Is Inguva Good for Health:చాలా ఇళ్లలో ఇంగువను రోజువారీ వంటకాల్లో వినియోగిస్తుంటారు. చిటికెడు ఇంగువను వంటకాల్లో వేస్తే రుచి పెరగడంతో పాటు ఆ సువాసన తినాలన్న కోరికను పెంచుతుంది. అయితే, ఇంగువతో కేవలం రుచి, వాసన కాకుండా అనేక ఆరోగ్య ప్రయోజనాలూ ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
అరుగుదలను పెంచుతుంది:రోజువారీ వంటకాల్లో ఇంగువను చేర్చడం వల్ల జీర్ణ ప్రక్రియ మెరుగుపడుతుందని నిపుణులు చెబుతున్నారు. 2011లో Journal of Ethnopharmacologyలో ప్రచురితమైన "Evaluation of the efficacy and safety of Ferula asafoetida in patients with irritable bowel syndrome" అనే అధ్యయనంలోనూ ఈ విషయం తేలింది. ముఖ్యంగా ఇందులో సహజంగానే ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీస్పాస్మోడిక్, యాంటీ ఫ్లాట్యులెంట్ గుణాలు ఇందుకు సాయపడతాయని వివరిస్తున్నారు. ఇంకా కడుపుబ్బరం, గ్యాస్, అజీర్తి వంటివాటికి పరిష్కారం చూపిస్తుందని అంటున్నారు. (రిపోర్ట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
పీరియడ్స్ నొప్పులకు రిలీఫ్: పీరియడ్స్ సమయంలో అసౌకర్యం, ఒళ్లు నొప్పులు వంటి ఇబ్బందులెన్నో ఎదుర్కొంటారు. అయితే, వీటిని తగ్గించుకునేందుకు అనేక పెయిన్ కిల్లర్స్ వాడుతుంటారు. అయితే, ఈ నొప్పుల నుంచి ఉపశమనం పొందండంలోనూ ఇంగువ సహాయ పడుతుందని చెబుతున్నారు. నెలసరిని క్రమం తప్పకుండా చేసి నొప్పిని అదుపు చేస్తుందని పేర్కొన్నారు. దీంతో పాటు మహిళల్లో ప్రొజెస్టెరాన్ హార్మోన్‌ను ఉత్పత్తి చేసి ప్రసవ సమయంలో అధిక రక్తస్రావం కాకుండా తగ్గిస్తుందని అంటున్నారు. పైగా నేచురల్ బ్లడ్ థిన్నర్‌లానూ పనిచేసి, రక్తప్రసరణ సక్రమంగా జరిగేలా చూస్తుందని వివరిస్తున్నారు.
హార్మోన్ల సమతౌల్యత - సంతాన సామర్థ్యం:మన శరీరంలో తలెత్తే హార్మోన్ల హెచ్చుతగ్గులను ఇంగువ సమం చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా మహిళల్లో సంతాన సామర్థ్యాన్ని పెంచుతుందని.. అంతేకాకుండా.. ప్రసవానంతరం శారీరకంగా దృఢంగా ఉంచేలా చేస్తుందని వివరిస్తున్నారు. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలోని టాక్సిన్లను బయటకు పంపిస్తాయని అంటున్నారు.