తెలంగాణ

telangana

అలర్ట్‌ : మొలకెత్తిన బంగాళాదుంపలు - ఇవి తింటే ఏం జరుగుతుందో తెలుసా? - Sprouted Potatoes Side Effects

By ETV Bharat Telugu Team

Published : Jul 14, 2024, 11:56 AM IST

Sprouted Potatoes Side Effects : బంగాళాదుంపలను తీసుకొచ్చి నిల్వ ఉంచితే.. కొన్ని రోజుల తర్వాత వాటిపై మొలకలొస్తుంటాయి. ఆ మొలకలను తీసేసి కర్రీ చేస్తుంటారు. మరి.. ఇలా మొలకెత్తిన ఆలుగడ్డలు తినడం ఆరోగ్యానికి మంచిదేనా?

Sprouted Potatoes
Sprouted Potatoes Eating Side Effects (ETV Bharat)

Side Effects Of Eating Sprouted Potatoes :బంగాళాదుంపలు ఎక్కువ రోజులు నిల్వ ఉంటే.. వాటిపై చిన్న చిన్న మొలకలొస్తాయని అందరికీ తెలుసు. కొంతమంది ఆ మొలకలను కట్ చేసి వంటల్లో ఉపయోగిస్తుంటారు. మీరు కూడా ఇలా చేస్తున్నారా ? అయితే, ఈ అలర్ట్‌గా ఉండాల్సిందేనని నిపుణులంటున్నారు. ఇలా మొలకెత్తిన బంగాళాదుంపలను తినడం ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదని చెబుతున్నారు. వీటిని తినడం వల్ల ఎటువంటి అనారోగ్య సమస్యలు వస్తాయో ఇప్పుడు చూద్దాం.

ఫుడ్ పాయిజన్..
వంటలలో మొలకెత్తిన లేదా ఆకుపచ్చగా మారిన బంగాళాదుంపలను వాడకుండా ఉండటమే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటే.. మొలకలొచ్చిన బంగాళాదుంపలలో పోషక విలువలు తగ్గిపోతాయని అంటున్నారు. అంతేకాదు.. గ్లైకోఅల్కలాయిడ్స్‌ అనే కొన్ని విషపూరిత సమ్మేళనాలను తయారవుతాయట. ఇవి ఫుడ్‌ పాయిజన్‌కు దారి తీస్తాయని నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. అలాగే.. మొలకెత్తిన బంగాళాదుంపలలో సోలనిన్ స్థాయులు పెరుగుతాయని, ఇవి పలు అనారోగ్య సమస్యలకు కారణమవుతాయని చెబుతున్నారు.

ఊహాతీతం : ఒక సిగరెట్​ తాగడం పూర్తయ్యేలోపు - మీ శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా?

జీర్ణ సమస్యలు:
మొలకెత్తిన బంగాళాదుంపలు తినడం వల్ల వికారం, వాంతులు, విరేచనాలు, కడుపు నొప్పి వంటి అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దీనిపై పలు పరిశోధనలు కూడా జరిగాయి. 2002లో 'ఫుడ్ అండ్ కెమికల్ టాక్సికాలజీ' జర్నల్‌లో ప్రచురించిన అధ్యయనం ప్రకారం.. మొలకెత్తిన బంగాళాదుంపలను తిన్న వారిలో సోలనిన్ స్థాయిలు గణనీయంగా పెరిగాయని.. వికారం, వాంతులు, విరేచనాలు, కడుపు నొప్పి వంటి లక్షణాలు కనిపించాయని పరిశోధకులు గుర్తించారు. ఈ పరిశోధనలో ఐర్లాండ్‌లో డబ్లిన్ విశ్వవిద్యాలయంలోని ట్రినిటీ కాలేజ్‌లో ఫార్మకాలజీ, థెరప్యూటిక్స్ ప్రొఫెసర్ 'డాక్టర్ డెన్నిస్ జె.ఆర్. మెక్‌ఆలిఫ్' పాల్గొన్నారు.

షుగర్‌ ఉన్నవారు తింటే ఏమవుతుంది?
మొలకెత్తిన బంగాళదుంపలను షుగర్‌ ఉన్నవారు తినకపోవడమే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటే.. బంగాళాదుంపలు మొలకెత్తినప్పుడు, వాటిలోని స్టార్చ్ కంటెంట్ చక్కెరలుగా మారుతుందట. దీనివల్ల గ్లైసెమిక్ ఇండెక్స్‌ పెరుగుతుంది. తాజా బంగాళాదుంపలతో పోలిస్తే.. మొలకెత్తిన బంగాళాదుంపలు తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయులు వేగంగా పెరుగుతాయట. కాబట్టి, మధుమేహం ఉన్నవారు వీటిని తినకపోవడమే మంచిదని సూచిస్తున్నారు.

మీరు యాపిల్‌ పండ్లని పొట్టు తీసి తింటున్నారా? - అలా చేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మొలకలు రాకుండా ఇలా చేయండి!
పొటాటోలను చల్లని, పొడి ప్రదేశంలో ఉంచాలని.. అది చీకటి ప్రదేశమైతే ఇంకా బాగుంటుందని సూచిస్తున్నారు. దీనివల్ల ఎక్కువ కాలంపాటు మొలకెత్తకుండా చూసుకోవచ్చని చెబుతున్నారు. అలాగే.. వీటిని ఉల్లిపాయలకు దూరంగా ఉంచాలట. చివరగా.. మొలకెత్తిన బంగాళాదుంపలను తినాల్సి వస్తే.. వాటి మొలకలను తీసివేసి బాగా ఉడికించి తీసుకోవాలని సూచిస్తున్నారు.

NOTE :ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

మీకంటే ముందు మీ నోటి దుర్వాసన హాయ్ చెబుతోందా? - ఇలా గుడ్​బై చెప్పండి!

గతంలో మాదిరిగా ఏమీ గుర్తుండట్లేదా? - ఈ 5 పనులు చేస్తే చాలు - మీ "బ్రెయిన్ పవర్" జెట్ స్పీడ్​తో దూసుకెళ్తుంది!

ABOUT THE AUTHOR

...view details