Kenneth Mitchell Death Cause : కెప్టెన్ మార్వెల్, స్టార్ ట్రెక్ సిరీస్‌లో నటించి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న హాలీవుడ్ కెనడియన్ నటుడు కెన్నెత్ మిచెల్ (Kenneth Mitchell) (49) తాజాగా కన్నుమూశారు. ఈ విషయాన్ని ఆయన కుటుంబ సభ్యులు వెల్లడించడంతో.. ఆయన అభిమానులు తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు. అయితే.. ఇంత చిన్న వయస్సులో ఆయన మృతి చెందడానికి కారణం 'అమియోట్రొఫిక్ లాటెరల్ స్క్లెరోసిస్' (ALS) అనే డిసీజ్. ఇది ఒక నరాల సంబంధిత వ్యాధి.
గతంలో ప్రపంచ ప్రఖ్యాత భౌతిక శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ కూడా ఈ వ్యాధి కారణంగానే దశాబ్ధాల తరబడి బాధపడుతూ ప్రాణాలు కోల్పోయారు. ఇప్పుడు కెన్నెత్ మిచ్లె మరణించడంతో.. సోషల్ మీడియాలో ఈ వ్యాధి గురించి చర్చ నడుస్తోంది. మరి.. ఈ వ్యాధి ఎందుకు వస్తుంది? ఈ వ్యాధి బారిన పడిన వారిలో ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
నరాల కణాలపై ప్రభావం :
అమియోట్రొఫిక్ లాటెరల్ స్క్లెరోసిస్ అనేది ఒక మోటార్ న్యూరాన్ వ్యాధి. ఈ వ్యాధిని "లౌ గెహ్రిగ్స్" వ్యాధి అని కూడా అంటారు. ఈ వ్యాధి బారిన పడిన వారిలో నరాల కణాలు ప్రభావితం అవుతాయి. క్రమంగా వ్యాధి పెరిగితే నరాల్లోని కణాలు నాశనమవుతుంటాయి. దీంతో క్రమంగా.. కాళ్లు, చేతులు వంటి అవయవాలు పని చేయకుండా పోతాయి. మొదట చిన్నచిన్న లక్షణాలతో మొదలయ్యే ఈ వ్యాధి.. క్రమంగా శరీరంలోని అవయవాలన్నింటినీ చచ్చుబడిపోయేలా చేస్తుంది. చివరికి ఈ వ్యాధి ముదిరిన తర్వాత మరణం అనివార్యమవుతుందని నిపుణులు చెబుతున్నారు.
అమియోట్రొఫిక్ లాటెరల్ స్క్లెరోసిస్ వ్యాధి లక్షణాలు ఎలా ఉంటాయి?
- కండరాలు బలహీనంగా ఉండటం
- అవయవాల మధ్య సమన్వయం లేకపోవడం
- ఆహారం మింగడం కష్టంగా ఉండటం
- సరిగ్గా మాట్లాడలేకపోవడం
- కాళ్లు, చేతుల కదలికలు సరిగ్గా లేకపోవడం
- స్వయంగా నడవలేకపోవడం
- శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా ఉండటం వంటివి ఈ వ్యాధి ప్రధాన లక్షణాలుగా ఉంటాయి.