How Many Hours to Sit Stand and Sleep for Good Health : ఆరోగ్యంగా ఉండాంటే రోజులో ఎంత సమయం నిలబడాలి? కూర్చోవాలి? ఫిజికల్ యాక్టివిటీకి ఎంత టైమ్ కేటాయించాలి? అనే విషయం చాలా మందికి తెలియదు. ఇలాంటి వారంతా ఇటీవల ఆస్ట్రేలియా పరిశోధకులు నిర్వహించిన అధ్యయనం గురించి తెలుసు కోవాల్సిందే. మరి.. ఆ రీసెర్చ్‌లో ఏం తేలిందనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.
ఆస్ట్రేలియాలోని స్విన్‌బర్న్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ నేతృత్వంలోని అంతర్జాతీయ పరిశోధకుల బృందం ఈ అధ్యయనాన్ని చేపట్టింది. ఈ పరిశోధనలో పాల్గొన్న 40-75 సంవత్సరాల వయస్సు గల 2,000 మంది ప్రవర్తనను విశ్లేషించారు. 24 గంటల వ్యవధిలో వారు తమ సమయాన్ని ఎలా గడిపారో విశ్లేషించి.. మెరుగైన ఆరోగ్యం కోసం కూర్చోవడం, నిద్రపోవడం(Sleeping), నిలబడడం, శారీరకంగా చురుకుగా ఉండటం కోసం ఒక వ్యక్తి రోజులో ఎంత సమయం కేటాయించాలో కనుగొన్నారు. ఈ పరిశోధన వివరాలు.. 'డయాబెటోలోజియా' జర్నల్‌లో ప్రచురితమయ్యాయి.
ఆ జర్నల్‌లో ప్రచురితమైన నివేదిక ప్రకారం.. మంచి ఆరోగ్యం కోసం ఒక వ్యక్తి డైలీ 8 గంటల 20 నిమిషాలు నిద్రపోవాలని పరిశోధకులు సూచించారు. అలాగే రోజుకు 5 గంటల 10 నిమిషాలు నిలబడాలని, 6 గంటలు కూర్చోవాలని కనుగొన్నారు. అంతేకాదు.. రోజూ 4 గంటల 20 నిమిషాల పాటు తేలికపాటి నుంచి మితమైన శారీరక శ్రమ ఉండేలా చూసుకోవాలని ఈ పరిశోధకులు పేర్కొన్నారు. ఇలా క్రమం తప్పకుండా శారీరక శ్రమ చేయడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుందని సూచించారు.
పరిశోధకుల అభిప్రాయం ప్రకారం.. తేలికపాటి శారీరక శ్రమ అంటే.. నడవడం నుంచి వంట చేయడం, ఇంటి పనులను పూర్తి చేయడం, అలాగే బిగ్గరగా నవ్వడం వరకు ఏదైనా కావచ్చని వారు తెలిపారు. అలాగే.. మితమైన శారీరక శ్రమ కోసం వాకింగ్ లేదా సైక్లింగ్, జాగింగ్, జంపింగ్, ఏరోబిక్ డ్యాన్స్ వంటివి చేస్తుండటం వల్ల ఆరోగ్యంగా ఉండవచ్చని పరిశోధకులు సూచిస్తున్నారు.