Weather Change Effect on Health:శీతాకాలం, వానకాలం, ఎండకాలం.. ఇలా కాలాలు మారినప్పుడల్లా కొన్ని రకాల జబ్బులు వస్తుంటాయి. కాలాల మాదిరిగానే వాతావరణ మార్పు సైతం ఆరోగ్యం మీద గణనీయ ప్రభావం చూపుతోందని నిపుణులు చెబుతున్నారు. వాతావరణ మార్పులతో తలెత్తే జబ్బులతో 2030 కల్లా ప్రపంచవ్యాప్తంగా ఏటా 2.50 లక్షల మంది మరణించే ప్రమాదముందని అనేక అధ్యయనాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలోనే అలాంటి జబ్బులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
గుండె జబ్బులు: వాతావరణ మార్పుతో దీర్ఘకాలం అధిక ఉష్ణోగ్రతల వల్ల శరీరంలో నీటిశాతం తగ్గటం, రక్తపోటులో మార్పు, కిడ్నీ జబ్బులకు దారితీస్తుందని నిపుణులు అంటున్నారు. ఇవన్నీ గుండె మీద విపరీత ప్రభావం కలిగిస్తాయని.. ఫలితంగా గుండెలయ దెబ్బతినటం, గుండెపోటు, గుండె వైఫల్యం, పక్షవాతం వంటి జబ్బుల ముప్పు పెరుగుతుందన్నారు. వడదెబ్బ కూడా గుండెకు హాని చేసేదేనని చెబుతున్నారు. అధిక ఉష్ణోగ్రతలతో గర్భిణులకూ గుర్రపువాతం, నెలలు నిండక ముందే కాన్పవటం, గర్భస్రావం వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.
శ్వాస సమస్యలు: వాతావరణ మార్పుతో గాలి కాలుష్యం తీవ్రమై దుమ్ము, అలర్జీ కారకాలు పెరగటానికీ దారితీస్తాయని.. ఫలితంగా శ్వాస సమస్యలూ విజృంభిస్తాయన్నారు. ఇప్పటికే ఆస్థమా, సీవోపీడీ సమస్యలుంటే మరింత తీవ్రమవుతాయని The European Respiratory Journalలోని Climate change and respiratory disease అధ్యయనంలో తేలింది. తొలిసారిగా అలర్జీలు, అలర్జీతో ముడిపడిన ఉబ్బసం కూడా తలెత్తే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. గాలిలో ఆక్సిజన్ అంతగా లేకపోవటం, ఊపిరితిత్తుల మీద భారం పడి గుండె ఇంకాస్త తీవ్రంగా పనిచేయాల్సిన పరిస్థితీ తలెత్తుతుందని అంటున్నారు. అధిక ఉష్ణోగ్రతలే కాకుండా.. ఉష్ణోగ్రత బాగా పడిపోవటమూ సమస్యలు తెచ్చిపెడుతుందని వివరించారు. శరీరం వెచ్చగా ఉండటానికి గుండె మరింత ఎక్కువగా రక్తాన్ని పంప్ చేస్తుంటే.. చల్లగాలితో ఊపిరితిత్తులు పట్టేస్తాయని నిపుణులు పేర్కొన్నారు.
కీటకాలతో ఇబ్బందులు:మనకు అధిక ఉష్ణోగ్రతలు ఇబ్బందికరంగా ఉన్నా.. జబ్బులను వ్యాపింపజేసే కీటకాలు, పురుగులకు మాత్రం చాలా ఇష్టం. ఉష్ణోగ్రత పెరగటం వల్ల లైమ్ డిసీజ్ వంటి వాటిని వ్యాపింపజేసే పురుగులు కొత్త ప్రాంతాలకు విస్తరిస్తాయని నిపుణులు అంటున్నారు. చలి కాలంలో చలి అంతగా లేకపోతే దోమలు ఎక్కువకాలం జీవించడమే కాకుండా బాగా వృద్ధి చెందుతాయని వివరించారు. ఫలితంగా డెంగీ, మలేరియా వంటి వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.