Liver Failure Causes in Telugu : మారుతున్న జీవన శైలి, ఆహారపు అలవాట్లతో ప్రజలు అనేక రకాల వ్యాధుల బారిన పడుతున్నారు. ఒకవైపు వృత్తిరీత్యా ఒత్తిడి పెరిగిపోతోంది. మరోవైపు శారీరక శ్రమ తగ్గుతోంది. దీంతో లేనిపోని రోగాలు వస్తున్నాయి. ముఖ్యంగా ఇటీవల కాలంలో అనేక మందిలో కాలేయ(లివర్) సంబంధ సమస్యలు పెరుగుతున్నాయి. మరి దీనికి కారణం ఏమిటి? ఈ కాలేయ సమస్యల బారిన పడకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
కాలేయ సమస్యకు కారణాలు
మన శరీరంలోని ప్రతి అవయవం ప్రత్యేక అవసరాలకు ఉపయోగపడేదే. వాటన్నింటిలోకి అతి ముఖ్యమైన ప్రక్రియను నిర్వహించే అవయవం కాలేయం. దీనికి ఏదైనా సమస్య ఏర్పడితే అది పూర్తి శరీరాన్ని, ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. మద్యపానం, ధూమపానం, ఏది పడితే అది తినడం ఇలా అనేక కారణాలు కాలేయం చెడిపోవడానికి కారణం అవుతాయి. నిజానికి కాలేయం శరీరానికి శక్తి కేంద్రంగా పని చేస్తుంది. 500 పొరలతో ఉండే కాలేయం శరీరానికి రక్షణగా నిలుస్తుంది. ఇది శరీరంలో వడపోత చేస్తుంది.
మనం ఆహారంలో లేదంటే ఇతర రూపాల్లోనూ తీసుకున్న మలినాలను, విషాన్ని కాలేయం ఫిల్టర్ చేసి శరీరానికి ఏమీ కాకుండా జాగ్రత్తపడుతుంది. అయితే ఈ వడపోతలో మరీ ఎక్కువ విషం లేదా ఇతర రసాయనాలు ఉంటే అవి కాలేయాన్ని పాడు చేస్తాయి. దీని వల్ల హెపటైటిస్, సిర్రోసిస్ అనే కాలేయ సంబంధ పరిస్థితులు ఏర్పడతాయి. పవర్ ఫిల్టర్‌గా చెప్పుకునే కాలేయం ఒక స్థాయి దాటిన తర్వాత పని చేయడం మానేస్తుంది.
లివర్ జాగ్రత్త
కాలేయం సరిగ్గా పని చేయకపోయినా అనేక సమస్యలు తలెత్తుతాయి. ముందుగా దీని ఫలితంగా కామెర్లు వస్తాయి. శరీరంలో రసాయనాల బ్యాలెన్స్ తప్పి అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. అలాగే రక్తం అవసరానికి తగినట్లు గట్టిగా లేదంటే పలుచుగా ఉండడం కూడా జరగదు. ఇది అనేక గుండె సంబంధిత సమస్యలకు దారి తీస్తుంది. ఎక్కువగా మందుల తీసుకోవడం వల్ల వచ్చే రసాయనాలు కాలేయాన్ని పాడు చేస్తాయి.