Thyroid Symptoms : ప్రస్తుత కాలంలో మారిన జీవన శైలి, ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమకు దూరంగా ఉండడం వంటి వివిధ కారణాల వల్ల ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు మనల్ని చుట్టుముడుతున్నాయి. ముఖ్యంగా మహిళలను థైరాయిడ్ సమస్య ఎక్కువగా ఇబ్బంది పెడుతోంది. ఈ ఒక్క సమస్య వల్ల మహిళల్లో పలు రకాల ఇబ్బందులు వస్తాయని ప్రముఖ డయాబెటాలజిస్ట్ 'డాక్టర్ పి.వి. రావు' చెబుతున్నారు. థైరాయిడ్ వల్ల వచ్చే హెల్త్ ప్రాబ్లమ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం..
మన బాడీలో ఎన్నో అవయవాలు, విభాగాలుంటాయి. వీటిలో థైరాయిడ్ వ్యవస్థ అత్యంత కీలకంగా పని చేస్తుంది. మన జీవక్రియల్ని క్రమబద్ధం చేసే.. అతి ముఖ్యమైన పనిని థైరాయిడ్ వ్యవస్థే నిర్వహిస్తుంది. సీతాకోక చిలుక ఆకారంలో ఉండే థైరాయిడ్ గ్రంథి.. శరీర అవసరాలను బట్టి, నిరంతరం హార్మోన్లను స్రవిస్తూ జీవక్రియల్ని సక్రమంగా జరిగేలా చూస్తుంది. అయితే, థైరాయిడ్ గ్రంథి విడుదల చేసే థైరాక్సిన్ హార్మోన్ ఎక్కువైనా, తక్కువైనా కూడా పలు రకాల అనారోగ్య సమస్యలు వస్తాయంటున్నారు.
థైరాయిడ్ ద్వారా వచ్చే ఇబ్బందులను రెండు రకాలుగా విభజించవచ్చంటున్నారు నిపుణులు. అవసరమైన దాని కంటే.. థైరాయిడ్ హార్మోన్ అధికంగా ఉత్పత్తి అవుతుంటే.. అలాంటి పరిస్థితిని హైపర్ థైరాయిడిజమని (Hyperthyroidism), నార్మల్ స్థాయి కంటే తక్కువగా థైరాయిడ్ హార్మోన్ ఉన్నప్పుడు హైపో థైరాయిడిజమని (Hypothyroidism) అంటారని డాక్టర్ వివరిస్తున్నారు.
హైపో థైరాయిడ్ లక్షణాలు :
- సాధారణంగా థైరాయిడ్‌తో బాధపడేవారిలో తీవ్రమైన అలసట వేధిస్తుంది.
- థైరాయిడ్ హార్మోన్స్ తగ్గితే బరువు పెరుగుతారు.
- జుట్టు అధికంగా రాలిపోతుంది.
- ఎక్కువగా చెమట పడుతుంది.
- థైరాయిడ్‌తో బాధపడేవారిలో బయటకు కనిపించే లక్షణాలలో మెడ ఉబ్బడం ఒకటి. థైరాయిడ్ గ్రంథి మార్పుల వల్ల ఇలా మెడ వాపు వస్తుంది.
- థైరాయిడ్ సమస్య తలెత్తినప్పుడు మన శరీర ఉష్ణోగ్రతలో మార్పు వస్తుంది. ఒక్కసారిగా పెరగడమో, తగ్గడమో జరుగుతుంది. వాతావరణం సరిగానే ఉన్నా.. ఎక్కువ చలిగానో లేదా ఎక్కువ వేడిగానో అనిపిస్తుంది.
- స్కిన్ పొడిబారుతుంది.
- గోర్లు కూడా పెలుసుగా మారతాయి.
- తరచూ కాళ్లు, చేతులు తిమ్మిర్లు వస్తాయి.
- చేతులు జలదరింపులు వస్తాయి.
- మలబద్ధకం
- అసాధారణ రుతుస్రావం