తెలంగాణ

telangana

ETV Bharat / health

ఏ వయసులో టెస్టులు చేయించుకుంటే రాబోయే రోగాలను కనిపెట్టవచ్చో తెలుసా? - DR DEVI SHETTY ON PUBLIC HEALTH

రాబోవు జబ్బుల్ని ముందే గుర్తించినట్లయితే నివారణ సులువే - ఆసుపత్రుల ఆధ్వర్యంలో బీమా - నారాయణ హెల్త్​ ఛైర్మన్ డాక్టర్​ దేవిశెట్టి ఇంటర్వ్యూ

Dr Devi Shetty On Public Health
Dr Devi Shetty On Public Health (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Oct 18, 2024, 9:54 PM IST

Famous Doctor Devishetty On Youth Fitness : మీరు యువతా? ఫిట్‌గా ఉన్నారా? లేక ఉన్నారని భావిస్తున్నారా? ఏదో కొద్దిదూరం అలసట లేకుండా పరుగెత్తగలను కాబట్టి ఫిట్‌గా ఉన్నానని అనుకుంటే పొరపాటేనంటున్నారు ప్రఖ్యాత కార్డియో థొరాసిక్‌ సర్జన్, నారాయణ హెల్త్‌ ఆసుపత్రుల ఛైర్మన్‌ డాక్టర్‌ దేవి ప్రసాద్‌ శెట్టి. 18 ఏళ్ల వయసులోనే మెడికల్​ చెకప్​లు చేయించుకోవాలని తద్వారా రాబోయే జబ్బులను ముందే గుర్తించి నివారణ చర్యలు తీసుకోవచ్చని ఆయన సూచిస్తున్నారు.

యువతకు తమకు సంబంధించిన హెల్త్‌ నంబర్స్‌ (ఆరోగ్యపరమైన పరామితులు) తెలిసి ఉండాలని ఆయన చెబుతున్నారు. ప్రైవేటు హాస్పిటల్స్​ ఎవరికి వారు సొంతంగా వైద్యబీమా పాలసీలను తీసుకొస్తే అటు ఆసుపత్రులకు, ఇటు రోగులకు ఉభయతారకంగా ఉంటుందని ఆయన విశ్లేషించారు. దేశంలోనే మొదటిసారిగా నారాయణ హెల్త్‌ హాస్పిటల్స్​ ప్రారంభించిన ఆరోగ్యబీమాతో ఓ వినూత్న విధానానికి శ్రీకారం చుట్టామని తెలిపారు.

యువత గుండె పోటుతో మరణిస్తున్నారనేది అపోహ మాత్రమే : 'అన్ని ప్రైవేటు హాస్పిటల్స్​ దీన్ని అమలులోకి తెస్తే వైద్యరంగ స్వరూప స్వభావాలే మారిపోనున్నాయని డాక్టర్‌ దేవిశెట్టి అంచనా వేశారు. కొవిడ్‌ తర్వాత యువత హార్ట్​ అటాక్​లతో మరణిస్తున్నారన్నది అపోహేనని, వైద్యపరీక్షలు చేయించుకునే వారు పెరగడంతో గుండె జబ్బులున్నవారి సంఖ్య కూడా ఎక్కువగా కనిపిస్తోందని' డాక్టర్​ దేవి ప్రసాద్​ శెట్టి వివరించారు. ఈ సందర్భంగా ఆయన ఆరోగ్యరంగానికి సంబంధించిన పలు కీలక అంశాలను ఇంటర్వ్యూలో వెల్లడించారు.

ట్రెడ్‌మిల్‌ టెస్ట్‌లో పాజిటివ్‌ వచ్చిందంటే?

జవాబు :గుండె రక్తనాళాల్లో బ్లాక్‌లు 70 శాతం ఉన్నట్లే! ఒకవేళ ముందస్తు పరీక్షల ద్వారా 5 శాతం బ్లాక్‌ ఉన్నప్పుడే గుర్తిస్తే చికిత్స చేయడం సులభమవుతుంది. లేదంటే అది ముదిరి, ప్రాణాపాయం సంభవిస్తుంచే అవకాశం ఉంది. అందుకే ముందస్తు పరీక్షలు చేసుకోవడం మేలు.

చిన్నారుల గుండె శస్త్రచికిత్స నిపుణులుగా మీరు ఆ రంగంలో విశేష సేవలందిస్తున్నారు. దేశంలో చిన్న పిల్లల గుండె చికిత్సలకు అవసరమైన మేర వైద్య సదుపాయాలున్నాయా?
జవాబు : భారత్​లో ఏటా 2.4 కోట్ల మంది శిశువులు జన్మిస్తున్నారు. వీరిలో ప్రతి 140 మందిలో ఒకరు గుండెసంబంధిత జబ్బులతో బాధపడుతున్నారు. వేలమంది చిన్నారులకు గుండె చికిత్సలనేవి అవసరమవుతున్నాయి. గుండెజబ్బులకు సంబంధించిన ఆసుపత్రులు, డాక్టర్ల సంఖ్య పెరగాలి. మాతో సహా దేశంలో కొద్ది నగరాల్లో మాత్రమే చిన్న పిల్లల గుండె శస్త్రచికిత్సలు చేయగలిగే పరిస్థితులున్నాయి. దీంతో బాధితులు చికిత్స కోసం తమ సొంత రాష్ట్రం నుంచి మరో ప్రాంతానికి వెళ్లాల్సి వస్తోంది. ఇలాంటి హాస్పిటల్స్​ సంఖ్య అన్ని నగరాలకూ విస్తరించాలి. ఏటా పిల్లలు, పెద్దల్లో కలిపి 10 లక్షల శస్త్రచికిత్సలు చేయాల్సి ఉండగా, 1.5-2 లక్షల వరకు మాత్రమే చేయగల్గుతున్నాం.

ప్రభుత్వ రంగంలో మెరుగైన వైద్యసేవలు అందించలేకపోవడానికి కారణాలు ఏంటి?
జవాబు :ప్రజల నుంచి వసూలు చేసే పన్నుల నుంచి ప్రజారోగ్య రంగానికి కొంత కేటాయించి, అందరికీ ఉచితంగా నాణ్యమైన వైద్యం అందించాలన్నది లక్ష్యం. అనేక దేశాలు ఇదే విధంగా చెబుతున్నాయి. కానీ ఆచరణలోనే అసలు సమస్య. ప్రపంచంలో వేలు, లక్షల జనాభా కలిగిన కొన్ని దేశాలు మాత్రమే ఈ సదుపాయాన్ని ప్రజలకు ఇవ్వగలుగుతున్నాయి. జనాభా 2, 3 కోట్లు దాటితే అమలు కష్టసాధ్యమే. ఇంగ్లండ్‌ ఫ్రీ హెల్త్‌కేర్‌ ఇస్తున్నప్పటికీ ఇప్పుడు ఇబ్బంది పడుతోంది. ధనిక దేశమైన అమెరికాయే ఫ్రీగా వైద్యం అందించలేకపోతోంది.

భారత్​లో అయితే అది సాధ్యమే కాదు. కొన్ని దేశాలకు జీడీపీలో 25 నుంచి 40 శాతం మేర ట్యాక్స్​ వసూళ్లు ఉంటాయి. మన దేశంలో అది 11.5 శాతం మాత్రమే. మన ప్రభుత్వం వద్ద అందుబాటులో ఉండే నిధులతో అమలు చేసే పరిస్థితి లేదు. అనేక దేశాలు జీడీపీలో 10 నుంచి 18 శాతం వరకు హెల్త్​ సెక్టార్​కు కేటాయిస్తున్నాయి. భారత్‌లో ఇది రెండు శాతానికి మించడంలేదు.

ప్రభుత్వరంగంలో పూర్తిస్థాయిలో వైద్యం అందట్లేదు. ప్రైవేటు రంగంలో ఖర్చును మధ్యతరగతి ప్రజలు కూడా భరించలేకపోతున్నారు. దీనికి ప్రత్యామ్నాయం ఏమిటి ?
జవాబు : ఇందుకు ప్రత్యామ్నాయాలున్నాయి. భారత్​ జనాభా 140 కోట్లు. అత్యధిక జనాభా ఉన్నప్పుడు హెల్త్​ ఇన్సూరెన్స్​ పనిచేస్తుంది. మన దేశ ప్రజలు వైద్య చికిత్సను భరించలేకున్నప్పటికీ బీమాకు ఖర్చు చేయగలరు. తక్కువ ఖర్చుతో ఆరోగ్యబీమాను అందించడం, అన్ని రకాల సర్జరీలకు అవకాశం ఉండడంతోపాటు, మెడికల్‌ ట్రీట్‌మెంట్‌ ఉండేలా, ప్రీమియం భరించగలిగేలా ఉంటే హెల్త్​కేర్​ సెక్టార్​లో సమూల మార్పులొస్తాయి.

నారాయణ హృదయాలయ ఆరోగ్యబీమాను ప్రారంభించింది కదా, అది ఏవిధంగా ఉండబోతోంది?
జవాబు :దేశంలో ఆరోగ్య బీమా కంపెనీ ప్రారంభించడానికి అనుమతి పొందిన తొలి ఆసుపత్రి మాది. దేశవ్యాప్తంగా హార్ట్​ సర్జరీల్లో 16 శాతం మా హాస్పిటల్స్​లోనే జరుగుతున్నాయి. మా ఆరోగ్య బీమా అనేది కుటుంబంలో నలుగురికి వర్తిస్తుంది. అంటే భార్యాభర్తలు, వారి ఇద్దరు పిల్లలకు అన్ని రకాల శస్త్రచికిత్సలకు కోటి రూపాయల వరకు ఇతర వైద్య చికిత్సలకు రూ.5 లక్షల వరకు బీమా వర్తిస్తుంది. ప్రీమియం ఏడాదికి రూ.10 వేలు. ఎంత ఎక్కువమంది హాస్పిటల్‌ బీమా పాలసీలో చేరితే కొంత కాలానికి ప్రీమియం కూడా అంతగా తగ్గేందుకు అవకాశం ఏర్పడుతుంది. దేశంలో ఈ తరహా ఆసుపత్రి ఆరోగ్య బీమా తేవడం ఇదే తొలిసారి. ఈ విధానాన్ని అన్ని హాస్పిటల్స్​ అనుసరిస్తే రోగులకు వైద్యఖర్చులు తగ్గుతుంది.

కొవిడ్‌ తర్వాత యువతలో గుండెపోటు మరణాలు ఎక్కువయ్యాయన్నది ఎంతవరకు నిజం
జవాబు :యువతలో హార్ట్​ అటాక్ మరణాలకు చాలామంది కొవిడ్‌ను, వ్యాక్సిన్లను కారణంగా ఆపాదిస్తున్నారు. కానీ వ్యాక్సిన్​లు కారణం కాదనేది నా బలమైన విశ్వాసం. వాటిని తప్పు పట్టడం సరైంది కాదు. మేం పెద్దసంఖ్యలో గుండెజబ్బు బాధితులను చూస్తుంటాం. కొవిడ్‌ తర్వాత ఆరోగ్యంపై అవగాహన, పరీక్షలు చేయించుకోవడం పెరిగింది. ఎప్పుడూ ఈసీజీ, 2డీ ఎకో పరీక్షలు చేయించుకోని అనేకమంది కొవిడ్‌ తర్వాత ఆ పరీక్షలను చేయించుకుంటున్నారు. ఇలా పరీక్షలు చేయించుకునేవారి సంఖ్య పెరగడం వల్ల గుండె జబ్బులు బయటపడడమూ ఎక్కువైంది.

భారత్‌దేశంలో కొత్తగా ఎదురవుతున్న ఆరోగ్య సమస్యలు, పరిష్కారాలు ఏంటి?
జవాబు :ఆరోగ్య సంరక్షణపై ఇటీవలే ‘కార్డియాలజీ సొసైటీ ఆఫ్‌ ఇండియా’కొన్ని మార్గదర్శకాలు విడుదల చేసింది. ఇందులో ప్రధానమైంది మన దేశంలో 18 ఏళ్ల వయసులో ఉన్న ప్రతి ఒక్కరూ ‘లిపిడ్‌ ప్రొఫైల్‌’ పరీక్ష చేయించుకోవాలని. దీనివల్ల రక్తంలో కొలెస్ట్రాల్‌ ఎంత ఉందనేది తెలుస్తుంది. యువత ఆ వయసులోనే ఆరోగ్యంపై తప్పనిసరిగా అవగాహన పెంచుకోవాలి. వారికి తమ హెల్త్‌ నంబర్లు మస్ట్​గా తెలిసి ఉండాలి. ఆ వయసులో సాధారణంగా తాను ‘ఫిట్‌ పర్సన్‌’ అనే భావనలో చాలా మంది యువత ఉంటారు.

ఒక మైలు దూరం ఆయాసం లేకుండా పరుగెత్తాను కనుక ఫిట్‌ పర్సన్‌ అంటే కుదరదు. ఫిట్‌గా ఉన్నారో లేదో తెలుసుకునేందుకు కచ్చితంగా కొన్ని పరీక్షలు చేయించుకుంటే మంచిది. బ్లడ్​ టెస్ట్​లు, ఈసీజీ, 2డీ ఎకో కార్డియోగ్రామ్, క్యాల్షియం, బీపీ, షుగర్, కొలెస్ట్రాల్, కిడ్నీలు, కాలేయం, థైరాయిడ్‌ పనితీరు ఇలా కొన్ని ముఖ్యమైన పరీక్షలను 18 ఏళ్ల వయసులోనే చేయించాలి. కానీ ఆరోగ్య సమస్యలేవీ లేనప్పుడు ముందస్తుగా పరీక్షలు చేయించుకోవడానికి ఎవరూ అంతగా ఆసక్తి చూపించరు.

వైద్యరంగంలో ప్రభుత్వాలు తక్షణం చేయాల్సిన మార్పులేంటి?
భారతదేశ జనాభా నిష్పత్తితో పోలిస్తే సుమారు 20 లక్షల మంది వైద్యులు తక్కువగా ఉన్నారు. దేశంలో వచ్చే ఐదేళ్లలో 75 వేల కొత్త ఎంబీబీఎస్‌ సీట్లు అందుబాటులోకి తెస్తున్నామని ప్రధాని మోదీ ప్రకటించడం విప్లవాత్మకమైన నిర్ణయమే. కానీ మొత్తం 75 వేల సీట్లూ సర్కారు ఆధ్వర్యంలోనే ఉండాలి. సీట్లతోపాటు రుసుములు కూడా పేద, మధ్యతరగతి కుటుంబాలకు అందుబాటులో ఉండాలి. 500 పడకల కంటే ఎక్కువ ఉన్న ప్రైవేటు ఆసుపత్రులకు మెడికల్​ కళాశాలలు మంజూరు చేయాలి. దీనిపై ప్రభుత్వానికి నియంత్రణ ఉండాలి. ఫీజులు, విద్యార్థుల ప్రవేశాలు ప్రభుత్వ అజమాయిషీలో ఉంటే వైద్యరంగంలో ఎన్నో మార్పులొస్తాయి.

"నేను వ్యక్తిగతంగా నమ్మేదేంటంటే సంపదకు, ఆరోగ్యానికి ఉన్న సంబంధాన్ని దూరం చేసే దేశంగా ప్రపంచంలో భారత్‌ మొదటిది అవుతుంది అని. ప్రజలకు నాణ్యమైన వైద్యం అందే రోజులు త్వరలోనే రానున్నాయి. దేశ సంపదకు, కుటుంబ సంపదకు సంబంధమే అనేది లేకుండా పోతుంది. వచ్చే 5, 10 ఏళ్లలో ఇది కచ్చితంగా జరిగి తీరుతుంది"- డాక్టర్​ దేవిశెట్టి, నారాయణ హెల్త్‌ ఆసుపత్రుల ఛైర్మన్‌

వైద్యరంగం పురోగమనంలో ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్(కృత్రిమ మేధ) పాత్ర ఎలా ఉండబోతోంది?

రోగిని వైద్యుడు పరీక్షించి, రిపోర్టులను పరిశీలించాల్సిన సందర్భాల్లో కొన్నిసార్లు 30-40 రకాల రిపోర్టులను క్రోడీకరించాల్సిన పరిస్థితి వస్తుంది. కొన్నిసార్లు సరిగ్గా క్రోడీకరించలేకపోవచ్చు. అదే కృత్రిమ మేధ 3-4 వేల రిపోర్టులను కూడా చాలా కచ్చితత్వంతో క్రోడీకరిస్తుంది. రోగ నిర్ధారణలో వైద్యుడికు కూడా సహకరిస్తుంది. రోగికి మెరుగైన చికిత్స అందించడంలో వైద్యులకు ఏఐ అనేది ఉపయోగకరంగా ఉంటుంది.

గుండె జబ్బులు నిశ్శబ్ధ సునామీగా ఎందుకు మారుతున్నాయి? - వైద్యులు ఏమంటున్నారంటే? - How To stop Heart Attacks

అలర్ట్ : షుగర్, గుండె పోటు, ఊబకాయం - ఇవి​ రావడానికి కారణం తెలిసిపోయింది! - Trans Fats Foods List

ABOUT THE AUTHOR

...view details