Never Store Watermelon In Fridge :ఎండాకాలం వచ్చేసింది. ఉదయం ఎనిమిది గంటల నుంచే సూర్యుడి భగభగలు కొనసాగుతున్నాయి. దీంతో ప్రజలు బయటకు రావాలంటేనే ఎంతో భయపడిపోతున్నారు. అయితే, తప్పనిసరి పరిస్థితుల్లో బయటకు వచ్చిన వారు ఎండ వేడి నుంచి ఉపశమనం పొందడానికి కొబ్బరి నీళ్లు, పుచ్చకాయ ముక్కలు, చెరుకు రసం తీసుకుంటున్నారు. అలాగే ఇంట్లో ఉన్న వారు కూడా బాడీని హైడ్రేట్‌గా ఉంచుకోవడానికి తరచూ పుచ్చకాయలనుతింటున్నారు. పిల్లల నుంచి పెద్దల వరకూ అందరూ పుచ్చకాయలను ఎంతో ఇష్టంగా తింటారు. అయితే, కొంతమంది పుచ్చకాయను కొనుగోలు చేసిన తర్వాత దానిని ఫ్రిజ్‌లో పెడుతుంటారు. అయితే, ఇలా అస్సలు చేయకూడదని నిపుణులంటున్నారు. అసలు పుచ్చకాయను ఫ్రిజ్‌లో ఎందుకుపెట్టకూడదో మీకు తెలుసా ? ఇప్పుడు తెలుసుకుందాం.
సమ్మర్‌లో పుచ్చకాయ తినడం వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. రోజూ వీటిని తినడం వల్ల శరీరం చల్లబడుతుందని తెలియజేస్తున్నారు. పుచ్చకాయలో92 శాతం నీరు ఉంటుందట. దీనివల్ల చెమట ద్వారా శరీరం కోల్పోయిన నీటిని పుచ్చకాయ తినడం వల్ల పొందవచ్చు. అలాగే పుచ్చకాయ తినడం వల్ల తొందరగా ఆకలి కాకుండా ఉంటుందని పేర్కొన్నారు.
పోషకాలు పుష్కలం :
పుచ్చకాయలో లైకోపీన్, యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ ఎ, విటమిన్ సి, పొటాషియం, అమైనో యాసిడ్స్ వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి బరువు తగ్గేలా చేస్తాయని నిపుణులంటున్నారు. అలాగే ఇందులో క్యాలరీలు కూడా చాలా తక్కువగా ఉంటాయట. పుచ్చకాయలో సిట్రులిన్ అనే ముఖ్యమైన అమైనో ఆమ్లం ఉంటుంది. ఇది నైట్రిక్ ఆక్సైడ్ ఉత్పత్తికి సహాయపడుతుంది. దీనివల్ల రక్తపోటు నియంత్రణలో ఉంటుందట.