Rice or Roti Which is Better for Diabetes:ప్రస్తుతం కాలంలో చిన్నా పెద్దా తేడా లేకుండా దాదాపు అందరిని మధుమేహం సమస్య వేధిస్తోంది. అయితే, క్రమశిక్షణతో కూడిన జీవనవిధానం, శరీర అవసరాలకు తగ్గ పోషకాహారం, తగిన వ్యాయామం చేయడం వల్ల మధుమేహం వ్యాధి బారినపడకుండా కాపాడుకోవచ్చని నిపుణులు సలహా ఇస్తున్నారు. ఈ క్రమంలోనే చాలా మంది అన్నానికి బదులుగా చపాతీలు తింటుంటారు. ఇలా తినడం వల్ల డయాబెటిస్ అదుపులో ఉంటుందని భావిస్తుంటారు. అసలు నిజంగానే షుగర్ సమస్య ఉన్నవారు అన్నానికి బదులుగా చపాతీలు తింటే మేలు చేస్తుందా? అన్న ప్రశ్నకు ప్రముఖ పోషకాహార నిపుణులు డాక్టర్ జానకీ శ్రీనాథ్ వివరించారు.
"మధుమేహం రోగులు తప్పనిసరిగా తమకంటూ ప్రత్యేకమైన ఆహారపట్టికను పాటించాలి. రక్తంలో చక్కెర నిల్వల్ని అదుపు చేసుకోవాలంటే ముందు ఎత్తుకు తగ్గ బరువున్నారో లేదో చెక్ చేసుకోవాలి. ఒకవేళ అంతకు తక్కువ ఉంటే.. సాధారణ స్థాయికి పెరగాలి.. ఎక్కువ ఉంటే తగ్గడానికి ప్రయత్నించాలి. అలానే మీరు రోజంతా ఎలాంటి శారరీక శ్రమ చేస్తారు? అందుకు ఎంత మేర శక్తి అవసరం అవుతుందన్న విషయాలను కెలొరీల్లో నిర్ధరించుకుని ఆ మేరకు ఆహార రూపంలో తీసుకోవాలి. షుగర్ రోగులు వేసుకునే ట్యాబెట్లు, ఇన్సులిన్ డోసు అందరికీ ఒకలా ఉండవు."
--డాక్టర్ జానకీ శ్రీనాథ్, పోషకాహార నిపుణులు
ఏది తినాలి?
రక్తంలో చక్కెర స్థాయుల నియంత్రణకు అన్నం, చపాతీల్లో ఏది తిన్నా పెద్దగా తేడా ఏమీ ఉండదని పోషకాహార నిపుణులు డాక్టర్ జానకీ శ్రీనాథ్ తెలిపారు. శరీరానికి అవసరమైన శక్తికి తగ్గట్లు ఆ పూటకి సరిపడా కెలొరీలు తీసుకుంటున్నామో లేదో చూసుకుంటే సరిపోతుందని వివరించారు. మొదటి నుంచీ ఉన్న మీ ఆహారపు అలవాట్లకు భిన్నంగా ఏదీ బలవంతంగా తినాల్సిన అవసరం లేదని వెల్లడించారు. అయితే, అన్నం కూడా ఎంత మోతాదు తింటున్నామో గమనించుకోవాలని సూచిస్తున్నారు. చపాతీలను లెక్కకు మించి తిన్నా, బాగా రావాలని ఎక్కువ ప్రాసెసింగ్ చేసిన గోధుమపిండి వాడినా కూడా ఫలితం ఉండదని పేర్కొన్నారు.