Shavasana Brain Booster : ఉరుకులు పరుగుల ప్రపంచంలో మెదడుకు కాస్తయినా రిలాక్సేషన్ దొరుకుతుందా? రోజంతా శ్రమించి రాత్రికి ఇంటికి చేరుకోవడం, ఏదో ఆలోచిస్తూనే పడుకోవడం, ఉదయం లేవగానే మళ్లీ దినచర్య మొదలుపెట్టడం, ఇవన్నీ తప్పక చేయాల్సిందే. ప్రశాంతతే లేని జీవన విధానంతో గడిపేస్తూ మనల్ని మనం మోసం చేసుకుంటున్నాం. ముఖ్యంగా మనల్ని నడిపించే మెదడును చాలా కష్టపెడుతున్నాం. దానికి కూడా కాస్త విశ్రాంతిని, ఫ్రెష్ ఎనర్జీని ఇస్తే మరింత ఉత్తేజవంతంగా పనిచేస్తుంది. అది కూడా ఎటువంటి మెడిసిన్స్ లేకుండా ఆసనాల ద్వారానే సాధ్యపడుతుందంటే మరీ మంచిది కదా. ఇంకెందుకు ఆలస్యం తెలుసుకుందాం రండి.
మెదడు పనితీరుపై ప్రభావం
శాంతి ఆసనం, అమృతాసనం, శవాసనం ఇలా ఏ పేరుతో పిలిచినా ఒకటే. కొన్ని శతాబ్దాలుగా మెదడులోని శక్తిని ఉత్తేజితం చేసేందుకు వినియోగిస్తున్న ఆసనమిది. ప్రధానంగా ఇది మెదడుపై ఒత్తిడిని తొలగించి ప్రశాతంతనిస్తుంది. మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది. మరి దీనిని ఎలా వేయాలంటే?
ఈ ఆసనాన్ని వేసే ముందు పేరుకు తగ్గట్టుగానే శవంలాగే ముందు వెల్లకిలా పడుకోవాలి. మోచేతులను, కాళ్లను చాపి ఉంచి కళ్లు మూసుకుని ప్రశాంతంగా గాలి పీల్చుకోవాలి. ఇది చాలా సింపుల్ గా ఉందని లైట్ అనుకోవద్దు. వాస్తవానికి దీనిని యోగా ప్రక్రియ ముగించే సమయంలో వేయాలి. యోగాసనాల్లో దీనికి అత్యున్నత ప్రాముఖ్యం ఉంది.
శ్వాస మీద ధ్యాస
ఈ ఆసనంతో శరీరంలో కదలికలను నియంత్రిస్తూ శవం మాదిరిగా నిశ్చలంగా ఉంచడమే లక్ష్యంగా పెట్టుకోవాలి. దీని ఫలితంగా శ్వాస మీదనే ధ్యాస ఉంచడం సాధ్యమవుతుంది. అలా శారీరకంగా, మానసికంగా విశ్రాంతి దొరుకుతుంది. శరీరం ఈ స్థితిలో ఉన్నప్పుడు కార్డిసాల్ స్థాయిలు తగ్గుతాయి. హృదయ స్పందన, రక్తపోటు తగ్గుతాయి. అలా మైండ్‌ను రీసెట్ చేయడానికి సహకరిస్తుంది