How Does Screen Time Affect Kids :చాలా మంది పిల్లలు కొంచెం టైమ్ దొరికినా.. టీవీ, ఫోన్ చూస్తూ వాటికే అతుక్కుపోతున్నారు. ఇది ప్రతీ ఇంట్లో సర్వసాధారణమైపోయింది. అయితే.. పిల్లలు ఎక్కువసేపు ఫోన్‌లు, టీవీలు, ల్యాప్‌టాప్స్ చూడటం వల్ల దీర్ఘకాలంలో అనారోగ్య సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
రీసెర్చ్‌లో కీలక విషయాలు :
పిల్లలు ఎక్కువసేపు స్క్రీన్ చూడటం వల్ల మానసిక ఆరోగ్యం దెబ్బతింటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీనిపై యూనివర్సిటీ ఆఫ్ సౌతర్న్ డెన్మార్క్ వారు పిల్లల మానసిక ఆరోగ్యంపై స్కీన్ టైమ్ ప్రభావం ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి ఒక అధ్యయనం చేపట్టారు. ఈ పరిశోధన వివరాలు "Computers in Human Behavior" అనే జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. ఈ అధ్యయనం ప్రకారం.. స్క్రీన్ టైమ్ ఎంత పెరిగితే.. పిల్లల మానసిక ఆరోగ్యంపై అంత ప్రభావం పడుతుందని పరిశోధకులు గుర్తించారు.
మీ పిల్లలు అస్సలు ఫోన్ వదలట్లేదా? డోంట్ వర్రీ - ఈ టిప్స్ మీకోసమే!
ఈ రీసెర్చ్‌లో 8 నుంచి 17 సంవత్సరాల వయసు కలిగిన పిల్లలు 500 మంది పాల్గొన్నారు. స్క్రీన్ సమయం, మానసిక ఆరోగ్య లక్షణాలు, ఇతర అంశాల మధ్య సంబంధాన్ని పరిశీలించారు. ఫలితాల తర్వాత.. స్క్రీన్ సమయాన్ని వారానికి సగటున మూడు గంటలకు తగ్గించిన రెండు వారాల్లోనే పిల్లల్లో ఆందోళన, నిరాశ, ఒత్తిడి వంటి మానసిక సమస్యల్లో తగ్గుదల కనిపించినట్లు కనుగొన్నారు. ఈ పరిశోధనలో డెన్మార్క్‌లోని యూనివర్సిటీ ఆఫ్ సౌతర్న్ డెన్మార్క్‌లో సైకాలజీ ప్రొఫెసర్ 'డాక్టర్ రైన్ హెబో హెజ్లెసెన్' పాల్గొన్నారు.
ఎన్నో సమస్యలు..
- పిల్లలు గంటల తరబడి టీవీ, ఫోన్ చూడడం వల్ల.. మానసిక సమస్యలతోపాటు మరిన్ని సమస్యలు ఎదుర్కొంటారని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
- టీవీ, ఫోన్లో మునిగిపోతే.. జంక్‌ఫుడ్, చిప్స్ వంటివి ఎక్కువ తింటారు.
- అలాగే వారు ఆటలు ఆడటానికి బయటకు వెళ్లకపోవడంతో బరువు పెరిగిపోతారని నిపుణులు చెబుతున్నారు.
- నైట్ పడుకునే ముందు టీవీలు, ఫోన్‌లు చూడటం వల్ల పిల్లలు ఆలస్యంగా నిద్రపోతారు. దీనివల్ల ప్రశాంతమైన నిద్ర కరువవుతుందని చెబుతున్నారు.
- "అమెరికన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్" నివేదిక ప్రకారం.. రెండేళ్లలోపు వయసున్న పిల్లల చేతికి స్మార్ట్‌ఫోన్ అస్సలే ఇవ్వకూడదు.
- అలాగే అంతకంటే ఎక్కువ వయసున్న వారు రోజుకు గంట నుంచి రెండు గంటలు మాత్రమే స్క్రీన్ చూడాలని నిపుణులు చెబుతున్నారు.
- టీవీ, మొబైల్, ల్యాప్‌టాప్, కంప్యూటర్ వంటివి ఏవైనా రెండు గంటల కంటే ఎక్కువగా చూస్తే ప్రమాదమేనని అంటున్నారు.