Prostate Cancer Symptoms :పురుషుల్లో కనిపించే క్యాన్సర్లలో అత్యంత భయంకరమైనది ప్రోస్టేట్ క్యాన్సర్. ఒకప్పుడు ఈ క్యాన్సర్ వ్యాధి వృద్ధుల్లోనే కనిపించేది.. కనీసం 60 ఏళ్లు దాటిన వారికే వచ్చేది. కానీ ఇప్పుడు.. వివిధ కారణాలతో చిన్న వయస్సులోనే వస్తోంది. కాబట్టి, ముందు నుంచే జాగ్రత్తపడాలని నిపుణులు సూచిస్తున్నారు. కొన్ని రకాల లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించి.. తగిన చికిత్స తీసుకోవాలని సూచిస్తున్నారు. లేదంటే ప్రాణాలకే ప్రమాదమని హెచ్చరిస్తున్నారు. మరి ప్రొస్టేట్ క్యాన్సర్ వ్యాధి లక్షణాలు ఎలా ఉంటాయి? ఇది రావడానికి గల కారణాలు ఏంటి ? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రోస్టేట్ క్యాన్స్‌ర్ రావడానికి ప్రధాన కారణాలు :
- వంశపారపర్యంగా ఈ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది.
- అలాగే ఆహారపు అలవాట్లు, జీవనశైలి,ఊబకాయం కారణంగా చిన్నవయసులోనే ప్రొస్టేట్ క్యాన్సర్ రావొచ్చని నిపుణులంటున్నారు.
- పొగ త్రాగడం, మద్యం సేవించడం.
- సరైన శారీరక శ్రమ లేకపోవడంతో కూడా ఈ క్యాన్సర్ రావడానికి ప్రధాన కారణాలని అంటున్నారు.
ప్రోస్టేట్ క్యాన్సర్ లక్షణాలు :
ఈ క్యాన్స్‌ర్ ప్రారంభంలో ఎటువంటి లక్షణాలూ కనిపించవు. కానీ, ముందుగా ప్రొస్టేట్ గ్రంథిలో వాపు కనిపిస్తుంది. అంతే కాకుండా మూత్ర విసర్జన సమయంలో ఇబ్బందులు తలెత్తుతాయని చెబుతున్నారు. వీటితో పాటు మరికొన్ని లక్షణాలు ఉంటే అది ప్రొస్టేట్ క్యాన్సర్ అని గుర్తించండి.
- మూత్ర విసర్జన ఎక్కువగా చేయాల్సి రావడం.
- మూత్ర విసర్జించే సమయంలో ఇబ్బందులు, నొప్పి, మంట లేదా మూత్రం సాఫీగా రాకపోవడం
- మూత్రంలో రక్తం రావడం
- PLCO (Prostate, Lung, Colorectal, and Ovarian) Cancer Screening Trial అధ్యయనం ప్రకారం, 76,000 మంది పురుషులలో మూత్రంలో రక్తం వస్తోందా లేదా అని పరీక్షించారు. అయితే, పది సంవత్సరాల తర్వాత మూత్రంలో రక్తం కనిపించిన వారిలో ప్రొస్టేట్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం 20% ఎక్కువగా ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు.
- వీర్యంలో రక్తం కనిపించడం
- వీపు, ఛాతీ ఇతర భాగాలలో ఉండే ఎముకల్లో నొప్పి రావడం
- అలాగే ఈ భాగాల్లో పుండ్లు కనిపించడం
- లైంగిక చర్యలో పాల్గొన్న సమయంలో మంట
- అంగస్తంభన సమస్య
- తరచూ అలసటగా అనిపించడం.
- బరువు తగ్గడం
- ఆకలి లేకపోవడం
- పొత్తి కడుపు కింది భాగంలో నొప్పి