీ 'గుండె' ఎంతో స్పెషల్- జాగ్రత్తగా కాపాడుకోండి - Take Care of Your Heart

ABOUT THE AUTHOR

...view details