Traffic Sound Side Effects In Telugu : శబ్ద కాలుష్యం హృదయ సంబంధిత వ్యాధులను పెంచుతుందని అంతర్జాతీయ పరిశోధకుల బృందం తేల్చింది. రోడ్డు, రైళ్లు, విమానాల రాకపోకల వల్ల వచ్చే శబ్దం గుండె పోటు, దాని సంబంధిత వ్యాధులను పెంచుతోందట. ఈ మేరకు అంతర్జాతీయ పరిశోధకుల బృందం ఓ అధ్యయనాన్ని విడుదల చేసింది. అందులో వివరాలు ఉన్నాయిలా!
అంతర్జాతీయ పరిశోధకుల బృందం తెలిపిన వివరాల ప్రకారం
ట్రాఫిక్ నుంచి వచ్చే ప్రతి 10 డెసిబుల్స్ శబ్దం గుండెపోటు, స్ట్రోక్, మధుమేహం సహా హృదయ సంబంధ వ్యాధులను పెంచే ప్రమాదం 3.2 శాతం అధికంగా ఉంది. ముఖ్యంగా రాత్రి వేళ ట్రాఫిక్‌లో వచ్చే శబ్దం ప్రజల నిద్ర సమయాన్ని తగ్గిస్తుంది. అంతేగాక రక్త నాళాల్లో ఒత్తిడిని పెంచుతుంది. తద్వారా మెదడు వాపు, అధిక రక్తపోటు వంటి వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయి.
సైకిళ్లు వినియోగిస్తే బెటర్!
రోడ్డు, రైలు, విమాన మార్గాల నుంచి వచ్చే శబ్దాన్ని తగ్గించేందుకు పరిశోధకులు పలు సూచనలు చేశారు. అధిక జనసాంద్రత, రోడ్లు రద్దీగా ఉండే ప్రాంతాల్లో బారికేడ్లు, కంచెలను ఏర్పాటు చేయడం వల్ల శబ్దాన్ని 10 డెసిబుల్స్ కంటే తక్కువకు కుదించవచ్చని పేర్కొన్నారు. శబ్దాన్ని తగ్గించే తారును ఉపయోగించి రోడ్లను నిర్మించడం వల్ల శబ్ద తీవ్రత 3-6 డెసిబుల్స్ తగ్గుతుందని తెలిపారు. డ్రైవింగ్ వేగాన్ని తగ్గించడం, తక్కువ శబ్దం వచ్చే టైర్ల వినియోగాన్ని పెంచడం వల్ల ట్రాఫిక్‌లో శబ్ద కాలుష్యాన్ని తగ్గించవచ్చని పేర్కొన్నారు. అలాగే ప్రజలు శబ్ద కాలుష్యాన్ని తగ్గించేందుకు సైకిళ్లు, ప్రజా రవాణాను వినియోగించుకోవాలని సూచించారు.