Jaggery Health Benefits:స్వీట్లు, తీపి పదార్థాలు ఏవి తయారు చేయాలన్నా అందరూ చక్కెరనే ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. కానీ చక్కెరకు బదులుగా బెల్లం ఉపయోగించడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు. బెల్లం వల్ల రుచితో పాటు ఐరన్, మెగ్నీషియం, పోటాషియం, పాస్ఫరస్ లాంటి పోషకాలు అందుతాయని చెబుతున్నారు. 2017లో Journal of Food Science and Technologyలో ప్రచురితమైన "Nutritional and Phytochemical Analysis of Jaggery and Its Potential Health Benefits" అనే అధ్యయనంలోనూ ఈ విషయం తేలింది. చక్కెరకు బదులుగా తీసుకునే బెల్లంతో మన శరీరానికి ఎన్నో రకాలుగా మేలు జరుగుతుందని వివరిస్తున్నారు. (రిపోర్ట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
- గర్భిణులు బెల్లాన్ని తరచూ తమ ఆహారంలో తీసుకోవడం వల్ల వివిధ రకాల అనారోగ్యాలు, అలర్జీల బారిన పడకుండా కాపాడుకోవచ్చని చెబుతున్నారు. 12 వారాల పాటు రోజుకు 100 గ్రాముల బెల్లం తిన్న గర్భిణులలో హిమోగ్లోబిన్ స్థాయిలు గణనీయంగా పెరిగినట్లు 2015లో ప్రచురించిన 'జర్నల్ ఆఫ్ న్యూట్రిషన్' నివేదికలో తేలింది. రోజూ బెల్లం తినడం వల్ల కాలేయం కూడా ఆరోగ్యంగా ఉంటుందని అంటున్నారు.
- చక్కెరకు బదులుగా బెల్లాన్ని తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయులు అదుపులో ఉంటాయని నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా మధుమేహం బాధితులకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని వివరిస్తున్నారు.
- బెల్లంలో పుష్కలంగా ఉండే క్యాల్షియం ఎముకలను దృఢంగా ఉంచుతుందని నిపుణులు చెబుతున్నారు.
- ఇంకా ఇందులోని ఇనుము, ఫాస్ఫరస్ రక్తహీనత ఎదురుకాకుండా రక్షిస్తాయని వివరిస్తున్నారు. దీంతో పాటు రక్తాన్ని శుద్ధి చేసే గుణం కూడా బెల్లంలో ఉందని చెబుతున్నారు.
- ఇంకా రోజుకో చిన్న బెల్లం ముక్క తినే మహిళల్లో నెలసరి సమస్యలు చాలావరకు తగ్గుతాయని పలు అధ్యయనాలు వెల్లడిస్తున్నట్లు తెలిపారు.
- ఇందులోని యాంటీఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని పెంచుతాయని చెబుతున్నారు. బెల్లాన్ని తీసుకునే వారిలో మలబద్ధకం సమస్య ఉండదని అంటున్నారు.
- బెల్లం తింటే మెదడు చురుగ్గా పని చేస్తుందని.. కంటి చూపు మెరుగుపడుతుందని వివరిస్తున్నారు.
- బెల్లం మంచి డీటాక్సిఫికేషన్ ఏజెంట్‌గా పనిచేస్తూ.. కాలేయాన్ని శుభ్రపరుస్తుందని నిపుణులు అంటున్నారు. ఇంకా బరువు నియంత్రణలో ఉండేలా సహాయ పడుతుందని వివరిస్తున్నారు.
- మనలో చాలా మందికి అప్పుడప్పుడూ నీరసంగా అనిపిస్తుంది. అలాంటి సమయాల్లో చిన్న బెల్లం ముక్క నోట్లో వేసుకుంటే తక్షణ శక్తి లభిస్తుందని అంటున్నారు.
- ఇంకా బెల్లంతో చిక్కీలు, స్వీట్లు, ఎనర్జీ బార్స్ వంటివి తయారుచేసుకోవచ్చని చెబుతున్నారు. అలాగే పాలు, టీలలో చక్కెరకు బదులు బెల్లం వాడడం మంచిదని నిపుణులు సలహా ఇస్తున్నారు.
NOTE :ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.