Talcum Powder Side Effects :ఇంట్లో నుంచి బయటకు వెళ్తున్నామంటే.. చాలా మంది కచ్చితంగా చేసే పని అద్దం చేతిలోకి తీసుకోవడం. ఆ తర్వాత కొందరు ఫేస్ క్రీమ్ రాసుకుంటారు. మరికొందరు పౌడర్ వేసుకుంటారు. ఇలా ముఖానికి పౌడర్ అద్దనిదే కాలు బయట పెట్టరు! మరికొందరు చెమట దుర్వాసన అడ్డుకోవడానికి చంకల్లో కూడా పౌడర్ రాసుకుంటారు. ఇంకొందరు జననాంగాల వద్ద కూడా పూసుకుంటారు. అయితే.. ఇలా పౌడర్ వాడేవారికి క్యాన్సర్‌వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మహిళలకు అండాశయ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని చెబుతున్నారు.
కొంత మంది మహిళలు జననాంగాల వద్ద టాల్కమ్ పౌడర్ వేసుకుంటారు. ఇలా రోజూ టాల్కమ్ పౌడర్ ఉపయోగించడం వల్ల మహిళల్లో అండాశయ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీనిపై కొన్ని పరిశోధనలు కూడా జరిగాయి. 2014లో "జర్నల్ ఆఫ్ క్లినికల్ ఆంకాలజీ"లో ప్రచురించిన నివేదిక ప్రకారం.. రోజూ టాల్కమ్ పౌడర్ ఉపయోగించే మహిళలకు అండాశయ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని పరిశోధకులు గుర్తించారు.
ఈ పరిశోధనలో అమెరికాలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్‌కు చెందిన డాక్టర్ క్రిస్టోఫర్ J. పీటర్స్ పాల్గొన్నారు. ఈ పరిశోధన 2003 నుంచి 2009 వరకు జరిగింది. ఈ అధ్యయనంలో 50,884 మంది మహిళలు పాల్గొన్నారు. జననాంగాలపై టాల్కమ్ పౌడర్‌ను తరచుగా ఉపయోగించే మహిళలకు అండాశయ క్యాన్సర్ వచ్చే ప్రమాదం 24% ఎక్కువగా ఉందని అధ్యయనంలో కనుగొన్నారు.