తెలంగాణ

telangana

ETV Bharat / health

యూరిక్ యాసిడ్​ ఎక్కువై ఇబ్బంది పడుతున్నారా? ఈ డైట్ పాటిస్తే 'గౌట్' తగ్గిపోతుందట!

-ఈ ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలని నిపుణుల సూచన -అధిక బరువుతోనూ యూరిక్ యాసిడ్ పెరుగుతుందని వెల్లడి

Uric Acid Control Food in Telugu
Uric Acid Control Food in Telugu (Getty Images)

By ETV Bharat Health Team

Published : 4 hours ago

Uric Acid Control Food in Telugu: ప్రస్తుతం చాలా మందిని యూరిక్ యాసిడ్ సమస్య ఇబ్బంది పెడుతుంది. పురుషులు, మహిళలు, అనే బేధం లేకుండా చాలా మంది ఈ సమస్యతో సతమతమవుతున్నారు. దీన్ని తగ్గించుకునేందుకు డాక్టర్లను సంప్రదించి ఏవేవో మందులు వాడుతుంటారు. అయితే యూరిక్​ యాసిడ్ సమస్య​తో బాధపడేవారు ఆహార అలవాట్లలో పలు మార్పులు చేసుకోవాలని.. ముఖ్యంగా కొన్ని ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

మన శరీరం సహజంగా విసర్జించే వ్యర్థ పదార్థాల్లో యూరిక్ యాసిడ్ కూడా ఒకటని నిపుణులు చెబుతున్నారు. మనం తీసుకునే ఆహార పదార్థాల్లోని ప్యూరిన్‌ అనే రసాయనం విచ్ఛిన్నం చెందినప్పుడు యూరిక్‌ యాసిడ్‌ ఏర్పడుతుందని వెల్లడించారు. ఇది ఎప్పటికప్పుడు మూత్రం ద్వారా విసర్జితమవుతుందని తెలిపారు. అయితే విసర్జన సరిగా జరగకపోయినప్పుడు యూరిక్‌ యాసిడ్‌ రక్తంలోనే నిలిచిపోతుందని పేర్కొన్నారు. క్రమంగా ఇవి స్ఫటికాలుగా మారి కీళ్లు, కీళ్ల చుట్టూ ఉండే కణజాలాల్లో పేరుకుపోతాయని అంటున్నారు. శరీరంలో యూరిక్‌ యాసిడ్‌ ఎక్కువగా ఉండే స్థితిని గౌట్‌ అని పిలుస్తుంటారని వివరిస్తున్నారు.

కారణాలివే!

  • హైపో థైరాయిడిజం
  • అధిక బరువు
  • మూత్రపిండాల్లో సమస్యలు
  • శారీరక శ్రమ లేకపోవడం
  • వయసు పైబడడం
  • రోగ నిరోధక శక్తిని తగ్గించే మందులు ఎక్కువగా వాడడం
  • ప్యూరిన్‌ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు తీసుకోవడం

"బరువు పెరుగుతుంటే యూరిక్ యాసిడ్ సమస్య కూడా ఎక్కువ అవుతుంది. అందుకే తప్పనిసరిగా దాన్ని అదుపులో పెట్టుకోవాలి. మీ ఎత్తుకు తగ్గ బరువు ప్రకారం బాడీ మాస్‌ ఇండెక్స్‌ (BMI) 25 కంటే తక్కువగా ఉండేలా చూసుకోవాలి. అలానే ప్రొటీన్‌, ప్యూరిన్‌ ఎక్కువగా ఉండే పదార్థాల మోతాదుని తగ్గించుకోవాలి. తప్పనిసరై అలాంటి పదార్థాలు తీసుకున్నప్పుడు నీళ్లు ఎక్కువగా తాగడం, పండ్ల రసాలు తీసుకోవాలి. ఈ పద్ధతుల వల్ల సహజంగానే బరువు అదుపులోకి వచ్చి సమస్య తీవ్రతా తగ్గుతుంది."

--డాక్టర్ లతాశశి, పోషకాహర నిపుణులు

  • కాంప్లెక్స్‌ కార్బోహైడ్రేట్స్‌ను అందించే కూరగాయలు, పండ్లూ, తృణధాన్యాలను ఎక్కువగా తీసుకోవాలి.
  • లో ఫ్యాట్‌ ఉండే పాలు, పెరుగు, మజ్జిగ, పాల ఉత్పత్తులు తీసుకోవాలి.
  • పాలకూర, క్యాలీప్లవర్‌, బఠాణీలు, పుట్టగొడుగులు తీసుకోవచ్చు. వీటిల్లో ప్యూరిన్‌ మోతాదు ఎక్కువగా ఉన్నప్పటికీ వీటివల్ల ఎదురయ్యే ప్రమాదం తక్కువగానే ఉంటుందట.
  • నీళ్లు ఎక్కువగా తాగాలి. రోజూ కనీసం 2-3 లీటర్ల నీటిని తాగాలి. ముఖ్యంగా పగటిపూట వీలైనంత ఎక్కువగా నీళ్లు తాగడం వల్ల శరీరంలోని యూరిక్‌ యాసిడ్‌తో పాటు ఇతర వ్యర్థపదార్థాలు బయటకు పోతాయి.
  • శరీరంలో నీటి స్థాయులను పెంచుకోవడానికి సీజనల్‌ పండ్లను, ముఖ్యంగా అరటి పండ్లను ఎక్కువగా తీసుకోవాలి.
  • నట్స్‌, స్ర్పౌట్స్‌ను నీటిలో నానబెట్టి తీసుకోవాలి.
  • రాత్రి పడుకునే ముందు పసుపు కలిపిన పాలను తీసుకోవాలి.
  • రోజూ రెండు గుడ్ల వరకు తినవచ్చు.

వీటిని దూరం పెట్టండి!

  • వైట్‌ బ్రెడ్‌, కేకులూ, కూల్‌డ్రింక్స్‌, ఫ్రక్టోజ్‌ ఉండే కార్న్‌ సిరప్‌ వంటివాటికి తీసుకోకూడదు.
  • క్యాండీలూ, కెచప్‌లు, టెట్రా ప్యాక్‌ జ్యూస్‌లు దూరం పెట్టాలి.
  • చాక్లెట్స్‌, చిప్స్‌, బిస్కట్లు, ప్యాకేజ్డ్‌ ఫుడ్స్‌ను మానేయాలి.
  • ఎక్కువ సేపు ఖాళీ కడుపుతో ఉండకండా.. మధ్యమధ్యలో పండ్ల రసాలు, స్నాక్స్ వంటివి తీసుకోవాలి.

ఈ ఆహారపు అలవాట్లతో పాటు శారీరక శ్రమ కూడా తప్పనిసరిగా చేయాల్సి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఎక్కువసేపు కదలకుండా కూర్చోవద్దని వివరిస్తున్నారు. ప్రతి అరగంటకోసారి 3 నిమిషాల పాటు అటూ ఇటూ నడవాలని సూచిస్తున్నారు. వారంలో కనీసం రెండుసార్లు స్ట్రెంత్‌ ట్రైనింగ్‌ ఎక్సర్‌ సైజులు, వ్యాయామాలు, యోగాసనాలు చేయాలని సలహా ఇస్తున్నారు.

NOTE :ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

ఇకపై ఒత్తిడి, ఆందోళనకు చెక్! ఈ 3-3-3 రూల్ పాటిస్తే స్ట్రెస్ రిలీఫ్ పక్కా!

మీ పాదాలు పగిలిపోయాయా? రాత్రి ఇది పెట్టుకుంటే పగుళ్లు మాయం!

ABOUT THE AUTHOR

...view details