Healthy Diet Plan For Night Shift Employees : నేటి టెక్నాలజీ యుగంలో అన్ని రంగాల ఉద్యోగాల్లో నైట్ షిఫ్ట్‌లు అనేవి కామన్ అయిపోయాయి. అయితే.. రాత్రివేళల్లో పనిచేసే చాలా మంది ఉద్యోగులకు కొన్ని ఇబ్బందులు తప్పడం లేదు. పగటి సమయంలో ఎక్కువసేపు నిద్రపోవడం వల్ల వారి దినచర్యే మారిపోతోంది. ఇలాంటివారు అనివార్యంగానో, అలవాటుగానో రాత్రి వేళల్లో ఆహార పదార్థాలు, చిరుతిళ్లు తింటుంటారు. కాలక్రమంలో వీరు ఊబకాయం, మధుమేహం, బీపీ, గుండె సంబంధిత వ్యాధుల బారిన పడుతున్నారు. అలాకాకుండా ఉండాలంటే నైట్ షిఫ్ట్ ఉద్యోగాలు చేసేవారు తమ ఆహారపు అలవాట్లు, జీవనశైలిలో కొన్ని మార్పులు చేసుకోవాలంటున్నారు నిపుణులు. ఇంతకీ, నైట్ షిఫ్ట్(Night Shift)ఉద్యోగాలు చేసేవారు ఎలాంటి ఆహారం తీసుకోవాలి? తమ లైఫ్ స్టైల్లో ఎలాంటి మార్పులు చేసుకోవాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
నైట్ షిఫ్ట్‌కు వెళ్లే చాలా మంది ఉద్యోగులు చేసే పొరపాటు ఏంటంటే.. టైమ్ లేదనో ఇంకేదైనా కారణం చేతనో ఇంటి వద్ద తినకుండా వెళ్లి పనిప్రదేశంలో రాత్రివేళ తింటుంటారు. అది సరికాదని చెబుతున్నారు. నైట్ షిఫ్ట్ ఉన్నవారు ఉద్యోగానికి వెళ్లడానికే ముందే ఫ్యామిలీతో కలిసి కాస్త ముందుగానే భోజనం చేసేలా ప్లాన్ చేసుకోవాలంటున్నారు నిపుణులు. అందులోనూ తక్కువ మోతాదులో సంతృప్త కొవ్వులు ఉండే చికెన్, చేపలు వంటి వాటితోపాటు ఆరోగ్యకరమైన కార్బోహైడ్రేట్లు కలిగిన బ్రౌన్‌రైస్ లేదా మిల్లెట్లను కలిపి తీసుకునేలా చూసుకోవాలని చెబుతున్నారు.
అదేవిధంగా ఎక్కువ మొత్తంలో పండ్లు, తాజా కూరగాయల్ని తమ డైట్లో భాగం చేసుకోవాలని సూచిస్తున్నారు. ఫలితంగా శరీరానికి కావాల్సిన పోషకాలు అంది ఎక్కువ ఉత్సాహంగా ఉంటారంటున్నారు. ముఖ్యంగా రోజులో మొత్తం ఎన్ని క్యాలరీలు తీసుకుంటున్నామన్నది సరి చూసుకుంటూ కొద్ది కొద్ది మొత్తాల్లో ఎక్కువ టైమ్స్ తినడం కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందంటున్నారు.
నైట్ షిఫ్ట్ చేసే కొంతమంది ఉద్యోగులు బ్రేక్‌ఫాస్ట్‌ను స్కిప్ చేస్తుంటారు. కానీ, అలా చేయడం మంచిది కాదంటున్నారు నిపుణులు. అంతేకాదు.. మార్నింగ్ తీసుకునే బ్రేక్‌ఫాస్ట్‌లో కార్బోహైడ్రేట్లు తక్కువగా, ప్రొటీన్ కంటెంట్ ఎక్కువగా ఉండేలా చూసుకోవాలని చెబుతున్నారు పోషకాహార నిపుణురాలు డాక్టర్ జానకీ శ్రీనాథ్. అందుకోసం.. మిల్లెట్ ఇడ్లీ, దోశ, పెసరట్టు, పల్లీ చట్నీ, సాంబార్ వంటివి తీసుకోవచ్చంటున్నారు. అదే.. నాన్‌వెజ్ తినేవారు అయితే ఉడకబెట్టిన గుడ్డు, చికెన్ సూప్ లాంటివి తీసుకోవచ్చని చెబుతున్నారు. బొబ్బర్లు, పెసలు, శనగలు వంటి వాటితో సలాడ్స్ చేసుకుని తినొచ్చంటున్నారు. అయితే, ఏవైనా పడుకోవడానికి గంట ముందు తినాలనే విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలంటున్నారు నిపుణులు.
2019లో' అమెరికన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్'లో ప్రచురితమైన నివేదిక ప్రకారం.. నైట్ షిఫ్ట్ చేసే వ్యక్తులు బ్రేక్‌ఫాస్ట్ స్కిప్ చేసే అవకాశం ఎక్కువగా ఉందని, అది వారిలో టైప్ 2 డయాబెటిస్‌ను అభివృద్ధి చేసే ప్రమాదం 28% ఎక్కువగా ఉందని కనుగొన్నారు.