Stomach Ulcers Symptoms : అజీర్తి అనేది ఈ మధ్య కాలంలో చిన్నా, పెద్దా తేడా లేకుండా చాలామందిని వేధిస్తున్న ఆరోగ్య సమస్య. సమయానికి ఆహారం తీసుకోకపోతే, తీసుకున్న ఆహారంలో నూనెలు, కొవ్వుపదార్థాలు ఎక్కువగా ఉంటే ఈ సమస్య మరింత ఎక్కువవుతుంది. అయితే అజీర్తి అనేది తీవ్రరూపం దాల్చినప్పుడు అల్సర్స్గా మారుతుంది. ఈ మధ్య కాలంలో అల్సర్స్గా బాధపడుతున్న వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. అల్సర్స్ రావడానికి ప్రధాన కారణాలు ఏంటి? వాటికి సంబంధించిన నివారణ చర్యలను ఇప్పుడు చూద్దాం.
అల్సర్స్ అంటే?
What Are Stomach Ulcers : జీర్ణకోశంలోని పేగులో పూత లేదా పొట్టులా ఏర్పడడాన్ని అల్సర్స్ అని, వైద్యపరిభాషలో గ్యాస్ట్రైటిస్ అని అంటారు. ఇది ప్రారంభంలో పెద్దగా ఇబ్బంది పెట్టకపోయినా, పెరిగి తీవ్రమైనప్పుడు మాత్రం ప్రమాదకరంగా మారే పరిస్థితులు ఏర్పడవచ్చు. అల్సర్స్ వల్ల కొన్నిసార్లు తీవ్రంగా రక్తస్రావం జరిగి, శరీరానికి నష్టం కలగవచ్చు. అలాంటప్పుడు సంబంధిత వైద్యులను సంప్రదించి చికిత్స తీసుకోవాలని సూచిస్తున్నారు ఆరోగ్య నిపుణులు.
అల్సర్స్కు కారణాలు ఇవే
అల్సర్స్ రావడానికి కారణాల్లో మొదటగా చెప్పుకోవాల్సింది జీవన విధానంలో మార్పు రావడం. అలాగే హెచ్ పైలోరి అనే బ్యాక్టీరియా కూడా ఇందుకు ప్రధాన కారణం. ఈ బ్యాక్టీరియా చేసే ఇన్ఫెక్షన్ వల్ల కూడా అల్సర్స్ ఏర్పడతాయి. ఈ బ్యాక్టీరియా యాంట్రమ్ అనే పేగు భాగాన్ని ప్రభావితం చేస్తుంది. కొన్నిసార్లు కలుషిత నీటి వల్ల కూడా అల్సర్స్ ఏర్పడే ప్రమాదం ఉంది. అలాగే పెయిన్ కిల్లర్స్ వాడే వారికీ అల్సర్స్ ఎక్కువగా వచ్చే ఆస్కారం ఉంటుంది.
అల్సర్స్ నిర్ధరణ ఇలా
కొన్నిసార్లు అల్సర్స్ బయటపడకపోవచ్చు. అనుమానం కలిగితే వెంటనే వైద్యులను సంప్రదించడం ద్వారా అల్సర్స్ ఉన్నాయా లేదా అనేది నిర్ధరణ అవుతుంది. వైద్యులు ముందుగా పేషంట్ హిస్టరీని చెక్ చేస్తారు. పెయిన్ కిల్లర్స్ లాంటివి ఏమైనా వాడుతున్నారా, లేదా అనేది తెలుసుకుంటారు. ఇతర ఆరోగ్యపరమైన అంశాల గురించి కూడా ఆరా తీస్తారు. కొన్నిసార్లు వైద్యులు ఎండోస్కోపీ చేయడం ద్వారా అల్సర్స్ ఎంత పరిమాణంలో ఉన్నాయో కూడా చెక్ చేసుకోవచ్చు.