Nutritional Deficiency Diseases:శరీరం ఫిట్‌గా, ఆరోగ్యంగా ఉండాలంటే పౌష్టికాహారం తప్పనిసరి. అందుకు సరైన జీవనశైలితో పాటు విటమిన్లు, ఖనిజాల వంటి పోషక విలువలతో కూడిన ఆహారం తీసుకోవడం ఎంతో ముఖ్యం. పోషకాలు లేని ఆహారం వల్ల అనేక వ్యాధులు వచ్చే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అంతేకాకుండా సమతుల ఆహార లోపంతో అనారోగ్యానికి గురై మరణాలు సంభవించిన సంఘటనలు అనేకం ఉన్నాయంటున్నారు. కాబట్టి వీటన్నింటిని దృష్టిలో పెట్టుకుని పోషకాలు కలిగిన ఆహారం తీసుకోవడం ముఖ్యమని సూచిస్తున్నారు. మరి ఆరోగ్యంగా ఉండాలంటే ఎలాంటి డైట్ తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
జుట్టు రాలడం:ఐరన్, జింక్, లినోలెయిక్ యాసిడ్, విటమిన్ బి3 లోపం వల్ల జుట్టు రాలుతుందని(National Library of Medicine రిపోర్ట్)వైద్యులు చెబుతున్నారు. ముఖ్యంగా ఐరన్ లోపం వల్ల హిమోగ్లోబిన్ ఉత్పత్తిపై ప్రభావం పడి.. ఫలితంగా ఆక్సిజన్ అందక జుట్టు రాలుతుందని వివరిస్తున్నారు. ఈ సమస్య పరిష్కారానికి ఆకుకూరలు, బీన్స్ లాంటి ఐరన్ ఎక్కువ ఉండే ఆహారం తీసుకోవాలని సూచిస్తున్నారు.
రేచీకటి:విటమిన్ ఎ లోపం వల్ల రాత్రి పూట చూపు మందగించి రేచీకటి వచ్చే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. దీంతో పాటు బిటాట్ స్పాట్స్ పెరిగి.. కళ్లపైన తెలుపు వచ్చే ఛాన్స్ ఉందని వైద్యులు చెబుతున్నారు. అదే కాకుండా రోగ నిరోధక శక్తి పెరుగుదలతో పాటు మెరుగైన కంటిచూపు, చర్మం ఉండేలా విటమిన్ ఏ సహాయ పడుతుందని అంటున్నారు. విటమిన్ ఏ కోసం పాల ఉత్పత్తులు, క్యారెట్, బంగాళదుంపలు, నారింజ పండ్లు తినాలని సూచిస్తున్నారు.
2020లో Journal of Clinical and Experimental Ophthalmologyలో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం విటమిన్ ఎ లోపిస్తే రేచీకటి సమస్య ఎదురవుతుందని.. రెటీనా రోడాప్సిన్‌ను పునరుత్పత్తి చేయలేకపోవడమే దీనికి కారణమని కనుగొన్నారు. ఈ పరిశోధనలో AIIMSలోని ఆప్తమాలజీ డిపార్ట్మెంట్లో ప్రొఫెసర్ డాక్టర్ సంజయ్ కుమార్ షా పాల్గొన్నారు.
నోటి పూత:విటమిన్ బి2, ఐరన్ లోపం వల్ల నోటి పూత వచ్చే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. ఇందుకోసం పాలు, మాంసం, చేపలు, తృణధాన్యాలను అధికంగా తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
చిగుళ్ల నుంచి రక్తం:విటమిన్ సి లోపించడం వల్ల రోగనిరోధక శక్తి తగ్గుతుందని, చిగుళ్ల నుంచి రక్తస్రావం జరుగుతుందని వైద్యులు చెబుతున్నారు. ఈ సమస్య రాకుండా ఉండేందుకు స్ట్రాబెర్రీ, బ్రోకలీ, సిట్రస్ జాతి పండ్లు తీసుకోవాలని సూచిస్తున్నారు.