Digestion Problem Solution : వర్షాకాలంలో అరుగుదల సమస్య చాలా సాధారణమైనది. అధిక తేమ కారణంగా ఈ సీజన్లో జీర్ణవ్యవస్థ పనితీరు మందగిస్తుంది. చల్లటి, తేమతో నిండిన వాతావరణం బ్యాక్టీరియా పెరుగుదలను ప్రోత్సహించడమే కాక, నీటిని, ఆహారాన్ని కలుషితం చేసి అనారోగ్యానికి కారణమవుతుంది. ముఖ్యంగా వర్షాకాలంలో ఎక్కువ మంది వేయించిన ఆహారం, స్పైసీ ఫుడ్స్‌ను తీసుకుంటారు. ఫలితంగా జీర్ణవ్యవస్థపై ఎక్కువ భారం పడి అరుగుదల మందగిస్తుంది. ఈ నేపథ్యంలోనే వర్షాకాలంలో ఎక్కువ మంది ఎదుర్కొనే ఈ అజీర్తిని నియంత్రించడానికి ప్రముఖ పోషకాహార నిపుణులు కొన్ని ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు.
గోధుమలు:
అనేక ఆహార పదార్థాల్లో ప్రధానమైనది గోధుమ. కానీ దీంట్లోని అధిక గ్లూటెన్ కంటెంట్ ఉబ్బరం వంటి అసౌకర్యాన్ని కలిగిస్తుంది. ముఖ్యంగా గ్లూటెన్ సెన్సిటివిటీలు, ఉదరకుహర వ్యాధి ఉన్నవారిలో సమస్య మరింత తీవ్రంగా కనిపిస్తుంది. వర్షాకాలంలో జీర్ణవ్యవస్థ బలహీనంగా ఉంటుంది. అలాంటి సమయంలో గ్లూటెన్ వంటి భారీ ఆహారాలను జీర్ణం చేయడం కష్టతరంగా మారుతుంది. కనుక వర్షాకాలంలో వీలైనంత వరకు బ్రెడ్, పేస్ట్రీలు వంటి గోధుమ ఉత్పత్తులకు దూరంగా ఉండటం మంచిది.
బార్లీ:
బార్లీలో ఫైబర్, పోషకాలు ఎక్కువగా ఉంటాయి. అయినప్పటికీ దీన్ని తినడం వల్ల శరీర బరువు పెరుగుతుంది. ముఖ్యంగా వర్షాకాలం వంటి తేమతో కూడిన వాతావరణంలో బార్లీ జీర్ణం కావడం కష్టమవుతుంది. అజీర్తితో పాటు ఉబ్బరం, గ్యాస్ వంటి అసౌకర్యాలకు కారణమవుతుంది.
మిల్లెట్స్:
మిల్లెట్స్‌లో పోషకాలు ఎక్కువగా ఉన్నందున ఇవి జీర్ణం కావడం కష్టం. మరీ ముఖ్యంగా తేమతో కూడిన వాతావరణం కారణంగా జీర్ణక్రియ మందగించినప్పుడు మిల్లెట్స్ వంటి భారీ ధాన్యాలను ప్రాసెస్ చేయడం జీర్ణవ్యవస్థకు సవాలుగా మారుతుంది. ఫలితంగా అజీర్తి, ఉబ్బరం, గ్యాస్, కడుపులో అసౌకర్యం వంటి సమస్యలు తలెత్తుతాయి.