Kidney Cancer Warning Signs :మన బాడీలో కిడ్నీలు(Kidneys) చాలా కీలకమైన అవయవాలు. అవి నిరంతరం రక్తాన్ని శుద్ధి చేస్తూ.. వ్యర్థాలను వడగట్టి యూరిన్ ద్వారా బయటకు పంపుతాయి. కాబట్టి, కిడ్నీల్లో చిన్న సమస్య తలెత్తినా పెద్ద చిక్కులు ఎదురయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇందులో కిడ్నీ క్యాన్సర్ చాలా పెద్ద సమస్య. దీని బారినపడకుండా ప్రారంభ దశలోనే గుర్తించడం చాలా అవసరమని నిపుణులు సూచిస్తున్నారు. కొన్ని లక్షణాలు కనుక మీలో కనిపిస్తే అది మూత్రపిండ క్యాన్సర్ కావొచ్చని హెచ్చరిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. అవేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
కిడ్నీ క్యాన్సర్ సంకేతాలు, లక్షణాలు :
కిడ్నీ క్యాన్సర్‌కు సంబంధించిన ముందస్తు లక్షణాలను విస్మరించకూడదంటున్నారు దిల్లీకి చెందిన సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ తుషార్ ఆదిత్య నరైన్. ముఖ్యంగా ఇప్పుడు చెప్పబోయే లక్షణాలు కనిపిస్తే ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యుడిని సంప్రదించడం మంచిదని సూచిస్తున్నారు. అవేంటంటే..
- పొత్తికడుపు పైభాగంలో పెయిన్(పార్శ్వ నొప్పి)
- లో బ్యాక్ పెయిన్(ఒక వైపు మాత్రమే)
- మూత్రంలో రక్తం(హెమటూరియా)
- వివరించలేని బరువు తగ్గడం
- అధిక రక్తపోటు
- ఎముక నొప్పి
- జ్వరం
- ఆకలి లేకపోవడం
ఇవన్నీ కిడ్నీ క్యాన్సర్ సాధారణ లక్షణాలు కావొచ్చని డాక్టర్ తుషార్ ఆదిత్య నరైన్ చెబుతున్నారు. 2021లో 'నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్' అనే జర్నల్‌లో ప్రచురితమైన నివేదిక ప్రకారం.. మూత్రంలో రక్తం పడే వ్యక్తులలో కిడ్నీ క్యాన్సర్ నిర్ధారణ అయ్యే అవకాశం 50% ఎక్కువ. అయితే, చాలా మందిలో పైన పేర్కొన్న లక్షణాలు తొలినాళ్లలో కనిపించకపోవచ్చు. కాబట్టి, ఈ లక్షణాలను ముందస్తుగా గుర్తించడానికి.. ముఖ్యంగా 50 ఏళ్లు పైబడిన వారు, ధూమపానం చేసేవారు రెగ్యులర్ హెల్త్ చెకప్‌లు చేయించుకోవడం అవసరమని వైద్యులు సూచిస్తున్నారు.