Signs of Dehydration In Children :డీహైడ్రేషన్ అనేది పిల్లల్లో కనిపించే సాధారణ సమస్య. అయినప్పటికీ వారి తల్లిదండ్రులుగా ఇది మీరు ఆందోళన చెందాల్సిన విషయమే అంటున్నారు నిపుణులు. ఎందుకంటే డీహైడ్రేషన్ సమస్య మీ పిల్లలను దీర్ఘకాలికంగా చాలా రకాలుగా ఇబ్బంది పెడుతుంది. కనుక మీరు దీన్ని ముందే గుర్తించి జాగ్రత్త పడాల్సి ఉంటుంది. మీ పిల్లల్లో డీహైడ్రేషన్ సమస్య ఉందా లేదా అని తెలుసుకునేందుకు కొన్ని లక్షణాలు వారిలో ఉన్నాయా లేదా అని గమనిస్తే సరిపోతుంది. అవేంటో ఇప్పుడు చూద్దాం.
మూత్రవిసర్జన తగ్గడం :తల్లిదండ్రులుగా మీరు గమనించాల్సిన ముఖ్య విషయం మీ పిల్లల బాత్రూం అలవాట్లు. ఇవి వారి ఆరోగ్యం విషయంలో మీకు చాలా సంకేతాలను అందిస్తాయి. మూత్రవిసర్జన తగ్గిపోవడం, ముదురు రంగు మూత్రం నిర్జలీకరణాన్ని సూచిస్తాయి. డీహైడ్రేషన్ సమస్య లేకపోతే మూత్రం లేత పసుపు రంగులో కనిపిస్తుంది.
నోరు పొడిబారడం :పిల్లలకు తరచూ దాహం వేయడం, నోరు ఎండిపోయి పొడిబారినట్లుగా అనిపించడం డీహైడ్రేషన్‌కు సంకేతం కావచ్చు. కనుక రోజంతా వారిని గమనిస్తూ తగినంత నీరు తాగేలా ప్రోత్సహించండి. ఇది వారిని డీహైడ్రేషన్ సమస్యల నుంచి దూరంగా ఉంచుతుంది.
నీరసం, చిరాకు :గలగలా మాట్లాడుతూ ఎప్పుడూ ఆడుకునే పిల్లలు అలసటగా, చిరాకుగా కనిపించారంటే వారిని డీహైడ్రేషన్ సమస్య ఇబ్బంది పెడుతుందా అని మీరు గమనించాలి. నిర్జలీకరణం(Dehydration) పిల్లల్లో అలసట, చికాకుకు దారితీస్తుంది.
డ్రై స్కిన్ : పిల్లల చర్మం పొడిపొడిగా, తెల్లటి పాచెస్ కలిగి ఉండటం కూడా నిర్జలీకరణకు సంకేతమని చెప్పచ్చు. వారు సరిపడా నీటిని తీసుకుంటున్నారా లేదా అని వారి చర్మ పరిస్థితినీ ఎల్లప్పుడూ గమనిస్తూఉండాలి.