How to Do Head Bath Properly: మీరు రోజు తలస్నానం చేస్తున్నారా? ఇంకా కొందరైతే జుట్టు కాస్త డల్‌గా, రఫ్‌గా కనిపించిన వెంటనే తలస్నానం చేసేస్తుంటారు. కానీ, అలా చేయడం జుట్టుకు మంచిదేనా? అసలు ఎన్ని రోజులకోసారి తలస్నానం చేయాలి? తలస్నానం చేసే ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? లాంటి ప్రశ్నలకు సమాధానాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ఎన్ని రోజులకోసారి చేస్తున్నారు?
దుమ్ము, ధూళి, వాతావరణ కాలుష్యం, పొగ.. ఇలా వివిధ కారణాల వల్ల జుట్టు తొందరగా రఫ్‌గా, డల్‌గా మారిపోతుంది. దీంతో జుట్టు తిరిగి మృదువుగా, ఆరోగ్యంగా కనిపించాలని వెంటనే తలస్నానం చేసేస్తుంటారు. అయితే, రెండు రోజులకోసారి తలస్నానం చేయడం వల్ల చుండ్రు పోయి జుట్టు ఆరోగ్యం మెరుగపడుతుందని నిపుణులు అంటున్నారు. 2018లో Journal of Cosmetic Dermatology ప్రచురితమైన "The Effect of Scalp Washing Frequency on Dandruff and Scalp Conditions" అధ్యయనంలో తేలింది. ఒకవేళ మీది సాధారణ, పొడి జుట్టు అయితే వారానికి రెండుసార్లు మాత్రమే తలస్నానం చేస్తే సరిపోతుందని వివరిస్తున్నారు. ముఖ్యంగా తలస్నానం చేసే సమయంలో గాఢత తక్కువగా ఉండే షాంపూనే ఉపయోగించాలని చెబుతున్నారు.
తల స్నానం ఇలా చేయాలట
తలస్నానం చేయాలనుకునే వారు ముందుగా జుట్టు చిక్కులు తీసి దువ్వుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఫలితంగా తలస్నానం చేసేటప్పుడు జుట్టు రాలడం కొంతవరకు తగ్గించుకోవచ్చని వివరిస్తున్నారు. అలాగే బిరుసుగా ఉన్న వెంట్రుకలు కూడా తెగిపోకుండా కాపాడుకోవచ్చని అంటున్నారు. తలస్నానానికి ముందుగా నీళ్లతో జుట్టుని బాగా తడపాలని సలహా ఇస్తున్నారు. ఆ తర్వాత నీళ్లలో షాంపూను కలిపి ఈ మిశ్రమాన్ని తలపై పోసుకొని.. కుదుళ్లను రెండు నిమిషాల పాటు గుండ్రంగా రుద్దుతూ మసాజ్ చేసి గోరువెచ్చని నీటితో కడిగేసుకోవాలని చెబుతున్నారు. ఫలితంగా కుదుళ్లు బాగా శుభ్రపడి రక్తప్రసరణ మెరుగుతుందని తెలిపారు. ఇంకా జుట్టు రాలిపోయే సమస్య కూడా తగ్గుముఖం పడుతుందని పేర్కొన్నారు.
గోరువెచ్చని నీరు
అయితే, తలస్నానం చేసే సమయంలో మరీ చల్లని లేదా బాగా వేడిగా ఉండే నీళ్లను ఉపయోగించకూడదని నిపుణులు సూచిస్తున్నారు. ఇలా చేయడం వల్ల కుదుళ్ల లోపల ఉండే సెబేషియస్ గ్రంథులు దెబ్బతింటాయని హెచ్చరిస్తున్నారు. ఫలితంగా ఆ ప్రాంతంలో జుట్టు పల్చగా అయిపోయి, తేమను కూడా కోల్పోతుందని వివరిస్తున్నారు. అందుకే తలస్నానానికి ఉపయోగించే నీళ్లు మరీ చల్లగా, మరీ వేడిగా కాకుండా.. గోరు వెచ్చగా ఉండేలా చూసుకోవడం ఉత్తమమని సలహా ఇస్తున్నారు.