Can Thyroid Cause Hair Fall :ప్రస్తుతం చాలా మందిని ఇబ్బంది పెడుతున్న ఆరోగ్య సమస్యల్లో ఒకటి థైరాయిడ్. పురుషుల కంటే మహిళలు ఎక్కువగా ఈ సమస్యతో బాధపడుతున్నారు. మెడ ముందు భాగంలో సీతాకొకచిలుక ఆకారంలో ఉంటూ శరీర జీవక్రియను నియంత్రించే హార్మోన్లను విడుదల చేసే థైరాయిడ్ గ్రంథి.. సరిగ్గా పనిచేయకపోవడం వల్ల హైపోథైరాయిడిజం, హైపర్ థైరాయిడిజానికి దారి తీస్తుంది. ఫలితంగా హార్మోన్ల అసమతుల్యత ఏర్పడి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ రావడం, గర్భం దాల్చకపోవడం, బరువు పెరగడం లేదా తగ్గడం, అలసట వంటి సమస్యలు తలెత్తుతుంటాయి.
ఇవేకాకుండా థైరాయిడ్ సమస్యలతో బాధపడుతున్న చాలా మందిలో జుట్టు రాలే సమస్య విపరీతంగా కనిపిస్తుంటుంది. మీరు ఆ జాబితాలో ఉన్నారా? అయితే, అలాంటి వారు జీవనశైలి, ఆహారపుటలవాట్లు, జుట్టు సంరక్షణ విషయంలో కొన్ని ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా జుట్టు రాలే సమస్యను వీలైనంత వరకు తగ్గించుకోవచ్చంటున్నారు నిపుణులు. మరి, ఆ జాగ్రత్తలేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
థైరాయిడ్ కంట్రోల్లో లేనపప్పుడు తలమీద వెంట్రుకలు ఎదిగే ప్రదేశంపై ప్రభావం పడుతుందంటున్నారు డాక్టర్ పెద్ది రమాదేవి. దానివల్ల వెంట్రుకలు రావడం అనేది ఆగిపోతుంది. అలాగే జుట్టు పల్చగా మారుతుంది. దీన్నే డిఫ్యూజ్డ్ ఇన్ హెయిర్ ఫాల్, డిఫ్యూజ్డ్ ఇన్ హెయిర్ గ్రోత్ అని అంటుంటారు. కాబట్టి మీలో ఇలాంటి లక్షణాలు కనిపించినప్పుడు వెంటనే థైరాయిడ్పరీక్షలు చేయించుకోవాలి. ఎందుకంటే ఎర్లీ స్టేజ్లో దీన్ని గుర్తించి మందులు వాడుతూ తగిన జాగ్రత్తలు తీసుకుంటే చాలా వరకు హెయిర్ ఫాల్ అనేది జరగకుండా చూసుకోవచ్చంటున్నారు.
ఇవి లోపించినా హెయిర్ ఫాల్!
ఇకపోతే కొంతమందిలో థైరాయిడ్ కంట్రోల్లో ఉన్నప్పటికీ హెయిర్ ఫాల్ అవుతుంటుంది. అలాంటి వారిలో విటమిన్ డి, కాల్షియం లోపం కారణంగా కూడా జుట్టు రాలే సమస్య ఎక్కువగా ఉండొచ్చంటున్నారు డాక్టర్ రమాదేవి. కాబట్టి అలాంటివారు కాల్షియం లోపంతో బాధపడుతున్నట్లు గుర్తిస్తే.. చేపలు, గుడ్లు, పాల సంబంధిత ఉత్పత్తులు, నువ్వులు, డేట్స్, నట్స్, కొన్ని గింజ ధాన్యాలు వంటి కాల్షియం రిచ్ ఫుడ్స్ డైలీ డైట్లో చేర్చుకోవాలి. అదే థైరాయిడ్ కంట్రోల్లో ఉండి విటమిన్ డి లోపం కారణంగా జుట్టు రాలే సమస్యతో బాధపడుతున్నట్లయితే డి విటమిన్ ఎక్కువగా ఉండే ఆహారాలు తీసుకోవాలని సూచిస్తున్నారు.
అలర్ట్: మీలో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా? - థైరాయిడ్ కావొచ్చు - వెంటనే చెక్ చేసుకోండి!
ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
- థైరాయిడ్ మూలంగా జుట్టు రాలే సమస్యతో బాధపడుతున్నప్పుడు ఒకవైపు అది కంట్రోల్లో ఉండడానికి క్రమం తప్పకుండా తగిన మందులు వాడుతూనే.. ఆహారపుటలవాట్లలో ప్రత్యేకంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు డాక్టర్ పెద్ది రమాదేవి.
- ముఖ్యంగా రోజువారి ఆహారంలో తగినంత అయోడిన్ లభించేలా చూసుకోవాలి. అరటిపండ్లు, క్యారెట్లు, గుడ్డు పచ్చసొన, వెల్లుల్లి, పాలకూర, ఉల్లిపాయలు, బంగాళదుంపల్లో ఇది ఎక్కువగా లభిస్తుంది. కాబట్టి వీటిని ఆహారంలో ఒక భాగంగా చేసుకోవాలి. అలాగే జింక్, బయోటిన్ లభించే వాటిని ఎక్కువగా తీసుకోవాలి.
- అలాగే కొన్ని రకాల ఆహారాలు థైరాయిడ్ హార్మోన్లపై ప్రభావం చూపుతాయి. కాబట్టి, అలాంటి వాటికి దూరంగా ఉండడం మంచిది. అందులో ప్రధానంగా క్యాబేజీ, క్యాలీఫ్లవర్, చిలగడ దుంపలు, ముల్లంగి, పాలిష్డ్ రైస్, గోధుమలు, సోయా ఉత్పత్తులు, కాఫీ, కూల్డ్రింక్స్ వంటివి సాధ్యమైనంత వరకు తక్కువగా తీసుకోవాలి.
- అదేవిధంగా డైలీ వ్యాయామం చేయడాన్ని అలవాటు చేసుకోవాలి. నిత్యం వ్యాయామం చేయడం ద్వారా థైరాయిడ్ హార్మోన్ పనితీరు మెరుగవుతుంది. ఫలితంగా జుట్టు రాలే సమస్యను తగ్గించుకోవచ్చంటున్నారు.
జుట్టు సంరక్షణ విషయంలో కొన్ని జాగ్రత్తలు!
- జుట్టు సంరక్షణ విషయంలోనూ తలస్నానంమొదలు దువ్వడం వరకు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు.
- అందులో కొన్నింటిని చూస్తే.. జుట్టు తత్వాన్ని బట్టి షాంపూలను ఎంచుకోవాలి. వారానికి రెండుసార్లు తలస్నానం చేయాలట.
- పొడి జుట్టు ఉన్నప్పుడు తలస్నానానికి ముందు కొబ్బరి నూనె పెట్టుకోవడం మంచిదంటున్నారు.
- అలాగే తలను పదే పదే దువ్వడం, హెయిర్ డ్రైయర్లను వాడడం వెంట్రుకలకు మేలు చేయదు. ఒత్తిడి, ఆందోళన వంటివి వీలైనంత వరకు తగ్గించుకోవాలి.
- ఇలా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా థైరాయిడ్ కంట్రోల్లో ఉండడమే కాకుండా జుట్టు రాలడాన్ని సాధ్యమైనంత వరకు తగ్గించుకోవచ్చని సూచిస్తున్నారు డాక్టర్ పెద్ది రమాదేవి.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
జుట్టు ఊడిపోతుందని చింతిస్తున్నారా?- ఐతే ఈ చిట్కాలు మీ కోసమే
జుట్టును పదేపదే దువ్వుతున్నారా? వెంట్రుకలు రాలిపోతాయట జాగ్రత్త! హెయిర్ లాస్కు ఆయుర్వేద చిట్కాలు!