Social Media Pressures On Teenagers :ప్రస్తుత డిజిటల్ యుగంలో.. ఎవరి చేతిలో చూసినా మొబైల్ ఫోన్ కనిపిస్తుంది. అందులో కామన్ పాయింట్ ఏమంటే.. అందరి ఫోన్లలోనూ సోషల్ మీడియా అకౌంట్స్ ఉంటాయి. అయితే.. కొందరు పరిమితంగానే సామాజిక మాధ్యమాల్లో టైమ్ స్పెండ్ చేస్తుంటారు. మరికొందరు మాత్రం గంటల తరబడి అందులోనే మునిగిపోతుంటారు. ఇలాంటి వారు క్రమంగా తమకు తెలియకుండానే ఒత్తిడి,ఆందోళనకు గురవుతున్నారని నిపుణులు చెబుతున్నారు. ఇందులో టీనేజర్స్, యువకులే అధికంగా ఉంటున్నారు. ఇలాంటి వారు.. ఈ సోషల్ మీడియా స్ట్రెస్ నుంచి ఎలా బయట పడాలో ఇప్పుడు తెలుసుకుందాం.
నేనే గొప్ప : అందరికన్నా నేనే గొప్పగా ఉండాలనేది మనిషి సహజ లక్షణం. ఇదే ధోరణి సోషల్ మీడియాలో కూడా ప్రదర్శిస్తుంటారు. తాము పెట్టిన పోస్టుకు వందలు, వేలుగా లైకులు రావాలని కోరుకుంటారు. ఆ పోస్టు ద్వారా.. తాము వ్యక్తం చేసిన అభిప్రాయాన్ని మిగిలిన వారంతా ఒప్పుకోవాలని, మెచ్చుకోవాలని కోరుకుంటారు. ఇలా జరగకపోతే.. తెగ బాధపడిపోతుంటారు. లైకులు రాలేదని మదనపడుతుంటారు. తమ అభిప్రాయాన్ని వ్యతిరేకించారని కోపం తెచ్చుకుంటారు. కామెంట్ల రూపంలో యుద్ధం కూడా చేస్తుంటారు.
ఇతరులతో పోల్చుకోవడం :సోషల్ మీడియాలో ఎక్కువగా ఉండే వారు ఇతరులతో తమను పోల్చుకుంటారు. ఎదుటి వారి లైఫ్‌స్టైల్ చూస్తూ.. తాము అలా ఉండలేకపోతున్నామని ఫీలవుతుంటారు. అలా తమను తాము తక్కువగా అంచనా వేసుకుంటారు. దీనివల్ల వారికి తెలియకుండానే మానసికంగా ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంటుంది.
నిద్రకు దూరం అవుతారు:సోషల్ మీడియాకు ఎందుకు వచ్చామనే విషయం నూటికి 90 మందికి తెలియదు. అందరూ వాడుతున్నారు కాబట్టి.. నేనూ వాడాలి అన్నట్టుగా వాడుతుంటారు. ఇలాంటి వారు పోస్టులు, రీల్స్ చూస్తూ వెళ్లిపోతుంటారు. దానికి అంతం అనేదే ఉండదు కదా.. ఒక చేత్తో ఫోన్ పట్టుకొని, మరో చేత్తో పైకి స్క్రోల్ చేస్తూ వెళ్తారు. నిమిషాలు, గంటలు దాటి సాగుతూనే ఉంటుంది. ఆయా రీల్స్, వీడియోలు, పోస్టుల్లోని అంశాలను తమకు అప్లై చేసుకుంటూ.. మూడ్ స్వింగ్స్కు లోనవుతుంటారు. ఇలా.. అర్ధరాత్రి వేళ వరకూ ఫోన్ ఉపయోగిస్తూనే ఉంటారు. ఇలా సోషల్ మీడియా ఒత్తిడితోపాటు, నిద్రలేమితో వచ్చే ఒత్తిడిసైతం బ్రెయిన్‌పై పడతుంది.