Is Cinnamon Good for Diabetic Patients: ప్రస్తుత రోజుల్లో షుగర్ బాధితుల సంఖ్య క్రమక్రమంగా పెరుగుతోంది. ఒక్కసారి డయాబెటిస్ ఎటాక్ అయ్యిందా.. జీవిత కాలం మందులు వాడాల్సిందే. తినే తిండిని కూడా మార్చుకోవాలి. దీర్ఘకాలంలో అనేక వ్యాధులకు దారి తీస్తుంది. అయితే.. డయాబెటిస్తో బాధపడే వారు దాల్చిన చెక్కను వాడితే ప్రయోజనం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. మరి.. దాల్చిన చెక్కకు, షుగర్‌కు ఉన్న సంబంధం ఏంటి? దాల్చిన చెక్క వల్ల షుగర్ నిజంగానే అదుపులో ఉంటుందా? అన్న విషయాన్ని ఈ స్టోరీలో తెలుసుకుందాం.
షుగర్‌తో బాధపడుతున్నవారు దాల్చిన చెక్క ఉపయోగించడం వల్ల మంచి ఫలితం ఉంటుందని.. షుగర్ లెవల్స్ కంట్రోల్లో ఉంటాయని నిపుణులు అంటున్నారు. ఎందుకంటే మధుమేహం ఉన్నవారిలో.. వారి ప్యాంక్రియాస్ తగినంత ఇన్సులిన్ ఉత్పత్తి చేయదు. ఇది రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడానికి దారితీస్తుందని అంటున్నారు. ఈ క్రమంలో దాల్చిన చెక్కలో ఉండే సహజ ఇన్సులిన్ రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో సహాయ పడుతుందని వాల్డెన్ విశ్వవిద్యాలయం అండ్ లూసియానా విశ్వవిద్యాలయంలో ఫ్యాకల్టీ మెంబర్ డాక్టర్ సింథియా కాబ్ చెబుతున్నారు. ఈ విషయం హెల్త్‌లైన్ వెబ్సైట్లో ప్రచురితమైంది(రిపోర్ట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి).
మరో అధ్యయనంలో: టైప్ 2 డయాబెటిస్ రోగుల్లో రక్తంలో చక్కెర స్థాయిల నియంత్రణకు దాల్చిన చెక్క బాగా ఉపయోగపడుతుందని కాలిఫోర్నియా శాస్త్రవేత్తల పరిశోధనల్లో వెల్లడైంది. ఇందులో భాగంగా 543 మంది టైప్ 2 డయాబెటిస్ పేషెంట్స్‌లో కొంతమందికి దాల్చిన చెక్కను, రోజుకు 120 మిల్లీ గ్రాముల నుంచి 6 గ్రాముల వరకు మాత్రలు ఇచ్చారు. మరికొంతమందికి మామూలు మాత్రలు ఇచ్చారు. తర్వాత వీరిని పరిశీలించగా.. దాల్చిన చెక్క మాత్రలను తీసుకున్నవారి రక్తంలో చక్కర స్థాయులు మిగతా వారికంటే మెరుగ్గా నియంత్రణలో ఉన్నట్లు తేలింది. ఇన్సులిన్ హార్మోన్ విడుదల, పనితీరును దాల్చిన చెక్క ప్రభావితం చేయడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు మెరుగుపడినట్లు గుర్తించారు. దాల్చిన చెక్కను 1/4 టీ స్పూన్ ప్రతిరోజూ తీసుకుంటే డయాబెటిస్ అదుపులోకి వస్తున్నట్లు అనేక పరిశోధనల్లో తేలింది.