Tattoo Skin Care Tips: ఈ రోజుల్లో టాటూలు వేయించుకోవడం ఒక ట్రెండ్‌గా మారింది. కొందరు ఇష్టమైన వారిపై ప్రేమను చూపడానికి టాటూ వేయించుకుంటే, కొందరు ఫ్యాషన్ కోసం, మరికొందరు సినీతారలు, క్రీడాకారులపై ఉన్న మక్కువతో వాళ్ల పేర్లు, ఇంకొందరు నచ్చిన సింబల్స్, దేవుళ్లు, కోట్స్ పచ్చబొట్టుగా వేయించుకుంటూ ఉంటారు. టాటూ వేయించిన తర్వాత వాటిని చూసుకొని మురిసిపోవడం కాకుండా, అక్కడి స్కిన్ విషయంలో కచ్చితమైన జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. లేకపోతే పచ్చబొట్టు పొడిపించుకున్న చర్మం, దాని చుట్టూ అలర్జీలు, ర్యాషెస్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటున్నారు. మరి అందుకోసం పాటించాల్సిన టిప్స్ ఈ స్టోరీలో చూద్దాం..
తేమ:టాటూ వేయించుకునే క్రమంలో అక్కడి చర్మ కణాలు దెబ్బతింటాయి. తద్వారా ఆ ప్రాంతమంతా తేమను కోల్పోయి నిర్జీవంగా మారిపోతుంది. అయితే అక్కడ కొత్తకణాల ఉత్పత్తిని ప్రేరేపించడానికి మాయిశ్చరైజర్ ఉపయోగపడుతుంది. అందుకే రోజుకు రెండుసార్లు ఆ ప్రాంతాన్ని సబ్బు, చల్లటి నీటితో శుభ్రం చేయాలి. ఆపై మాయిశ్చరైజర్ అప్లై చేయాలి. ఈ తరహా మాయిశ్చరైజర్ ఆ చర్మానికి చల్లదనాన్ని అందించడంతో పాటు అక్కడ కొత్త కణాలు ఉత్పత్తి అయ్యేలా చేస్తుంది. అలాగని మరీ ఎక్కువ మొత్తంలో క్రీములు, లోషన్లు వాడారంటే అక్కడి చర్మ రంధ్రాలు మూసుకుపోతాయి. కాబట్టి తగిన మోతాదులో ఉపయోగించాలనే విషయం గుర్తుంచుకోవాలి.
సన్ స్క్రీన్:టాటూ వేయించుకున్న చర్మాన్ని ఎండ నుంచి కాపాడుకోవడం కూడా ముఖ్యమే అంటున్నారు నిపుణులు. ఎందుకంటే UV కిరణాల వల్ల పచ్చబొట్టు కోసం వాడిన కొన్ని రకాల ఇంకుల రంగు వెలిసిపోయే ప్రమాదం ఉంది. అంతేకాదు, ఈ కిరణాల వల్ల ఆ చర్మ ప్రాంతంలో అలర్జీ వచ్చే అవకాశాలూ ఉన్నాయి. కాబట్టి ఎండ నుంచి రక్షణం పొందడానికి SPF 30 సన్‌స్క్రీన్‌ను బయటికి వెళ్లడానికి పావుగంట ముందు అప్లై చేసుకోవాలి. అలాగే ప్రతి రెండు గంటలకోసారి దీన్ని అప్లై చేసుకోవడం మర్చిపోవద్దు.