How To Stop Stomach Pain : కడుపు నొప్పి సమస్యకు వయసుతో సంబంధం లేదు. చిన్నాపెద్ద అనే తేడా లేకుండా కడుపునొప్పి ఎవరికైనా రావచ్చు. అయితే కడుపునొప్పి రావడానికి అనేక కారణాలు ఉండవచ్చని చీఫ్ క్లీనికల్ న్యూట్రిషనిస్ట్ మధులిక ఆరుట్ల చెబుతున్నారు. 'చాలామంది సమయానికి ఆహారం తీసుకోకపోవడం వల్ల గ్యాస్ సమస్య తలెత్తుతుంది. ఇది తీవ్రమైనప్పుడు కడుపునొప్పిగా మారే అవకాశాలు ఉంటాయి. మరికొంతమంది ఒత్తిడికి లోనైనప్పుడు కూడా కడుపునొప్పికి గురికావచ్చు. కొన్నిసార్లు రుతుస్రావం సమయంలో కూడా కడుపునొప్పి వచ్చే అవకాశాలు ఉంటాయి. కడుపునొప్పిని ప్రేరేపించే కొన్ని ఆహారాల నుంచి దూరంగా ఉండాలి.' అని డా.మధులిక ఆరుట్ల వివరిస్తున్నారు.
ఈ ఆహార పదార్థాలు తక్కువగా తీసుకోండి
Stomach Pain Foods To Avoid : తరుచూ కడుపునొప్పితో బాధపడే వారు పాలను తీసుకోవడం తగ్గించుకోవాలి. పాలలోని ల్యాక్టోజ్ అనే ప్రోటీన్ వల్ల కడుపునొప్పి వచ్చే అవకాశాలు పెరుగుతాయి. అలాగే పప్పులు, శనగలను కూడా తగ్గించుకోవడం మంచిదని చీఫ్ క్లీనికల్ న్యూట్రిషనిస్ట్ మధులిక చెబుతున్నారు.
రుతుస్రావం సమయంలో
రుతుస్రావం సమయంలో కూడా కడుపునొప్పి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చెబుతున్నారు. అయితే చాలామంది రుతుస్రావం జరిగే సమయంలో కడుపునొప్పి నుంచి ఉపశమనం కోసం ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారాలను తీసుకోవాలని సూచిస్తున్నారు. అతిగా ఫైబర్ తీసుకున్నా కొన్నిసార్లు కడుపు నొప్పి మరింత తీవ్రమయ్యే అవకాశాలు ఉంటాయి.
కడుపు నొప్పి నుంచి ఉపశమనానికి వైద్యుల సూచనలు ఇవే!
కడుపు నొప్పి వేధిస్తున్నప్పుడు నీళ్లను తీసుకోవడం ఉత్తమం. అయితే ఒకేసారి కాకుండా ఒక క్రమపద్ధతిలో కొద్ది పరిమాణంలో నీటిని తీసుకోవడం ఉత్తమం. నీటిలో కాస్త జీలకర్రను కలుపుకొని తాగితే మంచిది. లేకపోతే జీలకర్ర పొడిని కలుపుకొని తాగినా కడుపు నొప్పి తగ్గుతుంది. నీటిలో సోంప్ కలిపి తాగినా లేదా సోంప్ నీటిని తాగినా మేలు కలుగుతుంది. నీటిలో కొన్నిచుక్కల నిమ్మరసం కలుపుకొని తాగినా మంచి ఫలితాలుంటాయి.