Precautions For Diabetes :హై-షుగర్ దీర్ఘకాలం పాటు కొనసాగితే.. గుండె, కిడ్నీ జబ్బులు, స్ట్రోక్ వంటి వివిధ హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చి పడతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే.. షుగర్ ఉన్నవారు నిత్యజీవితంలో తెలిసీ తెలియక చేసే తప్పుల కారణంగానే బ్లడ్ షుగర్ పెరిగిపోతుందని చెబుతున్నారు. మరి.. అవేంటో మీకు తెలుసా?
శారీరక శ్రమ చేయకపోవడం :
గంటల తరబడి కూర్చుని పని చేసేవారు, వ్యాయామానికి దూరంగా ఉండే వారిలో టైప్ 2 డయాబెటిస్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందట. అయితే.. ఇప్పటికే షుగర్ ఉన్న వారు రోజూ శారీరక శ్రమ చేయకపోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు. అందుకే కనీసం 20 నిమిషాలు వాకింగ్ చేయాలని సూచిస్తున్నారు.
ప్రాసెస్డ్ ఫుడ్ :
చక్కెర వ్యాధి ఉన్న వారు రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు నియంత్రణలో ఉండటానికి మంచి ఆహారం తినాలి. అయితే, వీరు షుగర్, ఫ్యాట్, ఉప్పు, క్యాలరీలు ఎక్కువగా ఉండే ప్రాసెస్‌డ్ ఫుడ్ తినడం వల్ల గ్లూకోజ్ స్థాయిలు పెరుగుతాయి. అలాగే షుగర్ ఉండే డ్రింక్స్ తాగడం వల్ల కూడా షుగర్ స్థాయిలు పెరుగుతాయి. కాబట్టి, ఫైబర్ ఎక్కువగా ఉండే తృణధాన్యాలను రోజూ ఆహారంలో భాగం చేసుకోవాలి. అలాగే తాజా పండ్లు, కూరగాయలను తీసుకోవాలి. కాబట్టి, ఏదైనా ఆహారం తినే ముందు డాక్టర్లను సంప్రదించాలని నిపుణులు సూచిస్తున్నారు.
రాత్రి పూట ఆలస్యంగా :
రాత్రిపూట ఆలస్యంగా తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు దెబ్బతిని, షుగర్ లేని వారికి టైప్ 2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం పొంచి ఉందట. ఆల్రెడీ ఉన్నవారికి మరింతగా పెరిగిపోయే ఛాన్స్ ఉందట. అందుకే రాత్రి పడుకోవడానికి 2-3 గంటల ముందు భోజనం చేయడం మంచిదని సూచిస్తున్నారు.