How to Stop Leg Cramps at Night :చాలా మందికి రాత్రి పడుకున్నప్పుడు నిద్రలో కాళ్లు తిమ్మిర్లు వస్తుంటాయి. దీంతో కాళ్లు నొప్పిగా మారడంతో నిద్రలో మెళకువ వస్తుంది. సాధారణంగానే ఎక్కువసేపు కదలకుండా కూర్చున్నప్పుడు కాళ్లు తిమ్మిర్లు వస్తుంటాయి. అయితే, ఇలా కాళ్లు తిమ్మిర్లు రావడానికి గల కారణాలు ఏంటి ? ఈ సమస్యని ఎలా తగ్గించుకోవాలి ? అనే విషయాలను ఇప్పుడు చూద్దాం.
కాళ్లు, చేతులు తిమ్మిర్లు రావడానికి చాలా కారణాలుంటాయని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా మన శరీరంలో పొటాషియం, మెగ్నీషియం, క్యాల్షియం, సోడియం వంటి ఎలక్ట్రోలైట్ల లోపం వల్ల తిమ్మిర్లు (national library of medicine report)వచ్చే అవకాశం ఉంటుంది.
- అలాగే ఎక్కువగా పని చేసినప్పుడు, వ్యాయామం చేసినప్పుడు అలసిపోతాము. దీనివల్ల కాళ్లు తిమ్మిర్లు వస్తుంటాయి.
- కొన్ని రకాల మందుల సైడ్ ఎఫెక్ట్స్ కారణంగా ఈ సమస్య వస్తుంది.
- గర్భిణులలోనూ సహజంగానే కాళ్లు తిమ్మిర్లు వస్తుంటాయి.
- మధుమేహం, మూత్రపిండాల వ్యాధి, థైరాయిడ్, నరాల సంబంధిత సమస్యల వల్ల నిద్రలో కాళ్లు తిమ్మిర్లు వస్తుంటాయని నిపుణులు చెబుతున్నారు.
నిద్రలో కాళ్లు తిమ్మిర్లు రాకుండా ఈ టిప్స్ పాటించండి..
- నైట్ టైమ్లో కాళ్లు తిమ్మిర్లు వచ్చే వారు రోజూ ఎక్కువ నీటిని తాగాలి.
- అలాగే మద్యం సేవించకూడదు. ఆల్కాహాల్ తాగడం వల్ల కాళ్లు తిమ్మిర్లు వచ్చే అవకాశం అధికంగా ఉంటుంది.
- డైలీ చెమట వచ్చేలా వ్యాయామం చేయాలి. ఇలా చేస్తే తిమ్మిర్లు రావడం చాలా వరకు తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు.
- 2015లో 'జర్నల్ ఆఫ్ క్లినికల్ అండ్ డయాగ్నోస్టిక్ రీసెర్చ్'లో ప్రచురించిన అధ్యయనం ప్రకారం.. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల కాళ్ల తిమ్మిర్లు తగ్గుతాయని కనుగొన్నారు. ఈ పరిశోధనలో దక్షిణాఫ్రికాలోని కేప్ టౌన్ విశ్వవిద్యాలయానికి చెందిన 'డాక్టర్ మార్టిన్ పి. ష్వెల్నస్' పాల్గొన్నారు.
- కాళ్లు తిమ్మిర్లు ఎక్కువగా ఉంటే పడుకునే ముందు వస్త్రాన్ని వేడి నీటిలో ముంచి.. పిండిన తర్వాత తిమ్మిర్లు వచ్చే చోట రుద్దుకోండి. రోజూ ఇలా చేస్తే మంచి ఫలితం కనిపిస్తుంది.
- అలాగే పడుకునే ముందు కాళ్లకు మసాజ్ చేసుకోండి.
- మన బాడీలో పొటాషియం లోపిస్తే కూడా ఎక్కువగా కాళ్లు తిమ్మిర్లు వస్తుంటాయి. అందుకే పొటాషియం అధికంగా ఉండే బంగాళాదుంపలు, అరటిపండ్లు, నారింజ పండ్లను తరచూ తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
- రాత్రి మీరు నిద్రపోయే భంగిమ సరిగ్గా ఉండేలా చూసుకోండి.
- రోజంతా ఉదయం ఎక్కువసేపు కూర్చున్నా లేదా నిలబడినా కాళ్లు తిమ్మిర్లు వచ్చే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి ఎక్కువసేపు కూర్చునే వారు, గంటకు కనీసం 5 నిమిషాలైనా అలా నడవాలని సూచిస్తున్నారు.
- ఈ టిప్స్ పాటించడం వల్ల నిద్రలో వచ్చే కాళ్లు తిమ్మిర్ల సమస్యను తగ్గించుకోవచ్చు.