తెలంగాణ

telangana

ETV Bharat / health

టీనేజీ అమ్మాయిల్లో మొటిమలు ఎందుకొస్తాయ్?- పింపుల్స్ రాకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? - How To Stop Pimples Coming On Face - HOW TO STOP PIMPLES COMING ON FACE

How To Stop Pimples Coming On Face : యుక్త వయసులోకి అడుగుపెట్టే అమ్మాయిల్లో శారీరక మార్పులే కాదు, అందం విషయంలోనూ పలు మార్పులు చోటుచేసుకుంటాయని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఈ వయసులో ముఖంపై వచ్చే మొటిమలు వారిని మరింత ఇబ్బంది పెడుతుంటాయంటున్నారు. అయితే, నిజానికి 8 నుంచి 18 ఏళ్ల వయసులో మొటిమలు రావడం సహజమని నిపుణులు చెబుతున్నారు. వీటిని దూరం చేసుకోవాలంటే కొన్ని ఇంటి చిట్కాలు మేలు చేస్తాయని చెబుతున్నారు. అవేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

How To Stop Pimples Coming On Face
How To Stop Pimples Coming On Face (ETV Bharat)

By ETV Bharat Health Team

Published : Sep 29, 2024, 9:39 AM IST

How To Stop Pimples Coming On Face : వయసుతో పాటుగా శరీరంలో పలు మార్పులూ చోటుచేసుకోవడం సహజం అంటున్నారు నిపుణులు. శరీరంలో హార్మోన్ల స్థాయుల్లో మార్పులు రావడం వల్లే ఇలా జరుగుతుంటుందంటున్నారు. అయితే, టీనేజ్‌ దశలో తలెత్తే మొటిమల సమస్యకూ హార్మోన్ల మార్పులే కారణం అని చెబుతున్నారు నిపుణులు. ముఖ్యంగా ఈ దశలో ఆండ్రోజన్‌ అనే లైంగిక హార్మోన్‌ అధికంగా ఉత్పత్తవుతుందని, ఇది చర్మం కింద ఉండే సీబం ( సెబేషియస్‌ గ్రంథి విడుదల చేసే నూనె/ మైనం లాంటి పదార్థం )ను ప్రేరేపించడం ద్వారా నూనె ఎక్కువగా విడుదలయ్యేలా చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. తద్వారా చర్మంపై జిడ్డుదనం పెరుగుతుందంటున్నారు. దీనికితోడు మృతకణాలు, వాతావరణంలోని బ్యాక్టీరియా తోడవడం వల్ల మొటిమలొస్తాయంటున్నారు. అలాగని వీటిని గిల్లకుండా, కొన్ని చిన్నచిన్న చిట్కాలు పాటిస్తే ముఖంపై మచ్చలు, మొటిమల ఆనవాళ్లు లేకుండా తిరిగి సౌందర్యాన్ని పెంపొందించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ముఖంపై జిడ్డుదనం : టీనేజ్‌ వయసులో సీబం ఉత్పత్తి ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ముఖంపై జిడ్డుదనం పెరిగిపోతుందంటున్నారు వైద్య నిపుణులు. అయితే ఇప్పటికే జిడ్డు చర్మతత్వం ఉన్న వారు ఈ విషయంలో మరింత జాగ్రత్తగా వ్యవహరించడం మంచిదని సూచిస్తున్నారు. ఈ క్రమంలో రోజుకు రెండు మూడుసార్లు ముఖాన్ని శుభ్రం చేసుకోవాలంటున్నారు. ఇందుకోసం కలబంద గుజ్జు లేదంటే కలబందతో తయారుచేసిన ఫేస్‌వాష్‌లను ఉపయోగించచ్చని చెబుతున్నారు. దీన్ని మునివేళ్లతో ముఖంపై కాసేపు మర్దన చేసుకొని కొంత సేపటి తరువాత గోరువెచ్చటి నీటితో శుభ్రం చేసుకోవాలని, ఇలా తరచూ చేయడం ద్వారా మొటిమల సమస్య క్రమంగా తగ్గుముఖం పడుతుందంటున్నారు.

బయటికి వెళ్లే ముందు : కొన్నిసార్లు ఎండ వల్ల కూడా మొటిమలు వచ్చే అవకాశం ఉంటుందంటున్నారు నిపుణులు. అందుకనీ బయటికి వెళ్లే ముందు సన్‌స్క్రీన్‌ లోషన్‌ రాసుకోవడం మంచిదని సూచిస్తున్నారు.

గ్రీన్‌ టీ ఇలా : గ్రీన్‌ టీలో ఉండే ఒక రకమైన రసాయనిక సమ్మేళనంలో చర్మానికి మేలు చేసే యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ మైక్రోబియల్‌ గుణాలు ఎక్కువగా ఉంటాయని నిపుణులు తెలుపుతున్నారు. ఇవి ముఖంపై ఏర్పడిన మొటిమల్ని తొలగిస్తాయని చెబుతున్నారు. ఇందుకోసం గ్రీన్‌ టీలో కొద్దిగా తేనె కలిపి... ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి, అరగంట తర్వాత కడిగేసుకోవాలి. లేదంటే గ్రీన్‌ టీ పొడిని ఫేస్‌మాస్క్‌ల్లోనూ ఉపయోగించచ్చని సూచిస్తున్నారు.

ఇలా ట్రై చేయండి : యాపిల్‌ సిడార్‌ వెనిగర్‌లో మొటిమలకు కారణమయ్యే బ్యాక్టీరియాను దూరం చేసే గుణాలు పుష్కలంగా ఉంటాయి. అందుకే ఒక కాటన్‌ బాల్‌తో ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకోని, పావుగంట తర్వాత ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఇలా తరచూ చేస్తుంటే సమస్య తగ్గుముఖం పడుతుందని నిపుణులు చెబుతున్నారు.

సముద్రపు ఉప్పుతో :టీనేజ్‌ వయసులో మొటిమల్ని తగ్గించుకోవడం కోసం వారానికోసారి ముఖాన్ని స్క్రబ్‌ చేసుకోవడం కూడా ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలో బ్రౌన్‌ షుగర్‌, ఓట్‌మీల్‌, కాఫీ పొడి, సముద్రపు ఉప్పు లాంటి సహజసిద్ధమైన పదార్థాలతో స్క్రబ్స్‌ తయారుచేసుకోవడం మేలు చేస్తుందట!

స్క్రీన్‌ టైమ్‌ : యుక్త వయసులో ఉన్న వారు ఎక్కువగా మొబైల్‌, ఇతర ఎలక్ట్రానిక్‌ పరికరాలతో గడపడం మనం చూస్తుంటాం. అయితే, దీనివల్ల ఒత్తిడి పెరిగి మొటిమల సమస్య అధికమవుతుందని నిపుణులు చెబుతున్నారు. అందుకే స్క్రీన్‌ టైమ్‌ను తగ్గించుకోవడం మంచిదని సూచిస్తున్నారు.

వాటికి దూరంగా : తీసుకునే ఆహారంలోనూ పలు మార్పులు చేర్పులు చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఈ క్రమంలో విటమిన్‌ 'ఎ' ఎక్కువగా ఉండే పండ్లు, కాయగూరలకు ప్రాధాన్యమివ్వాలంటున్నారు. ఆకుకూరలు, గుడ్లు, బొప్పాయి, క్యారట్‌, చేపలు లాంటి ఆహారం తీసుకోవాలని సూచిస్తున్నారు. అలాగే చిప్స్‌, బిస్కట్స్‌, శీతల పానీయాలకు దూరంగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

వ్యాయామంతో ప్రయోజనం : వ్యాయామం చేయడం ద్వారా ఒత్తిడిని దూరం చేసి ప్రశాంతంగా ఉండేందుకు ప్రేరేపిస్తుంది. తద్వారా మొటిమల సమస్య నుంచి విముక్తి పొందచ్చని నిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలో రోజూ గంట పాటు మెట్లెక్కడం, నడక, జాగింగ్‌, యోగా, ధ్యానం లాంటి వాటికి ప్రాధాన్యమివ్వాలని నిపుణులు చెబుతున్నారు.

షాంపూతో తలస్నానం : కొంతమందిలో జుట్టు, కుదుళ్లు ఎక్కువగా జిడ్డుగా మారుతుంటాయి. ఇది కూడా ముఖంపై మొటిమలకు కారణమవుతుంటుందని నిపుణులు చెబుతున్నారు. అందుకే ఇలాంటి వాళ్లు వారానికి రెండుసార్లు గాఢత తక్కువగా ఉండే షాంపూతో తలస్నానం చేయడం వల్ల మేలు జరుగుతుందని నిపుణులు సూచిస్తున్నారు.

మేకప్‌ ఎఫెక్ట్ : మేకప్‌ ఉత్పత్తులతో చర్మ రంధ్రాలు మూసుకుపోయే ప్రమాదం ఉంటుందని, తద్వారా అవి మొటిమలకు దారితీస్తుంటాయని నిపుణలు చెబుతున్నారు. కాబట్టి వీటికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని సూచిస్తున్నారు.

గాలి తగిలేలా : కొంతమందికి కేవలం ముఖంపైనే కాకుండా.. ఛాతీ, వీపు పైన కూడా మొటిమలొస్తుంటాయి. ఇలాంటి వారు బిగుతుగా ఉండే దుస్తులు వేసుకోవడం వల్ల వాటిపై రాపిడి జరిగడం ద్వారా సమస్య విస్తరిస్తుందట. అందుకే వదులుగా, చర్మానికి గాలి తగిలేలా దుస్తులు ధరించడం మంచిదని నిపుణలు చెబుతున్నారు.

NOTE:ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

మొటిమలు ఇబ్బంది పెడుతున్నాయా?- కలబందతో ఇలా ట్రై చేయండి - Aloe Vera Gel Benefits For Skin

నెయిల్ ఆర్ట్​ ఎక్కువ కాలం ఉండాలంటే ఏం చేయాలి- గోళ్లకు రంగులు వేసే ముందు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి? - Tips for Nail Art Stay Longer

ABOUT THE AUTHOR

...view details