Belly Fat Reduction Tips in Telugu:మనలో చాలా మంది అందంగా, సన్నగా కనపడడాలని చూస్తుంటారు. ముఖ్యంగా నాజూకైన నడుమును సొంతం చేసుకోవడానికి అనేక మార్గాల్లో ప్రయత్నిస్తుంటారు. వ్యాయామాలు చేయడం, ఆహారంలో మార్పులు చేసుకోవడం ఇలా ఎన్నో కసరత్తులు చేస్తుంటారు. అయితే, వీటితో పాటు ఈ చిట్కాలు పాటిస్తే ఎంతో మేలు జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
రాత్రి భోజనం ఇలా!
ముఖ్యంగా రాత్రుళ్లు పడుకోవడానికి కనీసం రెండు గంటల ముందే భోజనం ముగించుకోవాలని నిపుణులు చెబుతున్నారు. అప్పుడే తీసుకున్న ఆహారం పూర్తిగా జీర్ణమవుతుందని అంటున్నారు. అలాగే శరీరంలో, పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోకుండా కూడా జాగ్రత్తపడచ్చని సూచిస్తున్నారు. ఫలితంగా నాజూకైన నడుమును సొంతం చేసుకోవచ్చని సలహా ఇస్తున్నారు.
ఎలాంటి ఆహారం?
నాజూకైన నడుమును సొంతం చేసుకోవాలంటే రోజు తీసుకునే ఆహారంలో ఈ మార్పులు చేసుకోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే తక్కువ క్యాలరీలు ఉండే ఆహార పదార్థాలు తీసుకోవాలని సూచిస్తున్నారు. జంక్‌ఫుడ్, వేపుళ్లు, చాక్లెట్లు పక్కన పెట్టేయాలని.. పండ్లు, కూరగాయలు, గుడ్లు, చేపలు మొదలైనవి తినడం అలవాటు చేసుకోవాలని అంటున్నారు. ఇంకా మోనోఅన్‌శ్యాచురేటెడ్ కొవ్వులు మన శరీరానికి ఎంతో అవసరమని చెబుతున్నారు. అందుకే ఇవి ఎక్కువగా లభించే గింజలు, అవకాడో వంటివి తినడం వల్ల శరీరానికి అవసరమైన ఆరోగ్యకరమైన కొవ్వులు అందడంతో పాటు బరువును కూడా అదుపులో ఉంచుకోవచ్చని తెలిపారు. ప్రొటీన్లు ఎక్కువగా లభించే బీన్స్, నట్స్‌ని ఆహారంలో చేర్చుకుంటే ఎక్కువ సమయం కడుపు నిండుగా ఉంటుందంటున్నారు. ఫలితంగా ఆహారపు కోరికల్ని అదుపులో ఉంచుకోని.. బరువునూ నియంత్రించుకోవచ్చని సూచిస్తున్నారు.