Irritable Bowel Syndrome Symptoms :ఈరోజుల్లో గజిబిజి జీవన విధానం, గతి తప్పిన ఆహారపు అలవాట్లు, నిద్రలేమి, ఒత్తిడి కారణంగా.. పొట్టను వ్యాధుల పుట్టగా మారుస్తున్నాం. అడ్డు అదుపు లేకుండా తినడం కారణంగా వయసుతో సంబంధం లేకుండా జీర్ణ సమస్యలతో పాటు వివిధ ఆరోగ్య సమస్యల బారిన పడుతున్నాం. అందులో ఒకటి.. ఇర్రిటెబుల్ బవెల్ సిండ్రోమ్(Irritable Bowel Syndrome). అసలేంటి ఈ సిండ్రోమ్? లక్షణాలు, కారణాలేంటి? చికిత్స విధానమేంటి? అనే వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం..
ఇర్రిటెబుల్ బవెల్ సిండ్రోమ్ అంటే.. పెద్ద పేగులను ప్రభావితం చేసే సాధారణ జీర్ణశయాంతర రుగ్మత. ఇది ఒక దీర్ఘకాల సమస్య. 50 ఏళ్లలోపు వ్యక్తులలో IBS తరచుగా సంభవిస్తుంది. దీని బారిన పడితే కడుపుబ్బరం, గ్యాస్, కడుపునొప్పి, విరేచనాలు, మలబద్ధకం, శ్లేష్మంతో మలం, అజీర్ణం, కడుపు నిండిన భావన వంటి లక్షణాలు కనిపిస్తుంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఎన్ని పరీక్షలు చేసినా సాధారణంగానే ఉంటుంది. కానీ, ఇబ్బందులు తొలగిపోవు. ఆ టైమ్లో మీరు చేయాల్సిందల్లా పొట్ట, పేగులను పూర్తిగా అర్థం చేసుకోవడమే అంటున్నారు నిపుణులు. అప్పుడు తగిన చికిత్స తీసుకుంటే కొంతమేర దీని నుంచి ఉపశమనం పొందే అవకాశం ఉందంటున్నారు.
ఐబీఎస్ తలెత్తడానికి కారణాలు :ఇర్రిటెబుల్ బవెల్ సిండ్రోమ్ రావడానికి సరిగ్గా కారణమేమిటో ఇప్పటికీ తెలియదు. కానీ, అనేక అంశాలు ఇది రావడానికి దోహదపడతాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. వాటిలో కొన్నింటిని ఇప్పుడు చూద్దాం..
పేగులలో కండరాల సంకోచాలు :పేగుల గోడలు సాధారణంగా కండరాల పొరలతో కప్పబడి ఉంటాయి. అవి మనం జీర్ణాశయం ద్వారా ఆహారాన్ని పంపినప్పుడు సంకోచం చెందుతాయి. అయితే ఐబీఎస్ అనేది బలమైన, దీర్ఘకాలిక సంకోచాలను ప్రదర్శిస్తుంది. ఇది గ్యాస్, ఉబ్బరం, విరేచనాలకు కారణమవుతుంది. అలాగే బలహీనమైన సంకోచాలను కలిగిస్తుంది. అప్పుడు జీర్ణక్రియ పనితీరు నెమ్మదిస్తుంది.
తీవ్రమైన ఇన్ఫెక్షన్ : గ్యాస్ట్రోఎంటెరిటిస్ అని పిలిచే బాక్టీరియా లేదా వైరస్ వల్ల తీవ్రమైన విరేచనాలు సంభవిస్తాయి. ఆ తర్వాత IBS అభివృద్ధి చెందే అవకాశం ఉందంటున్నారు నిపుణులు. అంటే బ్యాక్టీరియా పెరుగుదలతో కూడా IBS సంబంధం కలిగి ఉండవచ్చంటున్నారు.