How To Avoid Urinary Problems in Summer :ఎండలు విజృంభిస్తున్నాయి. భానుడి ప్రతాపానికి బయట కొద్దిసేపు తిరిగితేనే నీరసం, నిస్సత్తువ, అలసట ఆవహించేస్తున్నాయి. ఇలాంటి వాతావరణంలో మూత్ర సంబంధిత సమస్యలు చుట్టుముట్టే ఛాన్స్ ఉంటుంది ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. వీటిని అధిగమించడానికి కొన్ని టిప్స్ ఫాలో కావాలని సూచిస్తున్నారు. అవేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
హైడ్రేటెడ్‌గా ఉండండి : వేడి వాతావరణంలో డీహైడ్రేషన్‌కు గురైతే మూత్రం గాఢతకు దారితీస్తుంది. ఇది మూత్రపిండాల్లో రాళ్ల ప్రమాదాన్ని కూడా పెంచుతుంది. కాబట్టి డైలీ కనీసం 8-10 గ్లాసుల నీరు తాగుతూ బాడీని ఎప్పుడూ హైడ్రేటెడ్‌గా ఉంచాలని సూచిస్తున్నారు నిపుణులు.
కెఫెన్, ఆల్కహాల్ అధికంగా తీసుకోకండి : కాఫీ, టీ, ఆల్కహాల్ వంటి పానీయాలు మూత్రవిసర్జనపై ప్రభావం చూపిస్తాయి. ఇవి మూత్ర ఉత్పత్తిని పెంచడానికి, డీహైడ్రేషన్‌కు దారితీస్తాయి. కాబట్టి ఎండాకాలం ఈ పానీయాలను అధికంగా తీసుకోకపోవడమే మంచిది అంటున్నారు.
2015లో "జర్నల్ ఆఫ్ ది అమెరికన్ మెడికల్ అసోసియేషన్" అనే జర్నల్‌లో ప్రచురితమైన నివేదిక ప్రకారం.. ఎండాకాలంలో రోజుకు 3 కప్పుల కంటే ఎక్కువ కాఫీ తాగే వ్యక్తులలో డీహైడ్రేషన్ అయ్యే ప్రమాదం 20% ఎక్కువగా ఉందని తేలింది. ఈ పరిశోధనలో యూఎస్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్‌కు చెందిన ప్రముఖ డాక్డర్ మైఖేల్ ఫెర్రీ పాల్గొన్నారు. సమ్మర్లో డైలీ ఎక్కువ కాఫీ తాగే వ్యక్తులలో బాడీ ఎక్కువగా డీహైడ్రేషన్‌కు లోనయ్యే ఛాన్స్ ఉందని పేర్కొన్నారు.
ఈ ఫ్యాబ్రిక్స్ ధరించండి : సమ్మర్లో ఎండ వేడిమి నుంచి ఉపశమనం పొందడానికి కాటన్‌తో తయారు చేసిన తేలికైన, వదులుగా ఉండే దుస్తులను ఎంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇవి మీ శరీరానికి తగినంత గాలి ప్రసరించడానికి తోడ్పడతాయి. అలాగే.. మీ బాడీ ఉష్ణోగ్రతను నియంత్రించడంలో, అధిక చెమటను నిరోధించడంలో చాలా బాగా సహాయపడతాయని సూచిస్తున్నారు.