Symptoms of Cancer in Woman :మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్ల కారణంగా.. నేడు చాలా మంది మహిళలు క్యాన్సర్ బారిన పడుతున్నారు. అంతేకాదు.. వాటిని చివరి దశలో గుర్తిస్తున్నారు. దీంతో ఏటా ఎంతో మంది చిన్నవయసులోనే ప్రాణాలు కోల్పోతున్నారని నిపుణులు చెబుతున్నారు. అందుకే క్యాన్సర్ వంటి ప్రమాదకరమైన జబ్బుల లక్షణాలను ముందుగానే గుర్తించి చికిత్స తీసుకోవాలని సూచిస్తున్నారు. అయితే, మహిళల్లో ఎక్కువగా వచ్చే క్యాన్సర్‌లు ఏవి ? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి ? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
రొమ్ము క్యాన్సర్ :
ఇటీవల కాలంలో ఎక్కువ మంది మహిళలు రొమ్ము క్యాన్సర్ బారిన పడుతున్నారు. అందుకే రొమ్ము లేదా చంక ప్రాంతంలో గడ్డలు లేదా వాపు వంటి లక్షణాలు కనిపిస్తే ఏమాత్రం నిర్లక్ష్యం చేయకూడదని నిపుణులు చెబుతున్నారు. అలాగే చర్మం పాలిపోయినట్లుగా ఉండటం, చికాకు, చర్మం పైభాగం ఎర్రగా ఉండటం, చనుమొనలో మార్పులు లేదా చనుమొన నుంచి రక్తం కారడం వంటి లక్షణాలు కనిపిస్తే వైద్యుడిని సంప్రదించాలని సూచిస్తున్నారు. 2019లో 'జర్నల్ ఆఫ్ ది అమెరికన్ మెడికల్ అసోసియేషన్' ప్రచురించిన నివేదిక ప్రకారం రొమ్ములో గడ్డలు ఉన్న మహిళల్లో 12 శాతం మందికి రొమ్ము క్యాన్సర్ ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు. ఈ అధ్యయనంలో 10,000 మంది మహిళలు పాల్గొన్నారు.
రొమ్ము క్యాన్సర్ బారిన పడొద్దంటే - ఇవి తినాల్సిందే!
ఎండోమెట్రియల్ క్యాన్సర్ కావచ్చు :
మెనోపాజ్ దాటిన మహిళల్లో రక్తస్రావంతోపాటు వెజైనా దగ్గర నొప్పి కూడా వస్తోందంటే అది ఎండోమెట్రియల్ క్యాన్సర్ (గర్భాశయ క్యాన్సర్)కు సంకేతం కావచ్చని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి.. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి. ఇలాంటి చాలా కేసుల్లో చికిత్స చేసేటప్పుడు గర్భాశయాన్ని పూర్తిగా తొలగించాల్సి వస్తుందట.
బ్లీడింగ్‌తో పాటు :
మెనోపాజ్ తర్వాత బ్లీడింగ్ అవుతుంటే అది సర్వైకల్ క్యాన్సర్ కూడా కావొచ్చట. రక్తస్రావంతో పాటు సెక్స్ సమయంలో నొప్పి, వెజైనల్ డిశ్చార్జ్ వంటి లక్షణాలు కనిపిస్తే ఈ క్యాన్సర్‌గానే అనుమానించాలంటున్నారు.